ఫేక్ కోల్గేట్ టూత్ పేస్ట్, నకిలీ మ్యాగీ, కల్తీ ఈనో : గుజరాత్ కేంద్రంగా కల్తీ తయారీ ఫ్యాక్టరీలు

ఫేక్ కోల్గేట్ టూత్ పేస్ట్, నకిలీ మ్యాగీ, కల్తీ ఈనో : గుజరాత్ కేంద్రంగా కల్తీ తయారీ ఫ్యాక్టరీలు

ఏది అసలు.. ఏది నకిలీ.. ఏది నిజం.. ఏది కల్తీ.. అస్సలు గుర్తుపట్టలేకుండా తయారైంది మార్కెట్. బ్రాండెడ్ వస్తువులనే అచ్చుగుద్దినట్లు గుద్ది మరీ రిలీజ్ చేస్తున్నారు కేటుగాళ్లు. బ్రాండెడ్ వస్తువులను నకిలీ, కల్తీ తయారు చేసి.. అచ్చం ఒరిజినల్ లేబుల్స్, ప్యాకింగ్ చేసి మార్కెట్ లో విడుదల చేస్తున్నారు దుర్మార్గులు. ఏకంగా కోల్గేట్ టూత్ పేస్ట్, కల్తీ మ్యాగీ, కల్తీ ఈనోలను ఫ్యాక్టరీలు పెట్టి మరీ తయారు చేసి.. మార్కెట్ ను ముంచెత్తుతున్నారు. ఇంత పెద్ద ఫ్యాక్టరీ ఎక్కడ అంటారా.. ఇంకెక్కడ గుజరాత్ రాష్ట్రంలో.. ఈ బండారం బయటపడిన తర్వాత.. దేశం మొత్తం షాక్ అయ్యింది.. జనానికి చెమటలు పట్టాయి.. ఈ కల్తీ తయారీ ఫ్యాక్టరీ పూర్తి వివరాల్లోకి వెళితే..

గుజరాత్‌లో పెద్ద మొత్తంలో నకిలీ కోల్‌గేట్ టూత్‌పేస్ట్‌ తయారు చేస్తున్న ఒక ఫ్యాక్టరీని పోలీసులు పట్టుకున్నారు. దింతో భారతదేశంలో నకిలీ వస్తువులు ఎంతగా పెరుగుతున్నాయో అనే కొత్త భయాలు మొదలయ్యాయి. సమాచారం ప్రకారం, గుజరాత్‌లోని కచ్ జిల్లాలో ఉన్న ఈ ఫ్యాక్టరీలో అచ్చం కోల్‌గేట్ టూత్‌పేస్ట్‌ లాంటి నకిలీ కోల్‌గేట్  పేస్ట్‌ ను  తయారు చేస్తున్నారు. దింతో  రాజేష్ మక్వానా అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.

కొద్దిరోజుల క్రితం ఢిల్లీలో నకిలీ సెన్సోడైన్ టూత్‌పేస్ట్, నకిలీ ENO, నకిలీ గోల్డ్ ఫ్లేక్ సిగరెట్లను తయారు చేసే ముఠా పట్టుబడింది. టూత్‌పేస్ట్, మందులు లాంటి వస్తువులే నకిలీ అవుతుంటే, ఇక మనం దేనిని నమ్మగలం ? ఇవి కేవలం మోసాలు కాదు, మనం తెలియకుండానే వాడే నిత్యావసర వస్తువుల రూపంలో ఉన్న విషాలు అంటూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్  పరిస్థితిని హైలెట్ చేస్తుంది.  


వివరాలు చూస్తే నిందితులు చౌకైన, నాణ్యత లేని పదార్థాలతో నకిలీ టూత్‌పేస్ట్‌ను తయారు చేసి, వాటిని నిజమైన కోల్‌గేట్ ఉత్పత్తులుగా మార్కెట్‌లో అమ్మేస్తున్నారు. పోలీసులు సుమారు రూ.9.43 లక్షల విలువైన నకిలీ టూత్‌పేస్ట్‌, ప్యాకేజింగ్ వస్తువులు, తయారీ మెషీన్స్  స్వాధీనం చేసుకున్నారు. అలాగే పోలీసులు ఇప్పుడు ఈ నకిలీ ఉత్పత్తులు ఎక్కడెక్కడ అమ్మారో, వాటిని సప్లయ్ చేసిన వారిపై దర్యాప్తు చేస్తున్నారు.

ఇది ఒక్క సంఘటన మాత్రమే కాదు. జూలై 2025లో సూరత్ పోలీసులు చాముండా ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లో నకిలీ మసాలాల తయారీ ఫ్యాటరీని పట్టుకుని నకిలీ మ్యాగీ, ఎవరెస్ట్ మసాలాలను ఉత్పత్తి చేసినందుకు ఐదుగురిని అరెస్టు చేసింది. అదేవిధంగా ఆగస్టు 2025లో  ఢిల్లీ పోలీసుల క్రైమ్ బ్రాంచ్ ENO, సెన్సోడైన్ టూత్‌పేస్ట్, సిగరెట్లతో సహా నకిలీ వస్తువులను తయారు చేసి అమ్ముతున్న ఓ పెద్ద ముఠాను బయటపెట్టింది.

నకిలీ ఉత్పత్తులను వాడటం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రమాదం అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నకిలీ యాంటాసిడ్‌లో హానికరమైన రసాయనాలు లేదా తప్పుడు మోతాదులు ఉండవచ్చు, దీనివల్ల కడుపులో మంట, యాసిడ్ రిఫ్లక్స్ లేదా అలర్జీలు రావచ్చు. నకిలీ టూత్‌పేస్ట్‌లో విషపూరిత పదార్థాలు లేదా గరుకుగా ఉండే వస్తువులు ఉండవచ్చు, ఇవి పళ్ళు, చిగుళ్లను పాడుచేయవచ్చు. ఇక నకిలీ సిగరెట్లలో సురక్షితం కాని పొగాకు మిశ్రమాలు ఉండటం వల్ల ఊపిరితిత్తులు, గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుంది.

ప్రతిరోజు నిత్యవసరాలకు ఉపయోగించే వస్తువులలో కూడా నకిలీవి దొరుకుతుండటంతో  జాగ్రత్తగా ఉండాలని పోలీసులు ప్రజలను కోరుతున్నారు. ఎప్పుడూ నమ్మకమైన షాపుల నుంచే వస్తువులను కొనండి, కొనే ముందు ప్యాకేజింగ్ వివరాలను సరిగా చూసి, అది నిజమైనదో కాదో తెలుసువడం మంచిది.