- ప్రస్తుత ఫామ్, సారథ్యంలో పైచేయి
- ఆటను అంచనా వేయడంలో దిట్ట
- అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ బ్యాటింగ్‌కే పరిమితం
- డొమెస్టిక్ ప్లేయర్లతో కిషన్‌కు మంచి టచ్
న్యూఢిల్లీ: ఐపీఎల్ ఫ్రాంచైజీ సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్ ఎంపిక దాదాపుగా ఖరారైన నేపథ్యంలో.. అతని నాయకత్వ లక్షణాలపై మరోసారి చర్చ మొదలైంది. ఎస్‌ఆర్‌హెచ్ జట్టులో అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్‌లాంటి భారీ హిట్టర్లు ఉండగా.. ఇషాన్‌నే ఎందుకు ఎంచుకున్నారు? అనే ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. అయితే దీని వెనుక ఉన్న ఒకే ఒక్క కారణం.. ఫామ్, నాయకత్వ లక్షణాలు. ఈ రెండింటి కారణంగానే ఇషాన్‌కు పగ్గాలు అప్పగిస్తున్నారనే వాదన బలంగా వినిపిస్తోంది. 2023లో మానసిక అలసట కారణంగా ఇషాన్ సెలవు అడిగినప్పుడు అవమానకరమైన రీతిలో టీమిండియాకు దూరం చేశారు.
ఆ తర్వాత అతను జట్టులోకి రావాలని చేసిన ప్రతి ప్రయత్నం నిరాశజనకంగానే ముగిసింది. అలా రెండు ఏళ్లు గడిచినా.. ఏమాత్రం అధైర్యపడకుండా, ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా మళ్లీ టీమిండియాలోకి రీ ఎంట్రీ ఇచ్చిన తీరు అద్భుతం. కేవలం తన బ్యాట్‌తోనే సమాధానమిస్తూ పరిస్థితులను మార్చేశాడు. ఒకప్పుడు తనను వద్దనుకున్న వారితోనే జట్టులోకి తీసుకునేలా చేశాడు. గడిచిన మూడున్నర నెలల్లో ఇషాన్ చూపిన తెగువ, ఆటే ఇప్పుడు ఎస్‌ఆర్‌హెచ్ పగ్గాలు తెచ్చిపెట్టాయి.
అభిషేక్‌ను కాదని..
టీ20 వరల్డ్ కప్‌కు ముందు సూపర్ ఫామ్‌లో ఉన్న అభిషేక్ మెగా టోర్నీలో ఘోరంగా నిరాశపర్చాడు. వరుసగా మూడు డకౌట్లు ఆ తర్వాత 55, 52 రన్స్‌తో మొత్తంగా 141 రన్స్ చేశాడు. అదే టైమ్‌లో ఇషాన్ 317 రన్స్ సాధించాడు. అంటే ప్రస్తుత ఫామ్ ప్రకారం ఇషాన్‌దే పైచేయిగా ఉంది. ఇక టీ20 ర్యాంకింగ్స్‌లో టాప్–2లో ఉన్న అభిషేక్ (875), ఇషాన్ (871) మధ్య పాయింట్ల తేడా కూడా ఎక్కువగా లేదు.
