కౌలు రైతుల పేరుతో మిల్లర్ల మాయ.. వేల కోట్ల లూటీ వెనక ఆధారాలు ఇవే

కౌలు రైతుల పేరుతో మిల్లర్ల మాయ.. వేల కోట్ల లూటీ వెనక ఆధారాలు ఇవే

నెట్​వర్క్​, వెలుగు: రాష్ట్రంలో వడ్ల కొనుగోలు కేంద్రాలను అడ్డాగా చేసుకొని మిల్లర్లు నడిపిన భారీ స్కామ్​ బయటపడింది. వడ్లు కొనకుండానే కొన్నట్లుగా రికార్డులు చూపించి వేల కోట్లు దోచేశారు. ఫేక్​ ట్రక్​ షీట్లతో జరిగిన ఈ దందా వెనుక సూత్రదారులు రైస్​ మిల్లర్లు కాగా.. వీరికి కొందరు అగ్రికల్చరల్​ ఆఫీసర్లు, సెంటర్ల  నిర్వాహకులు, సివిల్​ సప్లయ్స్​ ఆఫీసర్లు సహకరించినట్లు తేలింది. గత బీఆర్ఎస్​ ప్రభుత్వ హయాంలో మొదలైన ఈ దందా ఇప్పటికీ కొనసాగుతున్నది. 

వడ్లు కేటాయించినట్లు రికార్డుల్లో ఉండడం, కానీ ఆ మేరకు కస్టమ్​ మిల్లింగ్​ రైస్​ (సీఎంఆర్)​  రాకపోవడంతో ఇటీవల సివిల్​ సప్లయ్స్​ కొత్త కమిషనర్​ స్టీఫెన్​రవీంద్ర.. విజిలెన్స్​, ఎన్​ఫోర్స్​మెంట్ తనిఖీలకు ఆదేశించారు. జిల్లాల్లో తనిఖీలు ప్రారంభించగానే ఈ స్కామ్​ బయటపడింది. గత పదేండ్లుగా మిల్లర్లు ప్రభుత్వానికి బియ్యం ఇవ్వకపోవడం వెనుక అసలు మతలబు ఇదే అనే విషయం వెలుగులోకి వచ్చింది. ఎంక్వైరీ ఆఫీసర్లు తీగలాగినకొద్దీ ఒక్కో డొంక  కదులుతున్నది. ఇలా ఫేక్​ ట్రక్​ షీట్లతో పక్కదారి పట్టిన నిధులు రూ. 2 వేల కోట్లకు పైగా ఉన్నట్లు అధికారుల ప్రాథమిక విచారణలో తేలింది. 

ఇవిగో ఆధారాలు.. 

హనుమకొండ జిల్లా శాయంపేట మండలానికి చెందిన కాట్రపల్లి, పత్తిపాక, శాయంపేట వడ్ల కొనుగోలు సెంటర్ల నుంచి కమలాపూర్​ మండలంలోని సాంబశివ రైస్​ మిల్లుకు రూ.1.70 కోట్ల విలువ చేసే వడ్లు పంపినట్లుగా రికార్డులున్నాయి. ఈ రైస్​ మిల్లు ఓనర్​ సీఎంఆర్​ ఇవ్వకుండా తిప్పుకుంటున్నాడు. దీంతో విజిలెన్స్​, ఎన్​ఫోర్స్​మెంట్​ ఆఫీసర్లు రైస్​మిల్లును తనిఖీ చేస్తే.. అక్కడ వడ్లుగానీ, బియ్యం గానీ లేవు. దీంతో ట్రక్​ షీట్లను పరిశీలిస్తే రైతుల పేర్లకు బదులు రైస్​ మిల్లు ఓనర్​ కుటుంబ సభ్యులు, బంధువుల పేర్లు ఉన్నాయి.
 

