మొజ్తబా ఎలా తప్పించుకున్నారంటే..!

మొజ్తబా ఎలా తప్పించుకున్నారంటే..!

టెహ్రాన్: ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ, ఆయన కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని అమెరికా, -ఇజ్రాయెల్ బలగాలు ఫిబ్రవరి 28న జరిపిన దాడి నుంచి ప్రస్తుత సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ త్రుటిలో తప్పించుకున్న విషయం తాజాగా బయటకు వచ్చింది. దీనికి సంబంధించిన సంచలన వివరాలు ఉన్న ఒక ఆడియో తాజాగా లీక్ అయింది. 

'ది టెలిగ్రాఫ్' పత్రిక సేకరించిన ఈ ఆడియోలో.. ఆ భీకర దాడికి సంబంధించిన భయానక దృశ్యాలను అలీ ఖమేనీ కార్యాలయ ప్రోటోకాల్ విభాగం అధిపతి మజహర్ హుస్సేనీ వివరించారు. స్థానిక కాలమానం ప్రకారం ఫిబ్రవరి 28న ఉదయం 9:32 గంటలకు టెహ్రాన్ లోని ఖమేనీ నివాసంపై దాడులు జరిగాయి.

 ఆ సమయంలో ఖమేనీ కుమారుడు మొజ్తబా ఖమేనీ ఏదో పని మీద నివాసం నుంచి బయటకు వచ్చి ఆవరణలోకి వెళ్లారు. పని ముగించుకుని తిరిగి పై అంతస్తుకు వెళ్తుండగా భవనంపై క్షిపణులు పడ్డాయి. ఈ ఘటనలో మొజ్తబా కాలికి స్వల్ప గాయం మాత్రమే అయింది. అదే భవనంలో ఉన్న ఆయన భార్య జహ్రా హద్దాద్- అదేల్, వారి కుమారుడు స్పాట్​లోనే ప్రాణాలు కోల్పోయారు. ఖమేనీ మరో కుమారుడు ముస్తఫా ఖమేనీ, ఆయన భార్య కూడా ఆ సమయంలో అక్కడే ఉన్నప్పటికీ క్షేమంగా బయటపడ్డారు.

ముక్కలైన శరీరాలు 

ఈ క్షిపణి దాడి ఎంత శక్తివంతంగా ఉందంటే.. ఇరాన్ మిలిటరీ చీఫ్ మహమ్మద్ షిరాజీ శరీరం తునాతునకలైందని హుస్సేనీ పేర్కొన్నారు. ఆయనను గుర్తించడానికి "కొన్ని కిలోల మాంసం ముద్దలు" తప్ప ఏమీ మిగలలేదన్నారు. అలీ ఖమేనీ అల్లుడు మిస్బా అల్-హుదా బఘేరీ తల రెండుగా చీలిపోయినట్లు వెల్లడించారు.