
‘మిత్ర మండలి’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో సినీ నిర్మాత బన్నీ వాసు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. మిత్ర మండలి సినిమాపై, తనపై కొంతమంది పనిగట్టుకుని నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారని.. ఆ నెగిటివిటీ తన వెంట్రుకతో సమానం అని బన్నీ వాసు వ్యాఖ్యానించాడు. మీ ట్రోల్స్, మీ నెగిటివ్ Propaganda తన వెంట్రుకతో సమానం అని, తాను కావాలంటే వేరే చోట వెంట్రుక కూడా పీకి చూపించొచ్చని.. కానీ తనకు సంస్కారం ఉందని బన్నీ వాసు చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారాయి. బన్నీ వాసు ఎవరిని ఉద్దేశించి ఇంత ఆవేశంగా మాట్లాడాడో, బన్నీ వాసును టార్గెట్ చేసి నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నదెవరోననే చర్చ ఇండస్ట్రీలో మొదలైంది.
అయితే.. ఇదంతా సినిమాకు బజ్ క్రియేట్ చేసేందుకు చేసిన ప్రయత్నం కూడా కావొచ్చని వీడియో చూసిన కొందరు ప్రేక్షకులు అభిప్రాయపడ్డారు. ఒకేసారి రెండు, మూడు సినిమాలు విడుదలవుతున్నప్పుడు ఎవరో తమ మీద నెగిటివ్ క్యాంపెయిన్ చేస్తున్నారని, తమ సినిమాపై నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారని చెప్పడం ఈ మధ్య టాలీవుడ్లో మోస్ట్ కామన్ అయిపోయిందని.. బన్నీ వాసుపై నెగిటివ్ క్యాంపెయిన్ తమ కంట పడలేదని కొందరు నెటిజన్లు బన్నీ వాసు తాజా వ్యాఖ్యలపై స్పందించారు. ఈ దీపావళి సందర్భంగా.. టాలీవుడ్లో నాలుగు సినిమాలు విడుదలవుతున్న సంగతి తెలిసిందే.
‘మిత్రమండలి’ సినిమా అక్టోబర్ 16న, సిద్ధూ జొన్నలగడ్డ ‘తెలుసు కదా’ సినిమా అక్టోబర్ 17న, ప్రదీప్ రంగనాథన్ ‘డ్యూడ్’ సినిమా అక్టోబర్ 17న, రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ గా కిరణ్ అబ్బవరం ‘కె-ర్యాంప్’ సినిమా అక్టోబర్ 18న విడుదలవుతున్నాయి. ఈ నాలుగు సినిమాలు చిన్న సినిమాలు కాదు. అలా అని పెద్ద సినిమాలు కూడా కాదు. ఈ నాలుగు సినిమాల ట్రైలర్లు ఇప్పటికే విడుదలయ్యాయి. మీడియాతో ముఖాముఖి కూడా నిర్వహించారు. ఇంటర్వ్యూలు కూడా ఇస్తున్నారు. ఇన్ని చేస్తున్నా.. ఈ నాలుగు సినిమాలకు ప్రేక్షకులు థియేటర్లకు రావాలంటే సోషల్ మీడియాలో, మీడియాలో విపరీతంగా ఈ సినిమాల గురించి చర్చ జరగాలని ఎవరికి వాళ్లు గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారని ఇండస్ట్రీలో పుకార్లు షికారు చేస్తున్నాయి.
ఈ కాంట్రవర్సీ ప్రశ్నలు, కాంట్రవర్సీ స్పీచ్లు ఆ స్ట్రాటజీలో భాగమే అయి ఉండొచ్చని ప్రేక్షకుల్లో కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రియాల్టీ షోలకు వ్యూయర్ షిప్ కోసం ఏడుపుగొట్టు ప్రోమోలను, గొడవలు జరిగినట్లు, పొట్టుపొట్టు తిట్టుకున్నట్లు ప్రోమోలను కట్ చేసిన తరహాలో సినిమాలకు బజ్ క్రియేట్ అవ్వాలంటే ఆ సినిమా చుట్టూ ఏదో ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేస్తే గానీ పని కాదని సినిమాల దర్శకనిర్మాతలు, హీరోలు ఫిక్స్ అయినట్టు ఉన్నారని ఫిల్మ్ నగర్ వర్గాల్లో హాట్ హాట్గా చర్చ జరుగుతోంది.