
2025లో బంగారం ర్యాలీ ఆగే సూచనలు అస్సలే కనిపించడం లేదు. ఇప్పటికే ఈ ఏడాదిలో బంగారం ధరలు దాదాపు 50 శాతానికి పైనే పెరిగాయి. 2022తో పోలిస్తే మొత్తం పెరుగుదల 140 శాతానికి చేరుకుంది. గ్లోబల్ ఆర్థిక అనిశ్చితి వాతావరణం, వడ్డీ రేట్లపై అంచనాలు, వీక్ డాలర్ పెట్టుబడిదారుల ధోరణి కలిసి బంగారానికి చరిత్రాత్మక వేగాన్నిచ్చాయి. ఈ ధనత్రయోదశి సమయంలో కూడా రికార్డు స్థాయిలకు చేరే అవకాశం ఉన్నదని నిపుణులు చెబుతున్నారు.
సెంట్రల్ బ్యాంకులు, ETFల ద్వారా ప్రజలు బంగారం కొనుగోలు కొనసాగిస్తుండటం రికార్డ్ స్థాయి ధరల దిశగా మార్కెట్లను నడిపిస్తోంది. అలాగే రాబోయే వడ్డీ రేట్ల కోతల నేపథ్యంలో ప్రభుత్వాలు ముద్రించే ఫియెట్ కరెన్సీలపై విశ్వాసం తగ్గిపోవడం ధరలను నడిపిస్తోందని SMC గ్లోబల్ సెక్యూరిటీస్ కమోడిటీ రీసెర్చ్ హెడ్ వందనా భారతి చెబుతున్నారు. ఈ ధనత్రయోదశి సీజన్‌లో బంగారం ధర రూ.లక్ష 20వేల నుంచి రూ.లక్ష 30వేల మధ్య 10 గ్రాములకు ఉండొచ్చని చెబుతున్నారు. అలాగే 2026 ప్రారంభ నాటికి 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.లక్ష 50వేల స్థాయికి వెళ్లే అవకాశం ఉందని ఆమె అంచనావేశారు.
ప్రస్తుతం బలహీనమైన అమెరికా డాలర్ ఇతర కరెన్సీల్లో పెట్టుబడిదారులకు బంగారం చవకగా మారింది. దీనికి అదనంగా సెంట్రల్ బ్యాంకులు తమ రిజర్వులను డాలర్ల రూపంలో తగ్గించుకుంటూ డైవర్సిఫికేషన్ కోసం గోల్డ్ కొనటంతో మల్టీ–డెకేడ్ రికార్డు స్థాయిలో బంగారం కొనుగోలు చేస్తున్నాయి. ఇంతలో ఎక్స్చేంజ్–ట్రేడెడ్ ఫండ్‌లు (ETFs) కూడా కొత్తగా పెట్టుబడులను ఆకర్షిస్తూ సేఫ్ హెవన్ తిరిగి బలపడుతోంది. ఈటీఎఫ్ పెట్టుబడుల విషయంలో ఇండియా.. అమెరికా, యూకే, స్విట్జర్లాండ్ తర్వాత నాలుగో స్థానంలో ఉన్నట్లు వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ తాజాగా నివేదించటం ఆశ్చర్యం కలిగిస్తోంది.
ALSO READ : ఆల్ టైం హైకి గోల్డ్ అండ్ సిల్వర్..
అంతర్జాతీయ కారకాలతో పాటు దేశంలో ధరల పెరుగుదలకు పెళ్లిళ్ల సీజన్, పండుగ సమయం లాంటి సీజనల్ డిమాండ్ అంశాలు ఉన్నాయి. ద్రవ్యోల్బణ భయం పెట్టుబడిదారులను బంగారాన్ని విశ్వసనీయమైన విలువ నిలుపు సాధనంగా ప్రేరేపిస్తోందని నిపుణులు అంటున్నారు. పెద్ద కరెన్సీ సంక్షోభం లేదా తీవ్రమైన భూభౌగోళిక సంఘటనలు జరుగకపోతే ధనత్రయోదశి నాటికి రూ.లక్ష 50వేల స్థాయిలను దాటడం కష్టమేనని చెబుతున్నారు. ముందు చూపుగా 2026లో కూడా బంగారం పెరుగుదల కొనసాగుతుందని భావిస్తున్నారు మార్కెట్ నిపుణులు.