అభిషేక్ సన్‌రైజర్స్‌లో ఏడేళ్లుగా కొనసాగుతుండటంతో సీనియర్‌గా కెప్టెన్సీ చాన్స్ ఉంది. కానీ ఇషాన్ కెప్టెన్‌గా ఇప్పటికే చాలా నిరూపించుకున్నాడు. డొమెస్టిక్ క్రికెట్‌లో అభిషేక్ పంజాబ్ జట్టును నడిపించినా పెద్దగా రికార్డు లేదు. కానీ ఇషాన్ జార్ఖండ్ సారథిగా అసాధారణ విజయాలు సాధించాడు. జార్ఖండ్‌కు తొలిసారి సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీని అందించడంతో పాటు హర్యానాతో జరిగిన ఫైనల్లో 51 బాల్స్‌లోనే సెంచరీ కొట్టాడు. ]
197.32 స్ట్రయిక్ రొటేతో 517 రన్స్ చేశాడు. అండర్–19 వరల్డ్ కప్‌లో టీమిండియాను నడిపించిన అనుభవం కూడా ఉంది. కాబట్టి నాయకుడికి ఉండాల్సిన అన్ని లక్షణాలు ఇషాన్‌లో ఉన్నాయి. ‘కెప్టెన్సీ అనేది సహజంగా వచ్చేది. పుట్టుకతోనే ఈ లక్షణం వస్తుంది. నాయకులను తయారు చేయలేరు. ఇషాన్ ఓ మంచి నాయకుడు. నేను అతన్ని చాలా దగ్గర్నించి చూశా. ఆటపై ఇషాన్ దృక్పథం చాలా గొప్పది. రెండేళ్లుగా జార్ఖండ్ జట్టును నడిపించిన తీరు అమోఘం. జట్టు ఆత్మవిశ్వాసాన్ని మరో స్థాయికి తీసుకెళ్లాడు. ప్రత్యర్థులు భయపడే జట్టుగా తీర్చిదిద్దాడు. ఇందులో ఇషాన్ పాత్ర చాలా కీలకం’ అని జార్ఖండ్ స్టేట్ క్రికెట్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ షాబాజ్ నదీమ్ వెల్లడించాడు.
ఆటను సూక్ష్మంగా చూస్తాడు..
ఇషాన్‌లో రెండు కీలకమైన లక్షణాలను నదీమ్ ఎత్తి చూపాడు. యువ ప్లేయర్లతో మమేకమయ్యే తీరుతో పాటు వికెట్ల వెనకాల నుంచి ఆటను చాలా సూక్ష్మంగా అంచనా వేసే నైపుణ్యం ఇషాన్‌లో ఉందని చెప్పాడు. ‘యంగ్‌స్టర్స్‌కు ఇషాన్ కావాల్సినంత స్వేచ్ఛనిస్తాడు. మన మధ్య కెప్టెన్ ఉన్నాడనే భావనను ఎప్పుడూ కలిగించడు. కేవలం మరో సహచర ప్లేయర్‌గా ఉంటాడు.
గ్రౌండ్ లోపలా, వెలుపలా యంగ్‌స్టర్స్‌కు మార్గనిర్దేశనం చేయడానికి ప్రయత్నిస్తాడు. వారి నుంచి అత్యుత్తమ ప్రతిభను రాబట్టడంలో దిట్ట. వికెట్ కీపర్ సహజంగానే ఆటను బాగా అర్థం చేసుకుంటాడు. మిడాన్, మిడాఫ్, స్లిప్స్‌లో ఫీల్డింగ్ చేసే కెప్టెన్ తరచుగా కీపర్‌పై ఆధారపడతాడు. ఎందుకంటే వాళ్లకు పిచ్‌పై మంచి అవగాహన ఉంటుంది. కీపర్‌కు ఫీల్డింగ్ మొత్తాన్ని చూసే చాన్స్ ఉంటుంది.
బ్యాటింగ్ చేసేటప్పుడు ఓ ప్రణాళికను అనుసరిస్తారు. కానీ ఫీల్డింగ్ చేసేటప్పుడు కెప్టెన్సీ చాలా కీలకం. కాబట్టి కీపరే.. కెప్టెన్ అయితే అదనపు ప్రయోజనాన్ని కలిగిస్తుంది’ అని నదీమ్ వివరించాడు. ఐపీఎల్‌తో పోలిస్తే డొమెస్టిక్ క్రికెట్‌లో కెప్టెన్సీ చాలా కష్టంగా ఉంటుందన్నాడు. ‘ఐపీఎల్‌లో అత్యుత్తమ డొమెస్టిక్, ఓవర్‌సీస్ ప్లేయర్లు ఉంటారు. అయితే డొమెస్టిక్ ప్లేయర్ల నాణ్యతలో చాలా వైవిధ్యం ఉంటుంది. డొమెస్టిక్ పెర్ఫామెన్స్ ఆధారంగానే ఇషాన్‌కు కెప్టెన్సీ ఇచ్చి ఉంటారు. అతను బాగా రాణిస్తాడనే నమ్మకం ఉంది’ అని నదీమ్ పేర్కొన్నాడు.
