కార్మిక సమస్యలు పట్టించుకోని సంఘాలు : రాజారెడ్డి

కార్మిక సమస్యలు పట్టించుకోని సంఘాలు : రాజారెడ్డి
  • సీఐటీయూ స్టేట్ ​ప్రెసిడెంట్ రాజారెడ్డి

కోల్​బెల్ట్, వెలుగు: సింగరేణి కార్మికుల ఓట్లతో గెలిచిన కార్మిక సంఘాలు వారి సమస్యల పరిష్కారాన్ని పట్టించుకోవడంలేదని సింగరేణి కాలరీస్​ఎంప్లాయిస్ ​యూనియన్​(సీఐటీయూ) స్టేట్​ప్రెసిడెంట్​ తుమ్మల రాజారెడ్డి విమర్శించారు. ఆదివారం రామకృష్ణాపూర్​లోని యూనియన్​ఆఫీస్​లో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో యూనియన్​ డిప్యూటీ జనరల్​సెక్రటరీ నాగరాజ్​ గోపాల్​తో కలిసి పాల్గొని మాట్లాడారు. గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ గెలిచి రెండేండ్లు గడుస్తున్నా కార్మికుల సంక్షేమాన్ని, డిమాండ్ల సాధనకు చొరవ చూపడంలేదన్నారు.

సింగరేణి సీఎండీ స్థాయి సమావేశంలో కార్మికుల సొంతింటి కల, పెర్క్స్​పై ఐటీ మాఫీ, మారుపేర్ల సవరణ, దసరా సెలవు మార్పు వంటి అంశాలు పరిష్కారమవుతాయని భావించినప్పటికీ.. సంఘాలు సమావేశాన్ని బహిష్కరించడంతో కార్మికులు తీవ్ర నిరాశకు లోనయ్యారని అన్నారు. సింగరేణి యాజమాన్యం మెడికల్ బోర్డు ఆపడం వల్ల చాలా మంది కార్మికులకు నష్టం జరుగుతోందని, ఇంటర్వ్యూలు జరిగి మెడికల్ ఫిట్ అయిన వారికి అపాయింట్​మెంట్ లెటర్లు ఇవ్వకుండా ఆలస్యం చేస్తోందని మండిపడ్డారు. సింగరేణిలో పీఎల్ఆర్ ​బోనస్​ చెల్లించే తేదీని ప్రకటించాలని డిమాండ్​ చేశారు. సమావేశంలో యూనియన్​బ్రాంచి ప్రెసిడెంట్​ఎస్.వెంకటస్వామి, జనరల్​సెక్రటరీ ఆల్లి రాజేందర్, వైస్​ ప్రెసిడెంట్ ​రామగిరి రామస్వామి తదితరులు పాల్గొన్నారు.