ఎంత కష్ట పడినా ఎలాంటి ఫలితం ఉండదు. ప్రతి పనిలో కూడా ఆటంకాలు.. అవమానాలు ఎదురవుతాయి. అనుకోని చిక్కులు.. టెన్షన్లు..బాధలు.. ఇలా ప్రతి విషయంలో కూడా ప్రతికూల ఫలితాలు వస్తుంటాయి. ఇలా జరుగుతుంటే.. అలాంటి వ్యక్తి శని భగవానుడి వలన కష్టాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. అసలు శని దేవుడి వలన ఎలాంటి కష్టాలు కలుగుతాయి.. ఎలాంటి పరిహారాలు చేయాలి.. పండితులు ఏమంటున్నారు.. మొదలగు విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం. . .!
శని అంటే నవగ్రహాలలో ఒక అతి ముఖ్య గ్రహం.జాతకంలో శని సంబంధిత నక్షత్రాలు పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర. ప్రతివారి జాతకంలో ఏల్నాటి శని, అర్ధాష్టమ, అష్టమ శనులు వస్తూ వుంటాయి. వాటి ప్రభావాన్ని చూపిస్తువుంటాయి.
ప్రతి వ్యక్తికి వారి కర్మానుసారం అంటే వారు పుట్టిన తేది.. సమయం ఆధారంగా ఎంతో కొంత శని వలన బాధలు.. ఇబ్బందులు ఉంటాయి. వీటికి కొన్ని పరిహారాలను చేసుకుంటే శని ప్రభావం తగ్గుతుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. అంతేకాదు ఎవర్నీ దూషించకుండా వుంటే చాలా వరకు ఇబ్బందులు అధిగమించవచ్చని పండితులు అంటున్నారు.
శని ప్రభావం వలన అనుకోని చిక్కులు, ఇబ్బందులు, టెన్షన్స్ అన్నీ కలుగుతాయి. మనసు ఆందోళనగా ఉండడం.. అనవసర జోక్యం, అనారోగ్యాలు, చేద్దామనుకున్న పనులన్నీ వాయిదా పడటం, మానసికంగా అశాంతి ఇలాంటివన్నీ శని దేవుని ఘనతే అని పండితులు చెబుతున్నారు. ప్రతి చోట ఏదో రూపంలో మోసపోవటం, నష్టపోవటం, మానసికంగా ఇబ్బంది అన్నిటికీ సూత్రధారి శని భగవానుడేనని జ్యోతిష్యశాస్త్రం ద్వారా తెలుస్తుంది
ఏలినాటి శనిలో జన్మ శని, వ్యయ శని, ద్వితీయ శనిలో దాదాపుగా రెండున్నర సంవత్సరాల చొప్పున ఏడున్నర సంవత్సరాలు శని వుండటం వలన ఖర్చులు, చిక్కులు, అవమానాలు, బంధుమిత్రులతో విద్వేషాలు వస్తాయి. అప్పటివరకు తనను ప్రేమించేవారు.. ఎంతో సఖ్యత ఉన్నవారు.. బాగా కావలసిన వారితో వైరాలు, మంచి చేస్తే చెడు జరగడం, అప్పులు, హాస్పిటల్ దర్శనాలు ఇలా అనేకరకమైన ఇ్బందులు వస్తా యి.
అర్ధాష్టమ, అష్టమ శనులు నడిచేటపుడు ఆఫీసులో ఇబ్బందులు.. ప్రతి పనిలో అసంతృప్తి, మోకాళ్ల నొప్పులు, స్పాండిలైటిస్, నరాల సమస్యలు, దంత రోగాల సమస్యలు మొదలైన ఇబ్బందులు కలుగుతాయి. ఉద్యోగస్తులు ఇష్టం లేని ప్రదేశాలకి ట్రాన్స్ ఫర్ కావడం.. వృత్తిపరమైన మార్పులు, వైరాగ్యం, అనుకోని పరిచయాల వల్ల ఊహించని చెడు పరిణామాలు, మనసు అంతా వెలితి... ఏదో పోగొట్టుకు న్న భావన. అంతా వున్నా... అందరి మధ్యవున్న.. మంచి హోదా ఉన్నా తెలియని ఆందోళన... అసంతృప్తి... వేదన ఇలా అనేకరకంగా బాధ పడుతుంటారు.
