
హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంది. శనివారం, ఆదివారం వరుస సెలవులు రావడం, వివాహ వేడుకల కారణంగా హైవేపై వాహనాల రద్దీ విపరీతంగా పెరిగింది. సర్వీస్ రోడ్డు, ఫ్లైఓవర్ నిర్మాణ పనుల వల్ల చిట్యాల, పెద్దకాపర్తి, పంతంగి టోల్ ప్లాజా, చౌటుప్పల్ దగ్గర వాహనాలు నెమ్మదిగా ముందుకు సాగుతున్నాయి. కిలో మీటర్ల మేర వెహికల్స్ నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
వెహికిల్స్ స్లోగా కదులుతుండటంతో.. ఇంకెప్పుడొస్తుందా హైదరాబాద్ అన్నట్లుగా ప్రయాణికులు ఎదురు చూస్తున్నారు. చౌటుప్పల్ ఏరియాలో వాహనాలు బారులు తీరాయి. పంతంగి టోల్ గేట్ల వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో.. ట్రాఫిక్ పోలీసులు క్లియర్ చేసే పనిలో నిమగ్నమయ్యారు. భారీ సంఖ్యలో వచ్చే వాహనాలను త్వరగా పంపించేందుకు టోల్ ప్లాజా దగ్గర ఎక్కువ గేట్ల నుంచి హైదరాబాద్ వైపు వచ్చే వాహనాలను పంపిస్తున్నారు. ట్రాఫిక్‌లో అంబులెన్స్‌లు సైతం చిక్కుకుపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.