15 ఫ్లాట్లు.. 43 ఓట్లు.. అది ఇల్లు కాదు అపార్ట్మెంట్.. కేటీఆర్ ఆరోపణలపై అధికారుల క్లారిటీ

15 ఫ్లాట్లు.. 43 ఓట్లు..  అది ఇల్లు కాదు అపార్ట్మెంట్.. కేటీఆర్ ఆరోపణలపై అధికారుల క్లారిటీ

= 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ వాళ్లు ఓటర్లే
= కొత్తగా ఒక్క ఓటు కూడా యాడ్ చేయలేదు
= మీడియాకు చూపించిన జిల్లా ఎన్నికల అధికారి

హైదరాబాద్: ఒకే ఇంట్లో 43 ఓట్లు ఉన్నట్టు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ చేస్తున్న ఆరోపణలు సరికాదని తేలింది. ఈ విషయాన్ని సాక్షత్తూ జిల్లా ఎన్నికల అధికారే స్పష్టం చేయడం విశేషం. జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఒకే ఇంట్లో 43 ఓట్లు నమోదయ్యాయని కేటీఆర్ ఆరోపించారు. ఆది, సోమ (అక్టోబర్ 12,13) వారాల్లో జరిగిన సమావేశాల్లో అదే అంశాన్ని ప్రస్తావించారు. 

జూబ్లీహిల్స్‌ నియోజకవర్గ పరిధిలోని యూసుఫ్‌గూడ డివిజన్‌ కృష్ణానగర్‌ బీ-బ్లాక్‌లో బూత్‌ నంబర్‌ 246లోని ఓటరు జాబితా ప్రకారం 8-3-231/బీ/160 నంబర్‌తో ఉన్నది సంస్కృతి అవెన్యూ అనే అపార్ట్ మెంట్. ఇందులో 15 ఫ్లాట్లు ఉన్నాయి. అంటే 15  కుటుంబాలు నివసిస్తున్నాయి. ఇంటికి ముగ్గురు లెక్కేసుకున్నా 45 ఓట్లు ఉండాలి. దీనిని ఒకే ఇల్లు అని కేటీఆర్ పేర్కొన్నారు. 

►ALSO READ | హైదరాబాద్ జూబ్లీహిల్స్లో ఒకే అడ్రస్పై 43 మంది ఓటర్లు.. ఫేక్ ఓటర్లపై ఈసీ స్పందన ఇదే

దీనిపై జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్ ఇవాళ మీడియాతో కలిసి ఫీల్డ్ విజిట్ చేశారు. ఈ అపార్ట్ మెంట్ లో  43 మంది ఓటర్లున్నారు. వీళ్లంతా 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు నుంచి ఓటర్లుగా ఉన్నవాళ్లేనని చెప్పారు. వీళ్లంతా అసెంబ్లీ, 2024 పార్లమెంటు ఎన్నికల సమయంలోనూ ఓటు హక్కు వినియోగించుకున్నారని క్లారిటీ ఇచ్చారు. తాము కొత్తగా ఎవరి పేర్లనూ యాడ్ చేయలేదన్నారు.