వేరే మండలానికి చెందిన వారు ఇక్కడ ఎట్లా వడ్లు అమ్మారని సెంటర్​ నిర్వాహకులను, అగ్రికల్చరల్​, సివిల్​ సప్లయ్​ ఆఫీసర్లను ప్రశ్నిస్తే.. అందరూ నీళ్లు నమిలారు. ఈ ఒక్క రైస్​ మిల్లులోనే రూ.1.70 కోట్ల స్కామ్​ జరిగినట్లు ఆఫీసర్లు నిర్ధారించి.. అందరిపై క్రిమినల్​ కేసు నమోదు చేసి, నిధులు రికవరీ చేయడానికి సర్కారుకు నివేదిక సమర్పించారు. 
    
మహబూబాబాద్ జిల్లాలోని పలు రైస్ మిల్లులపై రాష్ట్ర సివిల్ సప్లయ్స్​, టాస్క్ ఫోర్స్ అధికారులు ఇటీవల దాడులు నిర్వహించారు. మూడు రైస్​మిల్లులకు రూ. 24 కోట్ల విలువైన సీఎంఆర్​ ధాన్యం చేసినట్లు రికార్డుల్లో ఉన్నప్పటికీ ఎక్కడా వడ్లు, బియ్యం లేవు. దీంతో ముగ్గురు రైస్ మిల్లర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు.
    
నిర్మల్, నిజామాబాద్ జిల్లాలకు చెందిన కొందరు బడా వ్యాపారులు కేవలం ఈ తరహా దందా కోసమే రైస్ మిల్లులను ఏర్పాటు చేసినట్లు వెలుగుచూసింది. రూ. 2 కోట్ల నుంచి 3 కోట్లతో  రైస్​ మిల్లులను ఏర్పాటు చేసి.. సీఎంఆర్​ పేరుతో రూ.20 కోట్ల వరకు కాజేసినట్లు తేలింది.  ముథోల్ మండలంలోని ముద్గల్ గ్రామంలో గల ఏషియన్ రైస్ మిల్​తో పాటు శ్రీ గణపతి రైస్​ మిల్లులో రూ.20 కోట్లకు పైగా ఫేక్​ట్రక్​షీట్ల స్కామ్​ జరిగినట్లు ఆఫీసర్లు తేల్చారు. ఈ రెండు రైస్​ మిల్లులను కూడా బడా వ్యాపారులు తమ బినామీ పేర్లతో నిర్వహిస్తున్నట్లు  బయటపడింది.  
    
మెదక్ జిల్లాలో బాయిల్డ్​ రైస్​మిల్లుల నుంచి రూ. 13.13 కోట్లు, రా రైస్​ మిల్లుల నుంచి రూ. 26.56 కోట్ల విలువైన ధాన్యం కేటాయించినట్లు రికార్డుల్లో ఉన్నా ఎక్కడా వడ్లు లేవు. బియ్యం కేటాయించడం లేదు. దీంతో ఈ జిల్లాలో 24 రైస్​ మిల్లులపై ఆఫీసర్లు లోతుగా ఎంక్వైరీ చేస్తున్నారు.
    
నిజామాబాద్ జిల్లాలో గత ప్రభుత్వ హయాంలో 51 మంది మిల్లర్లు  పదేండ్లలో రూ.270 కోట్ల విలువైన ధాన్యం కేటాయించుకున్నట్లు రికార్డుల్లో ఉంది. సీఎంఆర్​ఇవ్వకపోవడంతో వారిపై వడ్డీ, పెనాల్టీలు వేయగా, ఆ మొత్తం రూ.372 కోట్లకు చేరింది. ఏ ఒక్క మిల్లులోనూ వడ్లుగానీ బియ్యంగానీ లేవు. దీంతో ఇక్కడ కూడా ఫేక్​ట్రక్​షీట్ల దందా జరిగినట్లు అనుమానిస్తున్న అధికారులు లోతుగా ఎంక్వైరీ చేస్తున్నారు. బోధన్​లోని  ఒక మాజీ ప్రజాప్రతినిధి  రూ.160 కోట్లు కాజేసినట్లు అధికారులు గుర్తించారు. గత బీఆర్ఎస్​హయాంలో తన పలుకుబడి ఉపయోగించి 2021-22, 2022-23 సీజన్లలో ఈ దందాకు పాల్పడినట్లు తేల్చారు.