Rishab Shetty: 'కాంతార చాప్టర్ 1'పై ప్లాస్టిక్ బాటిల్ వివాదం: 4వ శతాబ్దంలో 20 లీటర్ల క్యాన్ ఎలా వచ్చింది?

Rishab Shetty: 'కాంతార చాప్టర్ 1'పై ప్లాస్టిక్ బాటిల్ వివాదం: 4వ శతాబ్దంలో 20 లీటర్ల క్యాన్ ఎలా వచ్చింది?

కన్నడ హీరో రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో వచ్చిన చిత్రం  'కాంతార: చాప్టర్ 1'.  దసరా సందర్భంగా అక్టోబర్ 2 న విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది.  ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా సుమారు రూ. 655 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. మొదటి భాగం 'కాంతార' ఘన విజయం తర్వాత వచ్చిన ఈ ప్రీక్వెల్, మరోసారి కథనం, విజువల్ ఎఫెక్ట్స్, రిషబ్ నటనతో ప్రేక్షకులను అద్భుతమైన లోకంలోకి తీసుకెళ్లింది. అయితే ఈ సినిమా విడుదలైన తర్వాత ఒక చిన్న పొరపాటు ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది.

 'కాంతార: చాప్టర్ 1'లో  ప్లాస్టిక్ వాటర్ క్యాన్!

 'కాంతార: చాప్టర్ 1' ఒక సన్నివేశానికి సంబంధించిన వీడియో క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. దానిపై నెటిజన్లు  విపరీతంగా ట్రోలింగ్ మొదలు పెట్టారు. ఈ సినిమా కథా నేపథ్యం 4వ శతాబ్దం AD నాటి చరిత్రను చూపిస్తుంది. అయితే అందులోని ఒక ముఖ్యమైన సామూహిక భోజన సన్నివేశంలో ఆధునిక ప్లాస్టిక్ వాటర్ క్యాన్ కనిపించడం పెద్ద అనాక్రోనిజంగా మారింది. దీనిపై సోషల్ మీడియాలో పెద్ద చర్చే నడుస్తోంది.

ఏ దృశ్యంలో కనిపించింది?

ఈ వివాదం 'బ్రహ్మకలశ' పాటలో వచ్చే కమ్యూనిటీ లంచ్ సీక్వెన్స్‌లో జరిగింది. గ్రామం మొత్తం కలిసి భోజనం చేస్తున్న ఈ సన్నివేశంలో, అందరి దృష్టిని తప్పించుకున్న ఒక 20 లీటర్ల ప్లాస్టిక్ వాటర్ క్యాన్ స్పష్టంగా కనిపించింది. ప్లాస్టిక్ అనేది 4వ శతాబ్దంలో కాలంలో  లేని వస్తువు కాబట్టి, ఈ పొరపాటుపై నెటిజన్లు వెంటనే కామెంట్ల వర్షం కురిపించారు. ఒక యూజర్ అయితే గేమ్ ఆఫ్ థ్రోన్స్ కాఫీ కప్పు సంఘటనను హోంబలే ఫిలిమ్స్ కాంతారలో కూడా పునరావృతం చేసింది అంటూ పోస్ట్ చేయగా, మరొకరు గాట్ (GOT) స్టార్‌బక్స్ మూమెంట్ ఇక్కడ కాంతారలో కనిపించింది అని వ్యాఖ్యానించారు.

గేమ్ ఆఫ్ థ్రోన్స్‌తో పోలిక!

ప్రపంచ ప్రఖ్యాత టీవీ సిరీస్ 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' (Game of Thrones) చివరి సీజన్‌లో, ఒక ముఖ్యమైన విందు సన్నివేశంలో పాత్రల పక్కన ఆధునిక స్టార్‌బక్స్ కాఫీ కప్ కనిపించింది. అప్పట్లో ఈ ఒక్క దృశ్యం ప్రపంచవ్యాప్తంగా పెద్ద ట్రోలింగ్‌కు, నిర్మాణ లోపానికి నిదర్శనంగా నిలిచింది. ఇప్పుడు 'కాంతార చాప్టర్ 1'లో అంతకు మించిన ఘోరమైన పొరపాటు ఒక ప్లాస్టిక్ క్యాన్ కనిపించడంతో, సోషల్ మీడియాలో మీమ్స్ వెల్లువెత్తుతున్నాయి.

►ALSO READ | Stranger Things 5: ఒక్కో ఎపిసోడ్‌ బడ్జెట్ రూ. 550 కోట్లు ఏంటి భయ్యా? నెట్‌ఫ్లిక్స్ అరాచకం మాములుగా లేదుగా!

అయితే, కొంతమంది అభిమానులు దీనిని తేలికగా తీసుకున్నారు. ఇది ఎడిటర్ల నిజాయితీ గల పొరపాటుగా కనిపిస్తోంది, పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని నెటిజన్ కామెంట్ చేశారు. మరొకరు నిర్మాతల దృష్టికి తీసుకెళ్తూ, దయచేసి ఈ చిన్న కంటిన్యూటీ పొరపాటును గుర్తించి, ఆ ప్లాస్టిక్ క్యాన్‌ను తొలగించండి అని నిర్మాణాత్మకంగా సూచించారు.

హోంబలే ఫిలిమ్స్ (Hombale Films) సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో ఇలాంటి సాధారణ పొరపాటు జరగడం పట్ల కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ వివాదంపై చిత్ర బృందం నుండి ఇప్పటి వరకు ఎలాంటి స్పందన రాలేదు. అయితే, ఈ చిన్న పొరపాటు పక్కన పెడితే, సినిమా మాత్రం అద్భుతమైన కలెక్షన్లను సాధిస్తూ, కథాబలం , సాంకేతికత విషయంలో ప్రశంసలు అందుకుంటోంది. ఈ ప్లాస్టిక్ క్యాన్ ఎడిటింగ్ పొరపాటును త్వరలోనే సవరించాలని అభిమానులు కోరుకుంటున్నారు.