తెలుగు, తమిళ భాషల్లో హీరోయిన్‌గా మెప్పించిన సాయిపల్లవి.. ‘ఏక్ దిన్’ చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ఆమిర్‌ఖాన్ కొడుకు జునైద్‌ఖాన్ ఇందులో హీరోగా నటిస్తున్నాడు. సునీల్ పాండే దర్శకుడు. ఆమిర్‌ఖాన్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. బుధవారం ఈ మూవీ ట్రైలర్‌ను విడుదల చేశారు. రోహన్ పాత్రలో జునైద్ ఖాన్, మీరాగా సాయిపల్లవి కనిపించారు. తన కొలిగ్ మీరాను ఇష్టపడే రోహన్.. ప్రేమను వ్యక్తపరచడానికి మాత్రం భయపడుతుంటాడు. జీవితంలో ఒక్క రోజైనా ఆమెతో కలిసి ప్రయాణం చేయాలని కలలు కంటాడు.
అతని కల నిజమైందా అనే ఆసక్తికర అంశంతో ఈ సినిమాను తెరకెక్కించారు. సరదా సన్నివేశాలతో మొదలైన ట్రైలర్ ఆ తర్వాత ఎమోషనల్ టర్న్ తీసుకుంది. ఒక్కోసారి ఒక్క రోజు చాలు.. రేపు ఏం జరుగుతుందో ఎవరికీ గుర్తుండకపోవచ్చు లాంటి డైలాగ్స్ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. హిందీలోనూ సాయిపల్లవి డబ్బింగ్ చెప్పడం విశేషం. మే 1న సినిమా ప్రేక్షకుల ముందుకొస్తోంది. పదేళ్ల క్రితం వచ్చిన థాయ్ రొమాంటిక్ డ్రామా ‘వన్ డే’ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్టు సమాచారం.
