Filmfare 2025: రికార్డ్ సృష్టించిన 'లాపతా లేడీస్'.. ఉత్తమ నటిగా ఆలియా, నటుడిగా అభిషేక్, కార్తీక్!

Filmfare 2025: రికార్డ్ సృష్టించిన 'లాపతా లేడీస్'.. ఉత్తమ నటిగా ఆలియా, నటుడిగా అభిషేక్, కార్తీక్!

బాలీవుడ్ సినీ చరిత్రలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన 70వ ఫిలింఫేర్‌ అవార్డుల (Filmfare Awards 2025) వేడుక అహ్మదాబాద్‌లో అట్టహాసంగా జరిగింది. ఈ వేడుక 2024లో విడుదలైన ఉత్తమ హిందీ చిత్రాలకు పురస్కారాలను అందించింది. ఈ ఏడాది అవార్డుల వేడుకకు స్టార్ నటులు షారూఖ్‌ ఖాన్‌, కరణ్‌ జోహార్‌తో పాటు మనీష్‌ పాల్‌ వ్యాఖ్యాతలుగా వ్యవహరించి, ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. సుదీర్ఘ విరామం తర్వాత షారూఖ్‌, కరణ్ జోహార్ కలిసి హోస్టింగ్ చేయడంతో ఈ వేడుక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

'లాపతా లేడీస్‌' రికార్డు

ఈ ఏడాది ఫిలింఫేర్ అవార్డుల నైట్‌లో కిరణ్ రావు దర్శకత్వం వహించిన ‘లాపతా లేడీస్‌’ చిత్రం 13 విభాగాల్లో పురస్కారాలు గెలుచుకుని చారిత్రక విజయాన్ని నమోదు చేసింది. ఒకే చిత్రానికి అత్యధిక ఫిలింఫేర్ అవార్డులు దక్కించుకున్న రికార్డును రణవీర్ సింగ్, ఆలియా భట్ నటించిన ‘గల్లీ బాయ్‌’ (13 అవార్డులు, 2020) పేరిట ఉంది. ఇప్పుడు ‘లాపతా లేడీస్’ చిత్రం ఆ రికార్డును సమం చేసింది. ఉత్తమ చిత్రం (Best Film) అవార్డుతో పాటు, కిరణ్ రావు ఉత్తమ దర్శకురాలిగా, నటి ప్రతిభా రాంటా క్రిటిక్స్ ఛాయిస్ ఉత్తమ నటిగా పురస్కారం అందుకున్నారు. ఈ చిత్రం ఏకంగా 24 నామినేషన్లు దక్కించుకోవడం మరో రికార్డు.

ప్రధాన అవార్డుల విజేతలు

ప్రధాన కేటగిరీలలో అత్యుత్తమ నటనకుగాను పురస్కారాలను ఇద్దరు నటులు పంచుకున్నారు. 'ఐ వాంట్‌ టు టాక్‌' చిత్రానికిగానూ అభిషేక్‌ బచ్చన్‌, ‘చందు: ఛాంపియన్‌’ సినిమాకుగానూ కార్తీక్‌ ఆర్యన్‌ సంయుక్తంగా ఉత్తమ నటుడు (Best Actor in a Leading Role – Male) అవార్డు అందుకున్నారు.

మరోవైపు, నటి ఆలియా భట్‌ తన ‘జిగ్రా’ చిత్రానికిగానూ ఉత్తమ నటి (Best Actress) పురస్కారాన్ని గెలుచుకుని రికార్డు సృష్టించింది. ఈ విజయం ఆమెకు ఆరవ ఉత్తమ నటి ఫిలింఫేర్ అవార్డు కావడం విశేషం. దీనితో ఆమె దిగ్గజ నటీమణులైన నూతన్ , కాజోల్ రికార్డును బద్దలు కొట్టి సరికొత్త చరిత్రను లిఖించింది.  నూతన్ , కాజోల్ చేరో5 చొప్పున అవార్డులు ఉన్నాయి.

‘లాపతా లేడీస్‌’ చిత్రానికి దక్కిన ఇతర ముఖ్య అవార్డులు:

ఉత్తమ సహాయ నటుడు: రవి కిషన్‌

ఉత్తమ సహాయ నటి: ఛాయా కదమ్‌

ఉత్తమ డెబ్యూ నటి: నితాన్షి గోయెల్‌

ఉత్తమ స్క్రీన్‌ప్లే & ఉత్తమ సంభాషణలు: స్నేహ దేశాయ్‌

ఉత్తమ మ్యూజిక్‌ ఆల్బమ్‌ & నేపథ్య సంగీతం: రామ్‌ సంపత్‌

ఉత్తమ గాయకుడు: అర్జిత్‌ సింగ్‌ (సజిని పాట)

 ప్రత్యేక పురస్కారాలు
సమాజంలో చలనం తీసుకొచ్చిన చిత్రాలకు అందించే క్రిటిక్స్ అవార్డు విభాగంలో 'ఐ వాంట్‌ టు టాక్‌' ఉత్తమ చిత్రంగా నిలిచింది. దీనికి సుజిత్ సర్కార్ దర్శకత్వం వహించారు.  ఉత్తమ నటుడు (క్రిటిక్స్ ఛాయిస్) గా రాజ్‌కుమార్‌ రావ్‌ (శ్రీకాంత్‌ మూవీకి) అవార్డు గెలుచుకున్నారు. 'కిల్‌' చిత్రం  యాక్షన్‌, సౌండ్‌ డిజైన్‌, ఎడిటింగ్‌, ప్రొడక్షన్ డిజైన్, సినిమాటోగ్రఫీ వంటి సాంకేతిక విభాగాల్లో ఐదు అవార్డులను గెలుచుకుంది. కునాల్‌ కెమ్ము (మడగావ్‌ ఎక్స్‌ప్రెస్‌), ఆదిత్య సుహాస్‌ జంబలే (ఆర్టికల్‌ 370) సంయుక్తంగా ఉత్తమ డెబ్యూ డైరెక్టర్‌ పురస్కారం అందుకున్నారు.

►ALSO READ | Bigg Boss Telugu 9: బిగ్ బాస్ హౌస్‌లో రణరంగం.. తొలిరోజే ఫైర్ బ్రాండ్‌కి కన్నీళ్లు తెప్పించిన కంటెస్టెంట్లు!

ప్రత్యేక పురస్కారాల విషయానికి వస్తే, దివంగత ప్రముఖ దర్శకుడు శ్యామ్‌ బెనగల్‌ (మరణానంతరం), ప్రముఖ నటి జీనత్‌ అమన్‌లకు జీవిత సాఫల్య పురస్కారం లభించింది. సంగీత విభాగంలో యువ ప్రతిభను గుర్తించే ఆర్‌డీ బర్మన్‌ పురస్కారంను అచింత్‌ టక్కర్‌ కు ‘జిగ్రా’, ‘మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ మహి’ చిత్రాలకు గాను అందుకున్నారు.

మొత్తంగా, 70వ ఫిలింఫేర్ అవార్డుల వేడుక.. 'లాపతా లేడీస్' సృష్టించిన రికార్డు, ఆలియా భట్ సాధించిన చారిత్రక విజయం, అలాగే ప్రతిభావంతులైన డెబ్యూ దర్శకులకు దక్కిన గుర్తింపుతో బాలీవుడ్‌లో ఒక చిరస్మరణీయ ఘట్టంగా మిగిలిపోయింది...