వడ్లు లేవు.. బియ్యం లేవు.. వేల కోట్లు లూటీ.. బయటపడ్డ రైస్ మిల్లర్ల భారీ స్కామ్

వడ్లు లేవు.. బియ్యం లేవు.. వేల కోట్లు లూటీ.. బయటపడ్డ రైస్ మిల్లర్ల భారీ స్కామ్
  • ఫేక్ ట్రక్​ షీట్లతో మిల్లర్ల స్కామ్​.. పదేండ్ల నుంచి ఇదే కథ
  • కౌలు రైతుల కోసం కేటాయించిన ఆప్షన్​తో దందా
  • కుటుంబసభ్యులు, తెలిసినోళ్ల పేర్లు చేర్చి రూ. 2వేల కోట్లకు పైగా దోపిడీ
  • సహకరించిన కొందరు ఆఫీసర్లు, సెంటర్ల నిర్వాహకులు
  • సీఎంఆర్ బియ్యం ఇవ్వకపోవడం వెనుక మతలబు ఇదే! 
  • విజిలెన్స్, ఎన్​ఫోర్స్​మెంట్​ తనిఖీల్లో బయటపడుతున్న బాగోతం

నిరుడు డిసెంబర్‎లో సూర్యాపేట జిల్లాలోని నాలుగు మిల్లులపై దాడులు నిర్వహించగా.. రెండు మిల్లుల్లో భారీగా అక్రమాలు జరిగినట్టు గుర్తించారు. తిరుమలగిరిలోని సూర్యాపేట రైస్ మిల్లర్ల్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఇమ్మిడి సోమనర్సయ్యకు చెందిన సంతోషిమాత రైస్​మిల్, రఘురామ రైస్ ఇండ్రస్ట్రీలో దాదాపు రూ. 220 కోట్ల సీఎంఆర్ రైస్ పక్కదారి పట్టినట్లు అధికారులు తేల్చారు. 

వీటితో పాటు కోదాడ శ్రీ వెంకటేశ్వర రైస్ మిల్ లో రూ.90కోట్ల సీఎంఆర్​ బియ్యం మాయమైనట్లు గుర్తించారు. మొదట్లో మరాడించిన వడ్లను అమ్ముకొని సీఎంఆర్​ఎగవేశారని భావించగా, ప్రస్తుతం ఫేక్​ ట్రక్ ​షీట్ల వ్యవహారం వెలుగులోకి రావడంతో సూర్యాపేట జిల్లాలోనూ మరోసారి తనిఖీలు చేపట్టేందుకు విజిలెన్స్​ ఎన్​ఫోర్స్​మెంట్​అధికారులు రెడీ అవుతున్నారు. 

నెట్​వర్క్​, వెలుగు: రాష్ట్రంలో వడ్ల కొనుగోలు కేంద్రాలను అడ్డాగా చేసుకొని మిల్లర్లు నడిపిన భారీ స్కామ్​ బయటపడింది. వడ్లు కొనకుండానే కొన్నట్లుగా రికార్డులు చూపించి వేల కోట్లు దోచేశారు. ఫేక్​ ట్రక్​ షీట్లతో జరిగిన ఈ దందా వెనుక సూత్రదారులు రైస్​ మిల్లర్లు కాగా.. వీరికి కొందరు అగ్రికల్చరల్​ ఆఫీసర్లు, సెంటర్ల  నిర్వాహకులు, సివిల్​ సప్లయ్స్​ ఆఫీసర్లు సహకరించినట్లు తేలింది. 

గత బీఆర్ఎస్​ ప్రభుత్వ హయాంలో మొదలైన ఈ దందా ఇప్పటికీ కొనసాగుతున్నది. వడ్లు కేటాయించినట్లు రికార్డుల్లో ఉండడం, కానీ ఆ మేరకు కస్టమ్​ మిల్లింగ్​ రైస్​ (సీఎంఆర్)​  రాకపోవడంతో ఇటీవల సివిల్​ సప్లయ్స్​ కొత్త కమిషనర్​ స్టీఫెన్​రవీంద్ర.. విజిలెన్స్​, ఎన్​ఫోర్స్​మెంట్ తనిఖీలకు ఆదేశించారు. 

