- ఒకరి పరిస్థితి విషమం
మియాపూర్, వెలుగు: ఉద్యోగులను ఎక్కించుకుని కంపెనీకి వెళ్తున్న ప్రైవేటు బస్సు యూటర్న్ తీసుకుంటూ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పలువురు ఫార్మా కంపెనీ ఉద్యోగులు గాయపడ్డారు. పోలీసులు తెలిపిన ప్రకారం.. లీ ఫార్మా కంపెనీకి చెందిన ప్రైవేటు బస్సు కూకట్‌పల్లిలోని కేపీహెచ్‌బీ నుంచి 10 మంది ఉద్యోగులతో మియాపూర్ మీదుగా గడ్డపోతారం ఇండస్ట్రియల్ ఏరియా వైపు వెళ్తోంది.
ఈ క్రమంలో బాచుపల్లి రోడ్డులోని టాటా మోటర్స్ సమీపానికి చేరుకున్నప్పుడు యూటర్న్ తీసుకుంటుండగా బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. బస్సులో ఉన్న పలువురికి గాయాలు కాగా, ఒకరి పరిస్థితి విషమంగా మారింది. వీరిని సమీపంలోని ప్రైవేటు హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు.
మియాపూర్ ట్రాఫిక్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను నియంత్రించారు. బోల్తా పడిన బస్సును క్రేన్ సాయంతో తొలగించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
