
నెట్వర్క్, వెలుగు: రాష్ట్రంలో వడ్ల కొనుగోలు కేంద్రాలను అడ్డాగా చేసుకొని మిల్లర్లు నడిపిన భారీ స్కామ్ బయటపడింది. వడ్లు కొనకుండానే కొన్నట్లుగా రికార్డులు చూపించి వేల కోట్లు దోచేశారు. ఫేక్ ట్రక్ షీట్లతో జరిగిన ఈ దందా వెనుక సూత్రదారులు రైస్ మిల్లర్లు కాగా.. వీరికి కొందరు అగ్రికల్చరల్ ఆఫీసర్లు, సెంటర్ల నిర్వాహకులు, సివిల్ సప్లయ్స్ ఆఫీసర్లు సహకరించినట్లు తేలింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మొదలైన ఈ దందా ఇప్పటికీ కొనసాగుతున్నది.
వడ్లు కేటాయించినట్లు రికార్డుల్లో ఉండడం, కానీ ఆ మేరకు కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) రాకపోవడంతో ఇటీవల సివిల్ సప్లయ్స్ కొత్త కమిషనర్ స్టీఫెన్రవీంద్ర.. విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ తనిఖీలకు ఆదేశించారు. జిల్లాల్లో తనిఖీలు ప్రారంభించగానే ఈ స్కామ్ బయటపడింది. గత పదేండ్లుగా మిల్లర్లు ప్రభుత్వానికి బియ్యం ఇవ్వకపోవడం వెనుక అసలు మతలబు ఇదే అనే విషయం వెలుగులోకి వచ్చింది. ఎంక్వైరీ ఆఫీసర్లు తీగలాగినకొద్దీ ఒక్కో డొంక కదులుతున్నది. ఇలా ఫేక్ ట్రక్ షీట్లతో పక్కదారి పట్టిన నిధులు రూ. 2 వేల కోట్లకు పైగా ఉన్నట్లు అధికారుల ప్రాథమిక విచారణలో తేలింది.
360 మంది మిల్లర్లు..రూ.3 వేల కోట్లకుపైగా దోపిడీ..
పదేండ్లుగా 360 మందికి పైగా రైస్ మిల్లర్లు రూ.3 వేల కోట్లకు పైగా విలువైన సీఎంఆర్ బియ్యం ఇవ్వకుండా ప్రభుత్వానికి చుక్కలు చూపిస్తున్నారు. కేవలం 20 మంది మిల్లర్లే ఏకంగా రూ.600 కోట్ల విలువైన బియ్యాన్ని ప్రభుత్వానికి సప్లయ్ చేయట్లేదు. దీంతో ఉన్నతాధికారుల ఆదేశాలతో సివిల్ సప్లయ్ ఆఫీసర్లు రైస్ మిల్లులకు వెళ్లి తనిఖీలు చేస్తే అక్కడ వడ్ల బస్తాలు కనిపించడం లేదు. బియ్యమూ లేవు. మొదట్లో ప్రభుత్వం కేటాయించిన వడ్లను మిల్లర్లు బయట అమ్ముకొని లెవీ పెట్టడం లేదని భావించారు. దీంతో అధికారులు రైస్ మిల్లులకు నోటీస్లు ఇవ్వడంతోపాటు కొన్ని చోట్ల రైస్ మిల్లులను సీజ్ చేస్తూ ఒత్తిడి పెంచారు. అయినప్పటికీ లాభం లేకపోవడంతో కొత్తగా బాధ్యతలు తీసుకున్న సివిల్ సప్లయ్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర రూట్మార్చారు.
సీఎంఆర్ బియ్యం ఇవ్వని రైస్ మిల్లుల్లో విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్తనిఖీలకు ఆదేశించారు. ఎప్పట్లాగే కేటాయించిన వడ్లు, మిల్లుల్లో నిల్వలకు మధ్య ఉన్న తేడాకే పరిమితం కాకుండా లోతుగా దర్యాప్తు చేయించారు. ఆయా రైస్ మిల్లులకు వడ్ల బస్తాలు ఏ కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చాయి? వడ్లు అమ్మిన రైతుల పేర్లేంటి? వంటి వివరాలనూ క్షేత్రస్థాయిలో ఎంక్వైరీ చేస్తున్నారు. దీంతో రైస్ మిల్లర్లు వడ్లు కొనకుండానే చేసిన దందాలన్నీ ఒక్కొక్కటిగా వెలుగుచూస్తు న్నాయి. మొత్తం మీద 2014 నుంచి ఇప్పటి వరకు సీఎంఆర్ ఇవ్వకుండా తప్పించుకు తిరుగుతున్న రైస్మిల్లర్లలో సుమారు రూ.2 వేల కోట్ల వరకు ఇలాగే కాజేసినట్లు ఎంక్వైరీ
ఆఫీసర్లు చెప్తున్నారు.