జిల్లాల్లో తనిఖీలు ప్రారంభించగానే ఈ స్కామ్​ బయటపడింది. గత పదేండ్లుగా మిల్లర్లు ప్రభుత్వానికి బియ్యం ఇవ్వకపోవడం వెనుక అసలు మతలబు ఇదే అనే విషయం వెలుగులోకి వచ్చింది. ఎంక్వైరీ ఆఫీసర్లు తీగలాగినకొద్దీ ఒక్కో డొంక  కదులుతున్నది. ఇలా ఫేక్​ ట్రక్​ షీట్లతో పక్కదారి పట్టిన నిధులు రూ. 2 వేల కోట్లకు పైగా ఉన్నట్లు అధికారుల ప్రాథమిక విచారణలో తేలింది. 

పదేండ్లలో ఇబ్బడిముబ్బడిగా రైస్​ మిల్లులు 

రైతులు పండించిన వడ్లను మద్దతు ధరకు కొనుగోలు చేయాలనే ఉద్దేశంతో వానాకాలం, యాసంగి సీజన్లలో రాష్ట్ర ప్రభుత్వం గ్రామగ్రామానా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నది. రైతుల సౌలభ్యం కోసం సెంటర్ల సంఖ్యను పెంచుతూ వస్తున్నది. రాష్ట్రవ్యాప్తంగా ఈ వానాకాలం సీజన్​లో 8 వేలకుపైగా కొనుగోలు సెంటర్లను ఏర్పాటు చేయబోతున్నది.  

వడ్ల సేకరణ కోసం ప్రభుత్వం ఒక్కో సీజన్​లో తక్కువలో తక్కువ  రూ. 20 వేల కోట్లకుపైగా నిధులను ఖర్చు చేస్తున్నది. కాగా, ఉమ్మడి ఏపీలో నష్టాలబాట పట్టిన రైస్ ​మిల్లులు ఒకదశలో మూసివేసే స్థితికి చేరుకున్నాయి. కానీ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడి బీఆర్​ఎస్​అధికారంలోకి వచ్చాక ఒక్కసారిగా సీన్​ మారింది. సర్కారే వడ్లను కొని ఎలాంటి బ్యాంక్​ గ్యారంటీ లేకుండా కోట్ల విలువైన వడ్లను రైస్​ మిల్లర్లకు కేటాయించడం మొదలైంది. 

ఇది కాస్తా లాభసాటి వ్యాపారంగా మారడంతో ఆ పార్టీకి చెందిన బడా నేతలు పెద్ద సంఖ్యలో రైస్​ మిల్లులను ఏర్పాటు చేసి, కొన్నిచోట్ల అప్పటికే నడుస్తున్న మిల్లులను కూడా కొనుగోలు చేయడం మొదలుపెట్టారు. దీంతో ఒకప్పుడు వెయ్యిలోపు ఉన్న రైస్​ మిల్లులు బీఆర్​ఎస్​హయాంలో ఏకంగా 3,500కు చేరాయి. నిజానికి రైతుల నుంచి కొన్న వడ్లను  కస్టమ్​ మిల్లింగ్​ రైస్​ (సీఎంఆర్​) స్కీం కింద ప్రభుత్వం  రైస్​ మిల్లర్లకు కేటాయిస్తుంది. 

మిల్లర్లు ప్రతి క్వింటాల్​కు 67 కేజీల బియ్యం ప్రభుత్వానికి సప్లయ్​ చేయాలి. వడ్లను బియ్యంగా మార్చడానికి అయ్యే ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే మిల్లర్లకు చెల్లిస్తుంది. కాగా, సీఎంఆర్​ స్కీమ్​లో ఉన్న లొసుగులను ఉపయోగించుకొని మిల్లర్లు వడ్లు కొనకుండా, బియ్యంగా మార్చి ప్రభుత్వానికి ఇవ్వకుండా ప్రభుత్వం నుంచి వేల కోట్లు దోచుకున్నారు. 

ట్రక్​ షీట్లపైనే పేర్లు.. అసలా రైతులే లేరు..

