
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 (Bigg Boss Telugu 9) లో వైల్డ్ కార్డ్ ఎంట్రీలతో అసలైన ఆట మొదలైంది. ఒకేసారి ఆరుగురు కొత్త కంటెస్టెంట్లు ఇంటిలోకి అడుగుపెట్టారు. వారిలో పికెల్స్ పాపగా ఫేమ్ తెచ్చుకున్న రమ్య మోక్ష, దివ్వల మాధురి, నటులు నిఖిల్ నాయర్, గౌరవ్ గుప్తా, శ్రీనివాస్ సాయి ఉన్నారు. అయితే వారిలో దివ్వెల మాధురి ఎంట్రీ అందరి దృష్టిని ఆకర్షించింది. సోషల్ మీడియాలో, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వివాదాస్పద వ్యక్తిగా గుర్తింపు పొందిన మాధురి, ఇంటిలోకి రాకముందే 'ఇప్పటి వరకు బిగ్‌బాస్ ఒక లెక్క, ఇప్పట్నుంచీ మరో లెక్క' అంటూ సంచలన ప్రకటన చేసింది.
'దువ్వాడ'గా మారిన మాధురి !
హౌస్‌లోకి అడుగుపెట్టిన వెంటనే.. మాధురి తన పేరు విషయంలో కీలక ప్రకటన చేసింది. దివ్వెల అనే పేరును మార్చుకుని ఇకపై తనను దువ్వాడ మాధురి అని పిలవాలని హౌస్‌మేట్స్‌కు తెలియజేసింది. ఆమె వైల్డ్ కార్డ్ ఎంట్రీకి ముందు ఆమె సన్నిహితుడైన వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కూడా ఒక వీడియో సందేశం విడుదల చేస్తూ, ఆమెకు ఎవరు ఎదురొచ్చినా వారికే ప్రమాదం, ఆమె ఎవరికి ఎదురెళ్లినా వారికే ప్రమాదం అని పరోక్షంగా హౌస్‌మేట్స్‌ను హెచ్చరించడం చర్చనీయాంశమైంది. తాను ఒక ఫైర్ బ్రాండ్‌నని, ఎవరినీ లెక్కచేయనని చెబుతూ హౌస్‌లో అడుగుపెట్టిన మాధురి, తొలిరోజే గొడవకు దిగి అందరినీ ఆశ్చర్యపరిచింది.
కెప్టెన్ కల్యాణ్‌తో మాటల యుద్ధం
వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్లలో ఒకరైన దివ్వెల మాధురి హౌస్‌లోకి అడుగుపెట్టిన కొద్దిసేపటికే.. కిచెన్ ఏరియాలో అప్పటి కెప్టెన్ అయిన కల్యాణ్ తో మాటల యుద్ధానికి దిగింది. ఆలస్యమవుతున్న వంట పని కారణంగా మాధురిని పక్కకు వచ్చి కూర్చోవాల్సిందిగా కల్యాణ్ మర్యాదగా కుర్చీ జరిపి కోరాడు. అయితే, దీన్ని మాధురి తీవ్రంగా తీసుకుంది. నేను వెళ్లాలి.. కూర్చోకపోతే ఊరుకోరా? అని కల్యాణ్‌ను వెటకారంగా ప్రశ్నించింది. అప్పటికే వంట ఆలస్యం కావడంతో ఒత్తిడిలో ఉన్న కల్యాణ్, ఈరోజు వంట లేటయింది, రేపటినుంచి ఇలా ఉండదు అని సున్నితంగా చెప్పే ప్రయత్నం చేశాడు. దీనికి మాధురి.. నేను అరగంట కూర్చున్నాను అప్పుడేం చేశారు? అప్పుడూ లేటే కదా అని కెప్టెన్‌పై ఎదురు దాడి చేసింది.
మీరు ఇలా మాట్లాడితే నేను వేరేలా మాట్లాడాల్సి వస్తుంది అని కల్యాణ్ హెచ్చరించడంతో మాధురి మరింత సీరియస్ అయింది. ఏయ్.. వాయిస్ ఎందుకు లేస్తుంది? ఎందుకు అరుస్తున్నావ్? అంటూ కల్యాణ్‌పై తీవ్రంగా మండిపడింది. ఈ గొడవలో దివ్య జోక్యం చేసుకుని పరిస్థితిని వివరించడానికి ప్రయత్నించినా, మాధురి వారిని లెక్కచేయకుండా వాదన కొనసాగించింది.
ఫైర్ బ్రాండ్‌కి కన్నీళ్లు
ఫైర్ బ్రాండ్ ఇమేజ్‌తో హౌస్‌లోకి వచ్చిన దువ్వాడ మాధురి.. తొలిరోజే అందరిపై అరుస్తూ.. కోపం ఊగిపోయి చివర్లో ఊహించని విధంగా కన్నీళ్లు పెట్టుకుంది. అనాల్సిన మాటలన్నీ అనేసి చివరికి ఏడవడం ఏంటని కల్యాణ్ అసహనం వ్యక్తం చేశాడు. అయితే గొడవ ముగిశాక మాధురిని మరో కంటెస్టెంట్ తనూజ గౌడ ఓదార్చింది. వైల్డ్ కార్డ్‌గా వచ్చి.. ఎవరూ ఊహించని విధంగా తొలిరోజే కన్నీరు పెట్టుకోవడం చూసిన బిగ్‌బాస్ అభిమానులు ఆశ్చర్యపోతూ, ఫైర్ బ్రాండ్ అనుకున్నాం, అప్పుడే కన్నీళ్లు పెట్టుకుందేంటి? అని కామెంట్లు చేస్తున్నారు.
మొత్తంగా, మాధురి ఎంట్రీతోనే బిగ్‌బాస్ హౌస్‌లో అసలు మసాలా మొదలైందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కల్యాణ్ కెప్టెన్‌గా మాధురికి గట్టిగా సమాధానం చెప్పడం, దివ్య కూడా అతనికి మద్దతుగా నిలబడటంతో.. నెటిజన్లు తగ్గేదేలే.. మాధురికి గట్టిగా ఇచ్చిపడేశారు అంటూ పోస్టులు పెడుతున్నారు. ఈ కొత్త ఎంట్రీలు, కాంట్రవర్సీలతో బిగ్‌బాస్ 9 రణరంగంలా మారడం ఖాయంగా కనిపిస్తోందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.