
- చివరి మూడ్రోజుల్లో భారీగా వస్తాయని అంచనా
- ఫీజు రూ.లక్ష పెంచడంతో ఆచితూచి ముందుకు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కొత్త మద్యం పాలసీ కింద 2,620 మద్యం షాపుల కోసం ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 5,663 దరఖాస్తులు వచ్చాయి. ఈ దరఖాస్తుల ప్రక్రియ ఈ నెల 18వ తేదీతో ముగియనుంది. ఇప్పటికే తక్కువ దరఖాస్తులు వచ్చాయి. అయితే సాధారణంగా ప్రతి రెండేళ్లకు ఒకసారి దరఖాస్తులు ఆహ్వానించే ఎక్సైజ్ శాఖ.. ఈసారి కూడా చివరి రోజుల్లో - ముఖ్యంగా 13, 15, 16, 17, 18 వంటి శుభదినాలలో - భారీగా అప్లికేషన్లు వస్తాయని అంచనా వేస్తోంది. గత రెండేళ్ల కిందట చివరి రెండు రోజుల్లోనే సుమారు 50 వేల అప్లికేషన్లు వచ్చాయి.
ఈసారి గతంలో వచ్చిన 1.32 లక్షల దరఖాస్తుల సంఖ్యను మించిపోయే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎక్సైజ్ కమిషనర్ సి.హరికిరణ్ పర్యవేక్షణలో హైదరాబాద్, రంగారెడ్డి డివిజన్లతో పాటు ఉమ్మడి జిల్లాల వారీగా అదనపు కౌంటర్లను ఏర్పాటు చేస్తున్నారు. ఇంకోవైపు ఈసారి ఒక్క అప్లికేషన్‌కు రూ.3 లక్షల తీసుకుంటుడం, గతం కన్నా లక్ష రూపాయలు ఎక్కువ కావడంతో వ్యాపారులు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. అప్లికేషన్ ఫీజు రీఫండ్ ఉండదు.
ఏపీ కొత్త మద్యం పాలసీతో సరిహద్దు జిల్లాల్లో వ్యాపారుల అనాసక్తి
ఈసారి దరఖాస్తుల విషయంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సరిహద్దు జిల్లాలైన ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లో దరఖాస్తులు గతంలో కంటే తక్కువగా దాఖలవుతున్నాయి. గతంలో ఏపీలో ప్రభుత్వమే మద్యం షాపులు నడపడంతో ఇక్కడి నుంచి కొనుగోలు చేసి ఆ జిల్లాల సరిహద్దుల ద్వారా ఏపీకి అక్రమంగా మద్యం తరలించేవారు. కానీ.. ఆంధ్రప్రదేశ్‌లో కొత్త మద్యం పాలసీ తీసుకురావడం, అది తెలంగాణ పాలసీని పోలి ఉండడంతో అక్రమ రవాణాకు అవకాశం తగ్గింది. దీని కారణంగానే సరిహద్దు జిల్లాల్లో వ్యాపారుల ఉత్సాహం తగ్గిందని అధికారులు గుర్తించారు.
మరోవైపు, పొరుగు రాష్ట్రాలైన ఏపీ, కర్నాటక, మహారాష్ట్రల నుంచి రాష్ట్రంలోని వైన్స్‌లకు కూడా వ్యాపారులు దరఖాస్తు చేయడానికి ఆసక్తి చూపుతున్నట్లు ఎక్సైజ్ శాఖ వెల్లడించింది. ఇప్పటివరకు వచ్చిన దరఖాస్తుల వివరాలు పరిశీలిస్తే, రంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా 2,353 అప్లికేషన్లు రాగా, హైదరాబాద్‌లో 746, నల్లగొండలో 568 దరఖాస్తులు వచ్చాయి. రిజర్వేషన్ల కేటగిరిల్లో కూడా పోటీ కనిపిస్తోంది. గౌడ షాపులకు 671, ఎస్సీ రిజర్వేషన్లకు 202, ఎస్టీ రిజర్వేషన్లకు 84 దరఖాస్తులు వచ్చాయి. జనరల్ కేటగిరీలో 4,686 అప్లికేషన్లు దాఖలయ్యాయి.