గ్రామాల్లో ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాల నిర్వహణ బాధ్యతలను ప్రభుత్వం ఐకేపీ, పీఏసీఎస్​, జీసీసీ వంటి సంస్థలకు అప్పగిస్తుంటుంది. నిబంధనల ప్రకారం సెంటర్​లో కొన్న వడ్ల బస్తాలను సివిల్​ సప్లయ్​ ఆఫీసర్లు కేటాయించిన రైస్​ మిల్లులకు పంపించాలి. రైతుల పేర్లు, బస్తాల సంఖ్య లాంటి వివరాలతో నిర్వాహకులు ట్రక్​షీట్​తయారుచేసి లోడ్​ను తీసుకెళ్లే లారీలతో పాటు మిల్లర్​కు పంపించాలి.

 రైస్​ మిల్లర్​ బస్తాలను అన్​లోడ్​ చేసుకున్నాక ఆ ట్రక్​షీట్​ మీద సంతకం చేసి, తన రైస్​మిల్లు స్టాంప్​ వేసి తిరిగి కొనుగోలు సెంటర్​కు పంపించాలి.  ఆ తర్వాత వడ్లు అమ్మిన రైతుల నుంచి తీసుకున్న ఆధార్​, పట్టాదారు పాస్​బుక్​, బ్యాంక్​ అకౌంట్​, సెల్​ ఫోన్​ నెంబర్, అగ్రికల్చరల్​ ఆఫీసర్లు ఇచ్చే టోకెన్​ ఆధారంగా కోనుగోలు సెంటర్​ నిర్వాహకులు చెల్లింపుల కోసం తమ దగ్గర ఉన్న ట్యాబ్​లో వివరాలు నమోదు చేయాలి. 

ఇవి సివిల్​ సప్లయ్స్​ డీఎం ఆఫీస్​కు వెళ్లిన తర్వాత ఫైనల్​ వెరిఫికేషన్​ చేసి..  రెండు, మూడు రోజుల్లో రైతుల అకౌంట్లలో డబ్బులు జమ చేయాలి. కానీ ఈ విధానంలో ఉన్న లొసుగులను ఆసరాగా చేసుకొన్న కొందరు మిల్లర్లు స్కామ్​కు తెరలేపారు. 

కొనుగోలు సెంటర్​ నిర్వాహకులకు, అగ్రికల్చరల్​ ఆఫీసర్లకు, జిల్లాలో పనిచేసే కొందరు సివిల్​ సప్లయ్ ఉద్యోగులకు డబ్బులు ఎరవేసి ట్రక్​ షీట్లపై తమ కుటుంబ సభ్యులు, బంధువుల పేర్లు రాసి కొనుగోలు సెంటర్ల నుంచి వడ్ల బస్తాల లోడ్లను​ తమ రైస్​ మిల్లులకు పంపించినట్లు,  ఆ వడ్లను తమ రైస్​ మిల్లులో అన్​లోడ్​ చేసుకున్నట్లు తప్పుడు రికార్డులు సృష్టించారు. 

అంటే ఆయా రైస్​మిల్లులకు కొనుగోలు కేంద్రాల నుంచి ఎలాంటి వడ్లు తీసుకోనప్పటికీ ప్రభుత్వం ఇచ్చే కోట్ల సొమ్మును రైతుల పేరుతో కొట్టేశారు. ట్యాబ్​లో కౌలు రైతుల కోసం ప్రభుత్వం కేటాయించిన ఆప్షన్​ను ఇందుకు ఉపయోగించుకున్నారు. కొనుగోలు సెంటర్​ పరిధిలో ఉన్న రైతుల వ్యవసాయ భూమిని కౌలుకు తీసుకొని పంట పండించి తమకు వడ్లు అమ్మినట్లుగా తప్పుడు వివరాలను అప్​లోడ్​ చేసి  రూ. కోట్ల నిధులు కాజేశారు.

 ఒకటి కాదు, రెండు కాదు దాదాపు అన్ని జిల్లాల్లోనూ ఈ దందా నడిపారు. ఇందుకు సహకరించిన కొనుగోలు కేంద్రాల​ నిర్వాహకులు, అగ్రికల్చరల్​ ఆఫీసర్లు, సివిల్​ సప్లయ్​ ఆఫీసర్లకు భారీగానే ముడుపులు ముట్టజెప్పినట్లు ఎంక్వైరీ ఆఫీసర్లు గుర్తించారు.

360 మంది మిల్లర్లు..రూ.3 వేల కోట్లకుపైగా దోపిడీ..

