
రామ్ పోతినేని హీరోగా నటించిన ఆంధ్రా కింగ్ తాలూకా టీజర్ విడుదలైంది. ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ ఫేమ్ పి.మహేష్ బాబు తెరకెక్కించిన ఈ చిత్రం నవంబర్ 28న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్ కానుంది. ఈ క్రమంలో ఇవాళ (అక్టోబర్ 12న) టీజర్ రిలీజ్ చేసి సినిమాపై క్యూరియాసిటీ పెంచారు మేకర్స్.
ఈ మూవీలో కన్నడ రియల్ స్టార్ హీరో ఉపేద్రకు రామ్ వీరాభిమానిగా కనిపించనున్నాడు. చిన్నప్పటి నుంచి సినిమాలపై పిచ్చి ప్రేమతో ఉన్న కుర్రాడి, లైఫ్ లోకి తన అభిమాన హీరో వస్తే ఎలాంటి మలుపు తిరిగిందనేదే ఆంధ్రా కింగ్. అందుకు తగ్గట్టుగానే టీజర్ ఇంట్రెస్టింగ్గా సాగింది.
రామ్ డైలాగ్స్, ఎక్సప్రెషన్స్, హీరోయిన్ భాగ్యశ్రీతో కెమిస్ట్రీ ఆకట్టుకునేలా ఉంది. ఈ క్రమంలో ‘ఫ్యాన్..ఫ్యాన్ అని గుడ్డలు చింపేసుకోవడమే కానీ.. నువ్వు ఒకడివి ఉన్నావని కూడా మీ హీరోకి తెలియదు. ఏం బతుకులుగా మీవీ.. ఛీ ఛీ’ అని నటుడు మురళి శర్మ చెప్పే డైలాగ్ సినిమా కథనంపై ఆసక్తి క్రియేట్ చేసింది.
ఈ సినిమాలో కన్నడ స్టార్ ఉపేంద్రతో పాటుగా వీటీవీ గణేష్, రావు రమేష్, మురళీ శర్మ, సత్య, రాహుల్ రామకృష్ణ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్నారు. వివేక్, మెర్విన్ సంగీతం అందిస్తున్నారు.