తెలంగాణ రెసిపీలకు పాన్ ఇండియా గుర్తింపు: మాస్టర్ చెఫ్ ఇండియా..రన్నరప్స్గా మంచిర్యాల తల్లీకూతుళ్లు

తెలంగాణ రెసిపీలకు పాన్ ఇండియా గుర్తింపు: మాస్టర్ చెఫ్ ఇండియా..రన్నరప్స్గా మంచిర్యాల తల్లీకూతుళ్లు

మంచిర్యాల, వెలుగు: సోనీ టీవీ నిర్వహించిన ‘మాస్టర్ చెఫ్ ఇండియా’ సీజన్-10లో మంచిర్యాలకు చెందిన తల్లీకూతుళ్లు రాచకొండ చందన, సాయిశ్రీ ప్రతిభ చాటారు. గ్రాండ్ ఫినాలేలో ఫస్ట్ రన్నరప్స్‌‌‌‌గా నిలిచి తెలంగాణ వంటకాలకు జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చారు.

ఈ షో జనవరి 5 నుంచి ఈ నెల 5 వరకు సోనీ టీవీలో ప్రసారమైంది. ప్రతి సోమవారం నుంచి శుక్రవారం వరకు రాత్రి 8 నుంచి 9 గంటల మధ్య టెలికాస్ట్ చేశారు. మూడు నెలలుగా ముంబైలో షూటింగ్ జరిగింది. ఈ సీజన్‌‌‌‌లో తొలిసారి మదర్-– డాటర్ జోడీని ప్రవేశపెట్టగా చందన, సాయిశ్రీ ఐదు దశల ఆడిషన్లు పూర్తి చేశారు. తెలుగు రాష్ట్రాల నుంచి పాల్గొన్న తొలి జోడీగా నిలిచారు. దేశవ్యాప్తంగా వేలాది మంది ఆడిషన్స్ ఇవ్వగా, వీరు టాప్-25 జోడీల్లో స్థానం దక్కించుకుని ఎలిమినేషన్లు దాటుతూ టాప్-12లో నిలిచారు.

చివరకు ఈ నెల 5న జరిగిన గ్రాండ్ ఫినాలేలో ఫస్ట్ రన్నరప్స్‌‌‌‌గా నిలిచి జిల్లా పేరును దేశవ్యాప్తంగా నిలబెట్టారు. న్యాయనిర్ణేతలు వికాస్ ఖన్నా, రణ్‌‌‌‌వీర్ బ్రార్, కునాల్ కపూర్‌‌‌‌ల ప్రశంసలతో పాటు ఎండెమోల్ షైన్ ఇండియా నుంచి రూ.5 లక్షల నగదు బహుమతిని అందుకున్నారు. రాచకొండ చందన మంచిర్యాలలో నేచురల్, ఆర్గానిక్ వ్యవసాయం చేస్తూ మహిళలకు ఆదర్శంగా నిలుస్తున్నారు.