పదేండ్లుగా 360 మందికి పైగా రైస్​ మిల్లర్లు రూ.3 వేల కోట్లకు పైగా విలువైన సీఎంఆర్​ బియ్యం ఇవ్వకుండా ప్రభుత్వానికి చుక్కలు చూపిస్తున్నారు. కేవలం 20 మంది మిల్లర్లే ఏకంగా రూ.600 కోట్ల విలువైన బియ్యాన్ని ప్రభుత్వానికి సప్లయ్​ చేయట్లేదు. దీంతో ఉన్నతాధికారుల ఆదేశాలతో సివిల్​ సప్లయ్​ ఆఫీసర్లు రైస్​ మిల్లులకు వెళ్లి తనిఖీలు చేస్తే అక్కడ వడ్ల బస్తాలు కనిపించడం లేదు.

 బియ్యమూ లేవు.  మొదట్లో ప్రభుత్వం కేటాయించిన వడ్లను మిల్లర్లు  బయట అమ్ముకొని లెవీ పెట్టడం లేదని భావించారు. దీంతో అధికారులు  రైస్​ మిల్లులకు నోటీస్​లు ఇవ్వడంతోపాటు కొన్ని చోట్ల రైస్​ మిల్లులను సీజ్​ చేస్తూ ఒత్తిడి పెంచారు. అయినప్పటికీ లాభం లేకపోవడంతో  కొత్తగా బాధ్యతలు తీసుకున్న సివిల్​ సప్లయ్​ కమిషనర్​ స్టీఫెన్​ రవీంద్ర రూట్​మార్చారు. 

సీఎంఆర్​ బియ్యం ఇవ్వని రైస్​ మిల్లుల్లో విజిలెన్స్​, ఎన్​ఫోర్స్​మెంట్​తనిఖీలకు ఆదేశించారు. ఎప్పట్లాగే కేటాయించిన వడ్లు, మిల్లుల్లో నిల్వలకు మధ్య ఉన్న తేడాకే పరిమితం కాకుండా లోతుగా దర్యాప్తు చేయించారు. ఆయా రైస్​ మిల్లులకు వడ్ల బస్తాలు ఏ కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చాయి? వడ్లు అమ్మిన రైతుల పేర్లేంటి?  వంటి వివరాలనూ క్షేత్రస్థాయిలో ఎంక్వైరీ చేస్తున్నారు.

 దీంతో రైస్​ మిల్లర్లు వడ్లు కొనకుండానే చేసిన దందాలన్నీ  ఒక్కొక్కటిగా వెలుగుచూస్తు న్నాయి.  మొత్తం మీద 2014 నుంచి ఇప్పటి వరకు సీఎంఆర్​ ఇవ్వకుండా తప్పించుకు తిరుగుతున్న రైస్​మిల్లర్లలో సుమారు రూ.2 వేల కోట్ల వరకు ఇలాగే కాజేసినట్లు ఎంక్వైరీ ఆఫీసర్లు చెప్తున్నారు.   

ఇవిగో ఆధారాలు.. 

హనుమకొండ జిల్లా శాయంపేట మండలానికి చెందిన కాట్రపల్లి, పత్తిపాక, శాయంపేట వడ్ల కొనుగోలు సెంటర్ల నుంచి కమలాపూర్​ మండలంలోని సాంబశివ రైస్​ మిల్లుకు రూ.1.70 కోట్ల విలువ చేసే వడ్లు పంపినట్లుగా రికార్డులున్నాయి. ఈ రైస్​ మిల్లు ఓనర్​ సీఎంఆర్​ ఇవ్వకుండా తిప్పుకుంటున్నాడు. దీంతో విజిలెన్స్​, ఎన్​ఫోర్స్​మెంట్​ ఆఫీసర్లు రైస్​మిల్లును తనిఖీ చేస్తే.. అక్కడ వడ్లుగానీ, బియ్యం గానీ లేవు. 

