- ఇందిరా పార్క్ చౌరస్తాలో ఉద్రిక్తత
- ఎక్కడికక్కడ అడ్డుకొని అరెస్టు చేసిన పోలీసులు
- జీతాల పెంపు, గ్రీన్ చానల్ కోసం కార్మికుల ఆందోళన
- బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని డిమాండ్
- అక్రమ అరెస్టులకు నిరసనగా నేడు, రేపు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు : సీఐటీయూ
హైదరాబాద్/ముషీరాబాద్, వెలుగు: గ్రామ పంచాయతీ కార్మికులు తలపెట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో మంగళవారం హైదరాబాద్లోని ఇందిరాపార్కు వద్ద మహాధర్నా చేపట్టారు. తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది కార్మికులు తరలివచ్చారు.
అనంతరం ‘చలో అసెంబ్లీ’కి పిలుపునివ్వడంతో అనుమతి లేదని కార్మికులను పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దీంతో కార్మికులు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ అసెంబ్లీ వైపు వెళ్లేందుకు ప్రయత్నించిన కార్మికులను పోలీసులు అరెస్టు చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ క్రమంలో పలువురు కార్మికులకు స్వల్ప గాయాలయ్యాయి.
ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ 12,769 గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న తమకు నేరుగా గ్రీన్ ఛానల్ ద్వారా వేతనాలు చెల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. గత 9, 10 నెలలుగా పెండింగ్‌లో ఉన్న జీతాలను వెంటనే విడుదల చేయాలని, బడ్జెట్‌లో ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరారు. మల్టీ పర్పస్ వర్కర్ విధానాన్ని రద్దు చేసి పాత కేటగిరీలను కొనసాగించాలన్నారు.
సోమవారం అర్ధరాత్రి నుంచే వివిధ జిల్లాల్లో కార్మికులను ఇండ్ల వద్దే ముందస్తు అరెస్టులు చేశారని, రైళ్లు, బస్సుల్లో వస్తున్న వారిని అడ్డుకున్నారని విమర్శించారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా వేలాది మంది కార్మికులు ఇందిరాపార్కుకు చేరుకుని ధర్నాను జయప్రదం చేశారని యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పైళ్ల గణపతిరెడ్డి, ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ తెలిపారు. కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, అక్రమంగా అరెస్ట్చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
నేడు, రేపు రాష్ట్రవ్యాప్త నిరసనలు..
ప్రభుత్వ నిర్బంధానికి, అక్రమ అరెస్టులకు నిరసనగా నేడు, రేపు రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని సీఐటీయూ కార్మికులకు పిలుపునిచ్చింది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లోనే పంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని, లేదంటే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో యూనియన్ నేతలు వెంకటయ్య, యాదమ్మ, వంగూరి రాములు, ఎస్వీ రమ, రమేశ్, కార్మికులు పాల్గొన్నారు.
