Stranger Things 5: ఒక్కో ఎపిసోడ్‌ బడ్జెట్ రూ. 550 కోట్లు ఏంటి భయ్యా? నెట్‌ఫ్లిక్స్ అరాచకం మాములుగా లేదుగా!

Stranger Things 5: ఒక్కో ఎపిసోడ్‌ బడ్జెట్ రూ. 550 కోట్లు ఏంటి భయ్యా? నెట్‌ఫ్లిక్స్ అరాచకం మాములుగా లేదుగా!

నెట్‌ఫ్లిక్స్ చరిత్రలోనే అత్యంత ప్రజాదరణ పొందిన సిరీస్‌లలో 'స్ట్రేంజర్ థింగ్స్' ఒకటి.  ఈ అమెరికన్  సిరీస్ తొలి సీజన్ జూలై 15, 2016న నెట్ ఫ్లిక్స్ లో విడుదలైంది. ఇప్పటి వరకు నాలుగు సీజన్స్  ప్రేక్షకులను అలరించగా.. ఐదోది సిద్ధం అవుతోంది.   ఎలెవన్ (Eleven) ఆమె స్నేహితుల కథ ఎలా ముగుస్తుందో తెలుసుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు మూడేళ్లుగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ఈ ఐదవ, చివరి సీజన్‌తో ఆ ఉత్కంఠకు తెరపడనుంది. నెట్‌ఫ్లిక్స్ ఈ ముగింపును ఒక పెద్ద సినిమా స్థాయిలో అందివ్వబోతోంది. 

 'ఎవెంజర్స్: ఎండ్‌గేమ్‌'ను మించి బడ్జెట్ లో.. 

ఇప్పటి వరకు వచ్చిన సీజన్ ఒకలెక్క.. ఇకనుంచి వచ్చేది మరో లెక్కలా 'స్ట్రేంజర్ థింగ్స్' సీజన్ 5 రెడీ అవుతోంది. ఈ సీజన్ 5 సుమారు రూ. 4,000 నుండి రూ. 5,000 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందుతున్నట్లు హాలీవుడ్ సినీ ట్రెడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.. ఈ లెక్కన ఒక్కో ఎపిసోడ్ నిర్మాణ వ్యయం దాదాపు రూ. 450-550 కోట్ల  వరకు ఉంటుందని సమాచారం. ఈ లెక్కన, ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన టెలివిజన్ సిరీస్‌లలో ఒకటిగా నిలిచింది. ఈ బడ్జెట్ మార్వెల్ (Marvel) సినిమా ఎవెంజర్స్: ఎండ్‌గేమ్ (Avengers: Endgame) బడ్జెట్‌ సుమారు రూ. 3,200 కోట్లు ను కూడా అధిగమించడం ఖాయం అంటున్నారు. 1980ల నాటి సెట్టింగ్స్, అద్భుతమైన వీఎఫ్‌ఎక్స్ భారీ తారాగణం కోసం నెట్‌ఫ్లిక్స్ ఖర్చుకు వెనకాడటం లేదు. ఈ సీజన్‌ను తమ కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైనది అనిఈ సిరీస్ మేకర్స్, డఫర్ బ్రదర్స్ పేర్కొన్నారు.

ALSO READ : రికార్డ్ సృష్టించిన 'లాపతా లేడీస్'..

8 బ్లాక్‌బస్టర్ సినిమాల్లా.. 

సాధారణ టీవీ షోల మాదిరిగా కాకుండా.. 'స్ట్రేంజర్ థింగ్స్' సీజన్ 5 లోని ప్రతి ఎపిసోడ్ ఒక సినిమా స్థాయిలో ఉంటుంది. ఒక్కో ఎపిసోడ్ నిడివి 90 నుంచి 120 నిమిషాల వరకు ఉండనుంది. ఈ మొత్తం ఎనిమిది ఎపిసోడ్‌ల నిడివి 11 గంటలకు (సుమారు 660 నిమిషాలు) పైగా ఉంటుంది. దీనిని ఎనిమిది బ్లాక్‌బస్టర్ హాలీవుడ్ సినిమాలతో సమానం అని పోల్చుతున్నారు.. డఫర్ బ్రదర్స్ ఇప్పటికే 650 గంటలకు పైగా ఫుటేజీని చిత్రీకరించారు.

కథాంశం..  

సీజన్ 5 కథాంశం 1987 నాటి పతనం తర్వాత మొదలవుతుంది. హ్యాకిన్స్ (Hawkins) పట్టణం అప్‌సైడ్ డౌన్ చీలికలతో పూర్తిగా దెబ్బతింటుంది. హీరోలందరి లక్ష్యం ఒక్కటే: వెక్‌నాను కనిపెట్టి అంతం చేయడం. అయితే, వెక్‌నా అదృశ్యమయ్యాడు. దీనికి తోడు, ప్రభుత్వం హ్యాకిన్స్‌ను సైనిక నిర్బంధంలో ఉంచి, ఎలెవన్‌  కోసం తీవ్రంగా గాలిస్తోంది. తన శక్తిని కోల్పోయిన ఎలెవన్ మళ్లీ దాక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. విల్ బైర్స్ అదృశ్యమై సంవత్సరం పూర్తవుతున్న సందర్భంగా, ఏదో తెలియని భయంకరమైన చీకటి ముంచుకొస్తుందనే భయం వెంటాడుతుంది. ఇది వారు ఎదుర్కోవలసిన అత్యంత భయంకరమైన, శక్తివంతమైన చివరి యుద్ధం అనేది ప్రధాన కథాంశం.

విడుదల తేదీలు.. మూడు భాగాలలో ఉత్కంఠ

అభిమానులలో ఉత్సాహాన్ని నిలబెట్టడానికి, నెట్‌ఫ్లిక్స్ చివరి సీజన్‌ను మూడు భాగాలలో విడుదల చేయాలని నిర్ణయించింది. వాల్యూమ్ 1 నాలుగు ఎపిసోడ్‌లు నవంబర్ 26, 2025 న విడుదలవుతాయి. అదే విధంగా వాల్యూమ్ 2 మూడు ఎపిసోడ్‌లు క్రిస్మస్ రోజు డిసెంబర్ 25, 2025 న విడుదలవుతాయి. వాల్యూమ్ 3: గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ ను నూతన సంవత్సర వేడుకల సందర్భంగా డిసెంబర్ 31, 2025 న స్ట్రీమింగ్ అవుతుంది.

నటీనటులలో మిల్లీ బాబీ బ్రౌన్ , ఫిన్ వోల్ఫ్‌హార్డ్, డేవిడ్ హార్బర్, వినోనా రైడర్ ,  జామీ క్యాంప్‌బెల్ బౌవర్ తో పాటు టెర్మినేటర్ నటి లిండా హామిల్టన్ కూడా కొత్త పాత్రలో కనిపించబోతున్నారు. మూడేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత, చివరి ఘట్టం నవంబర్ నుండి మొదలు కానుంది. సినిమా నిడివి గల ఎపిసోడ్‌లు, ఆకాశాన్ని తాకే నిర్మాణ వ్యయంతో, అప్‌సైడ్ డౌన్ (Upside Down) రహస్యాలకు తెరదించే ఈ చివరి సీజన్ కోసం ప్రపంచం మొత్తం సిద్ధంగా ఉంది.