దీంతో ట్రక్​ షీట్లను పరిశీలిస్తే రైతుల పేర్లకు బదులు రైస్​ మిల్లు ఓనర్​ కుటుంబ సభ్యులు, బంధువుల పేర్లు ఉన్నాయి. వేరే మండలానికి చెందిన వారు ఇక్కడ ఎట్లా వడ్లు అమ్మారని సెంటర్​ నిర్వాహకులను, అగ్రికల్చరల్​, సివిల్​ సప్లయ్​ ఆఫీసర్లను ప్రశ్నిస్తే.. అందరూ నీళ్లు నమిలారు. ఈ ఒక్క రైస్​ మిల్లులోనే రూ.1.70 కోట్ల స్కామ్​ జరిగినట్లు ఆఫీసర్లు నిర్ధారించి.. అందరిపై క్రిమినల్​ కేసు నమోదు చేసి, నిధులు రికవరీ చేయడానికి సర్కారుకు నివేదిక సమర్పించారు. 
    
మహబూబాబాద్ జిల్లాలోని పలు రైస్ మిల్లులపై రాష్ట్ర సివిల్ సప్లయ్స్​, టాస్క్ ఫోర్స్ అధికారులు ఇటీవల దాడులు నిర్వహించారు. మూడు రైస్​మిల్లులకు రూ. 24 కోట్ల విలువైన సీఎంఆర్​ ధాన్యం చేసినట్లు రికార్డుల్లో ఉన్నప్పటికీ ఎక్కడా వడ్లు, బియ్యం లేవు. దీంతో ముగ్గురు రైస్ మిల్లర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు.
    
నిర్మల్, నిజామాబాద్ జిల్లాలకు చెందిన కొందరు బడా వ్యాపారులు కేవలం ఈ తరహా దందా కోసమే రైస్ మిల్లులను ఏర్పాటు చేసినట్లు వెలుగుచూసింది. రూ. 2 కోట్ల నుంచి 3 కోట్లతో  రైస్​ మిల్లులను ఏర్పాటు చేసి.. సీఎంఆర్​ పేరుతో రూ.20 కోట్ల వరకు కాజేసినట్లు తేలింది.

  ముథోల్ మండలంలోని ముద్గల్ గ్రామంలో గల ఏషియన్ రైస్ మిల్​తో పాటు శ్రీ గణపతి రైస్​ మిల్లులో రూ.20 కోట్లకు పైగా ఫేక్​ట్రక్​షీట్ల స్కామ్​ జరిగినట్లు ఆఫీసర్లు తేల్చారు. ఈ రెండు రైస్​ మిల్లులను కూడా బడా వ్యాపారులు తమ బినామీ పేర్లతో నిర్వహిస్తున్నట్లు  బయటపడింది.  
    
మెదక్ జిల్లాలో బాయిల్డ్​ రైస్​మిల్లుల నుంచి రూ. 13.13 కోట్లు, రా రైస్​ మిల్లుల నుంచి రూ. 26.56 కోట్ల విలువైన ధాన్యం కేటాయించినట్లు రికార్డుల్లో ఉన్నా ఎక్కడా వడ్లు లేవు. బియ్యం కేటాయించడం లేదు. దీంతో ఈ జిల్లాలో 24 రైస్​ మిల్లులపై ఆఫీసర్లు లోతుగా ఎంక్వైరీ చేస్తున్నారు.
    
నిజామాబాద్ జిల్లాలో గత ప్రభుత్వ హయాంలో 51 మంది మిల్లర్లు  పదేండ్లలో రూ.270 కోట్ల విలువైన ధాన్యం కేటాయించుకున్నట్లు రికార్డుల్లో ఉంది. సీఎంఆర్​ఇవ్వకపోవడంతో వారిపై వడ్డీ, పెనాల్టీలు వేయగా, ఆ మొత్తం రూ.372 కోట్లకు చేరింది. ఏ ఒక్క మిల్లులోనూ వడ్లుగానీ బియ్యంగానీ లేవు.

 దీంతో ఇక్కడ కూడా ఫేక్​ట్రక్​షీట్ల దందా జరిగినట్లు అనుమానిస్తున్న అధికారులు లోతుగా ఎంక్వైరీ చేస్తున్నారు. బోధన్​లోని  ఒక మాజీ ప్రజాప్రతినిధి  రూ.160 కోట్లు కాజేసినట్లు అధికారులు గుర్తించారు. గత బీఆర్ఎస్​హయాంలో తన పలుకుబడి ఉపయోగించి 2021-22, 2022-23 సీజన్లలో ఈ దందాకు పాల్పడినట్లు తేల్చారు.