- అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఎన్ఎంసీ ఆదేశం
- పాట్నా హైకోర్టు తీర్పును అమలు చేయాలని స్పష్టం
హైదరాబాద్, వెలుగు: దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, హాస్పిటల్స్ లో టీచింగ్ ఫ్యాకల్టీ ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్రాల మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్ మెంట్ సెక్రటరీలకు సర్క్యులర్ జారీ చేసింది. ఫేస్ రికగ్నిషన్, జీపీఎస్ ఆధారిత బయోమెట్రిక్ అటెండెన్స్ ను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌ను కొట్టివేసిన పాట్నా హైకోర్టు.. అదే సమయంలో డాక్టర్ల దుస్థితిపై జనవరి 17న కామెంట్లు చేసింది.
ప్రభుత్వ హాస్పిటళ్ల డాక్టర్లతో 24 గంటలు, 48 గంటలు, చివరికి 72 గంటల పాటు ఏకధాటిగా డ్యూటీలు చేయిస్తూ టార్చర్ పెడితే వాళ్లు ఎలా తట్టుకుంటారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అటెండెన్స్ రూల్స్ కఠినం చేసినంత మాత్రాన వైద్యవ్యవస్థ ఏమీ బాగుపడదని, తీవ్ర పనిభారంతో విసిగిపోయిన ఫ్యాకల్టీ.. డ్యూటీలు ఎగ్గొట్టేందుకు ఏదో ఒక దారి వెతుకుతూనే ఉంటారని కోర్టు చురకలంటించింది.
ఈ పరిస్థితులు మారాలంటే మెడికల్ టీచింగ్ సర్వీసుల్లో భారీగా ఉన్న ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని కోర్టు స్పష్టం చేసింది. ఇందుకోసం ఆరు నెలల్లోగా స్పెషల్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ చేపట్టి అపాయింట్‌మెంట్లు పూర్తి చేసేలా రాష్ట్రాలకు ఆదేశాలు ఇవ్వాలని ఎన్ఎంసీకి తేల్చి చెప్పింది. పాట్నా హైకోర్టు ఇచ్చిన ఈ తీర్పును తప్పనిసరిగా అమలు చేయాలని ఎన్ఎంసీ తాజాగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ లేఖ ద్వారా చెప్పింది. హైకోర్టు ఆదేశాల ప్రకారం నిర్ణీత ఆరు నెలల గడువులోగా మెడికల్ ఫ్యాకల్టీ పోస్టులను భర్తీ చేయాలని ఆ సర్క్యులర్ లో స్పష్టం చేసింది.
