నా కెరీర్‌కు కిక్ ఇచ్చిన పాట ఆయా షేర్. ప్రోమోతోనే పాజిటివ్ బజ్ తీసుకొచ్చిన ఈ పాట.. ఫుల్ సాంగ్ వచ్చాక రికార్డ్స్ క్రియేట్ చేసింది. నేను రాసిన సాహిత్యానికి తగ్గట్టుగా, ప్రేక్షకులకు రీచ్ అయ్యేలా ట్యూన్ చేశారు అనిరుధ్. మట్టి వాసన తెలిసిన జానపద గాయకులు జంగిరెడ్డి, దేవయ్య అద్భుతంగా పాడారు. అందరిలో స్ఫూర్తి నింపే ఒక ఇన్‌స్పిరేషనల్ సాంగ్ అవడం, అందులో లిరిక్స్ గురించి ప్రత్యేకంగా మాట్లాడటం ఆనందంగా ఉంది.
పాట ఇంత బాగా రావడానికి డైరెక్టర్ శ్రీకాంత్ విజన్ కారణం. జడల్ పాత్రలోని ఎమోషన్,ఈ పాట సిచువేషన్‌ను చాలా క్లియర్‌గా చెప్పారు. జనం మధ్యలో నుంచి పుట్టుకొచ్చిన ఒక వీరుని కథ ఇది. అలాంటి పాత్రకు ఓ ఎమోషన్ ఉంది. అందుకే పచ్చబొట్టు గాయం.. గుంజుకున్న న్యాయం.. లాంటి పద ప్రయోగాలు చేశా. పాట రాయడానికి వారం పట్టింది. ఎయిటీస్‌లో జరిగే కథ కనుక అప్పటి ఉర్దూ ప్రభావాన్ని దృష్టలో ఉంచుకుని ఆ పదాలు వాడాను.
పాట చేస్తున్నప్పుడే అనిరుద్ పెద్ద హిట్ కొడుతున్నాం అన్నారు. ఆయనతో వర్కింగ్ ప్రాసెస్‌ని చాలా ఎంజాయ్ చేశా. ఈ పాట ఇచ్చినంత కిక్కు నా కెరీర్‌లో మరే పాట ఇవ్వలేదు. నేను వాడిన భాష, యాసకి అద్భుతమైన ప్రశంసలు వస్తున్నాయి. జీవితంలో సర్వస్వం కోల్పోయానే బాధలో ఉన్న వ్యక్తి.. ఈ పాట విని ఒక కొత్త స్ఫూర్తి పొందానని చెప్పాడు. అలాంటి మెసేజ్‌లు చాలా వచ్చాయి.
పల్లె భాషను నమ్ముకుని సినీ పరిశ్రమకు వచ్చా. మరుగునపడిన భాష పదాలు నా ద్వారా మళ్ళీ వెలుగులోకి రావడం, నేటి యువత ఆ పదాల్ని వాడుకోవడం ఒక రచయితగా చాలా ఆనందాన్ని ఇస్తోంది. అలాగే తెలంగాణ మాండలికంలో పాటంటే నా పేరు గుర్తుకు రావడం సంతోషం.
ఆ విషయంలో నా సీనియర్స్ నాకు స్ఫూర్తి. కొసరాజు గారు, జాలాది గారు ఈ యాసతో ఒక ప్రత్యేకమైన గుర్తింపు పొందారు. అలాగే నేను గురువుగా భావించే చంద్రబోస్ గారు జాతీయ అవార్డు రాగానే ఫోన్ చేసి అభినందించడం చాలా ఆనందాన్నిచ్చింది.
తెలుగు సినిమాల్లో తెలంగాణ మాండలికానికి, సాహిత్యానికి ఓ కొత్త జోష్ తెచ్చిన గీత రచయితగా ఇటీవల కాసర్ల శ్యామ్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన ‘దసరా’ సినిమాలో ధూమ్ ధామ్ దోస్తానా, చమ్కీలా అంగి లాంటి పాటలతో మెప్పించిన శ్యామ్.. ఇప్పుడిదే కాంబినేషన్‌లో వస్తున్న ‘ది ప్యారడైజ్’ చిత్రంతో ‘ఆయా షేర్’ అనే పాట రాశారు. ఇటీవల విడుదలైన ఈ పాట గురించి కాసర్ల శ్యామ్ ఇలా ముచ్చటించారు.
