
న్యూఢిల్లీ: కరూర్ జిల్లా తొక్కిసలాట ఘటనపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ అభ్యర్థన మేరకు కరూర్ తొక్కిసలాట ఘటన విచారణను సీబీఐకి బదిలీ చేసింది. సీబీఐ దర్యాప్తును పర్యవేక్షించడానికి సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి అజయ్ రస్తోగి నేతృత్వంలో ముగ్గురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో ఇద్దరూ తమిళనాడు కేడర్‌కు చెందిన ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులు ఉంటారు.
2025, సెప్టెంబర్ 27న కరూర్ జిల్లాలో టీవీకే చీఫ్ విజయ్ నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 41 మంది మరణించగా.. 60 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. అయితే.. తొక్కిసలాట వెనక కుట్ర కోణం ఉందని.. ఈ ఘటనపై సీబీఐ లేదా స్వతంత్ర కమిటీ చేత దర్యాప్తు జరిపించాలని కోరుతూ టీవీకే పార్టీ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. తొక్కిసలాట ఘటనపై సీబీఐ దర్యాప్తు జరిపించాలన్న టీవీకే పార్టీ పిటిషన్‌ను మద్రాస్ హైకోర్టు తిరస్కరించింది.
ఈ ఘటనపై విచారణకు స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీమ్ (సిట్) ఏర్పాటు చేసింది మద్రాస్ హైకోర్టు. దీంతో హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేసింది టీవీకే పార్టీ. తొక్కిసలాట ఘటనపై సీబీఐ చేత విచారణ జరిపించాలని సుప్రీంకోర్టును కోరింది. ఈ పిటిషన్‌పై సోమవారం (అక్టోబర్ 13) జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ ఎన్వీ అంజరియాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారించింది.
టీవీకే పార్టీ అభ్యర్థన మేరకు తొక్కిసలాట ఘటన విచారణను సీబీఐకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అలాగే.. సీబీఐ దర్యాప్తును పర్యవేక్షించడానికి రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి అజయ్ రస్తోగి నేతృత్వంలో ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీ ఏర్పాటు చేసింది. ఈ పిటిషన్ విచారణ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.
కరూర్ తొక్కిసలాట ఘటన దేశ ప్రజల మనస్సాక్షిని కదిలించిందని.. అన్ని పార్టీల ఆందోళనలను తొలగించడానికి ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు అవసరమని ధర్మాసనం పేర్కొంది. అందుకే కేసు విచారణను కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐకి అప్పగిస్తున్నట్లు స్పష్టం చేసింది. కేసు విచారణ నెలవారీ దర్యాప్తు రిపోర్టును సుప్రీంకోర్టుకు సమర్పించాలని సీబీఐని ధర్మాసనం ఆదేశించింది.