
మంచిర్యాల, వెలుగు: బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టేను వ్యతిరేకిస్తూ మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తాలో భక్త మార్కండేయ పద్మశాలి స్వచ్ఛంద సేవ సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం నిరసన తెలిపారు. నేతలు మాట్లాడుతూ.. దేశంలో మెజార్టీ ఉన్న బీసీలకు దక్కాల్సిన హక్కులు, రాజ్యాధికారంలో వాటా రాకపోవడంతో అన్ని రంగాల్లో వెనుకబడిపోతున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో9ను తీసుకొచ్చి, స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు కల్పిస్తే జీవోకు వ్యతిరేకంగా అగ్రవర్ణాలైన రెడ్డి జాగృతి హైకోర్టుకు వెళ్లడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు.
బీసీల మనోభావాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని అన్నారు. బీసీ రిజర్వేషన్ల పట్ల స్థానుకూలంగా లేని రాజకీయ పార్టీలను రాబోయే ఎన్నికల్లో ఓడించి బుద్ధి చెబుతామని పేర్కొన్నారు. కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమ కారుల ఐక్య వేదిక అధ్యక్షుడు, బీసీ సంఘాల నేత గజెల్లి వెంకటయ్య, సంఘం నాయకులు చెలిమెల అంజయ్య, అంకం సతీశ్, జె.శ్రీనివాస్, చంద్రగిరి చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.