శని భగవానుడి వలన ఇబ్బందులు పడేవారు ఆయనను సంతృప్తి పరచటానికి కొన్ని రెమిడీలు అవసరమని పండితులు చెబుతున్నారు. పండితులను సంప్రదించి.. నీలం రాయితో తయారు చేసిన ఉంగరాన్ని ధరించాలి. అయితే ఎలా పడితే అలా ధరించకూడదు. నీలం ఉంగరానికి శని దేవుడిని శాంతిపరిచేందుకు మూలమంత్రంలో జపం చేయాలి. ఆ తరువాత పండితులను సంప్రదించి ఉంగరాన్ని ధరించాలి. ఏదో ఇబ్బందులు వస్తున్నాయి కదా అని ధరించకూడదు. పండితుల దగ్గర పూర్తి జాతకం చూపించుకున్నాక, అవసరమైతేనే తప్పక ధరించాలి. లేదంటే ప్యాషన్‌గా ధరిస్తే మంచి జరగక పోగా చెడు జరిగే అవకాశాలున్నాయి.
శని దోషాలు.. పరిహారాలు..
- శని శ్రమను కలుగజేస్తాడు. శనిదోషం ఉందని నిర్దారణ అయితే కష్టపడేందుకు సిద్దంగా ఉండాలి. అంటే సోమరితనాన్ని విడనాడి ప్రతిరోజు ఉదయాన్నే మార్నింగ్ వాక్ చెయ్యాలి.సాధ్యమైనంతవరకు వాహనాలను వాడకుండా నడక ద్వారా పనులు చేసుకుంటే మంచిదని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు.
- శనివారం రోజు శరీరం మొత్తానికి నువ్వులనూనె వ్రాసుకొని కొంత సమయం తరువాత వేడి నీటితో స్నానం చెయ్యాలి.
- తడికాళ్ళతో నిద్రించరాదు.పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ముఖ్యంగా పూజ గది, బెడ్రూం,పరిశుభ్రంగా ఉండాలి.సుఖవంతమైన నిద్ర కోసం బెడ్రూంలో నీలం బల్బును బెడ్ లైట్ గా ఉపయోగించాలి.
- చీమలకు తేనె గాని చక్కెర గాని ఆహారంగా ఇవ్వాలి.
- ఆవుకి బెల్లంతో కలిపిన నువ్వులను తినిపించాలి.
- నల్ల కుక్కలకి,కాకులకి ఆహారం వెయ్యాలి.
- ప్రతిరోజు కొంత సమయం మంత్రోపాసన చెయ్యాలి.మెడిటేషన్ చేస్తూ గాలి పీల్చటం,వదలటం చేస్తే వాయు కారకుడు అయిన శని తృప్తి పడతాడు. ముసలివాళ్ళకి,మానసిక వికలాంగులకి, పశుపక్షాదులకి సహాయం చెయ్యాలి. సేవకులను అకారణంగా దూషించకూడదు.
- శని స్తోత్రం, శని చాలీసా, శని అష్టోత్తర, సహస్రనామ స్తోత్రం పారాయణ చాలా మేలు.అమావాస్య రోజున కాళీ స్తోత్రం చదువుకోవాలి.ఇనుముతో చేసిన శివలింగాన్ని గాని,కాళికాదేవిని గాని పూజించాలి.
- ఎడమచేతి మద్యవేలికి గుర్రపు నాడా రింగ్ దరించాలి.
- ప్రతి శనివారం శని భగవానుడికి నువ్వులనూనెతో అభిషేకంచేయాలి. బెల్లం.. నువ్వులను సమర్పించాలి.
- శని త్రయోదశి రోజున కేజీంపావు నల్ల నువ్వులు.. దక్షణితో కలిపి దానం ఇవ్వాలి.
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.
