కోల్‌బెల్ట్, వెలుగు : మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపల్‌చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్ ఎన్నికను మూడు వారాల్లో నిర్వహించాలని హైకోర్టు శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. క్యాతనపల్లి మున్సిపాలిటీలోని 22 వార్డులకు గతంలోనే ఎన్నికలు జరుగగా.. బీఆర్‌ఎస్, సీపీఐ కలిసి 14 స్థానాలు, కాంగ్రెస్ ఏడు స్థానాలు గెలువగా.. ఒకరు ఇండిపెండెంట్‌గా గెలిచారు.
ఈ నెల 16న చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్ ఎన్నికల నిర్వహించాల్సి ఉండగా.. కౌన్సిలర్లు సకాలంలో రాకపోవడంతో ఎన్నికను మరుసటి రోజుకు వాయిదా వేశారు. 17న జరిగే ఎన్నికలో ఎక్స్‌అఫీషియో ఓటు హక్కును వినియోగించుకునేందుకు వస్తున్న మంత్రి వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ కాన్వాయ్‌పై బీఆర్‌ఎస్ లీడర్లు రాళ్ల దాడి చేశారు.
ఈ దాడిలో కానిస్టేబుల్, ఎస్సైతో పాటు పలువురు కాంగ్రెస్ కార్యకర్తలకు గాయాలయ్యాయి. మరోవైపు క్యాతనపల్లి మున్సిపల్ ఆఫీస్‌లో చైర్‌పర్సన్, వైస్‌చైర్‌పర్సన్ ఎన్నిక సందర్భంగా కౌన్సిలర్ల మధ్య గొడవ జరగడంతో రిటర్నింగ్ ఆఫీసర్ ఎన్నిక వాయిదా వేశారు. పాలకవర్గం ఎన్నికను నిర్వహించకపోవడంతో బీఆర్‌ఎస్ లీడర్లు కోర్టును ఆశ్రయించారు. శుక్రవారం ఇరువర్గాల మధ్య వాదనలు జరిగాయి. ఈ మేరకు మూడు వారాల్లో క్యాతనపల్లి మున్సిపల్ చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్ ఎన్నిక నిర్వహించాలంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
