
హైదరాబాద్: రాష్ట్రంలోని పలు జిల్లాలో భారీ వర్షం కురిసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడన ప్రభావంతో ఆదివారం (అక్టోబర్ 12) రాత్రి నుంచి ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్లగొండ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో వర్షం దంచికొట్టింది. అకాల వర్షం రైతులకు తీవ్ర నష్టానికి మిగిల్చింది. వర్షానికి పలుచోట్ల ఐకేపీ సెంటర్లలో పోసిన ధాన్యం కొట్టుకుపోయింది. మరికొన్ని చోట్ల ధాన్యం తడిసి ముద్దైంది. చేతికందిన పంట వర్షార్పణం కావడంతో రైతన్నలు దిక్కుతోచని స్థితిలో మిగిలిపోయారు.
యాదాద్రి భువనగిరి జిల్లాలోని వలిగొండ పట్టణంలో సోమవారం (అక్టోబర్ 13) ఉదయం కురిసిన వర్షానికి వర్షం నీరు ఇండ్లలోకి చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మార్కెట్ యార్డులో పోసిన ధాన్యం వర్షానికి కొట్టుకుపోయింది. అలాగే, రామన్నపేట మండలంలో కూడా వర్షం దంచికొట్టింది. వర్షానికి ఐకేపీ కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం తడిసింది. కక్కిఱేని, దుబ్బాక, ఎన్నారం, ఇస్మిల్లా, లక్ష్మపురం గ్రామాలలోని ఒక్కో ఐకేపీ సెంటర్లో 100 లారీలకు పైన ఉన్న ధాన్యం ఉండగా.. వర్షానికి ఐకేపీ కేంద్రాలు జలమయమయ్యాయి.
ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు పత్తి సుమారు 20వేల బస్తాలు మార్కెట్ రాగా.. ఆదివారం రాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి పత్తి బస్తాలు కొంత మేర తడిచాయి. పత్తి తడవడంతో తక్కువ ధర పలుకుతుంది. వాతావరణం సహకరించకపోవడంతో రైతులు వచ్చిన కాడికి అమ్ముకొని వెళ్తున్నారు. ఇప్పటికే వర్షాలకు పొలంలోనే సగం పత్తి పంట నష్టపోయామని.. మిగిలిన పత్తి పంటను మార్కెట్లో అమ్ముకుందామని తీసుకొస్తే ఇక్కడ వర్షం దాపరిచిందని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేశారు.
ALSO READ : వామ్మో చిరుత..సీతాయిపల్లి అటవీప్రాంతంలో చిరుతపులి సంచారం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు సబ్ డివిజన్లో ఆదివారం రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు మణుగూరు జలమయమైంది. మణుగూరు, అశ్వాపురం పరిసర ప్రాంతాలలో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. మణుగూరులోని సుందరయ్య నగర్, బాపంకుంట, పాత మణుగూరు, ఆదర్శనగర్, సురక్షా బస్ స్టాండ్ ప్రాంతాలు రోడ్లు, డ్రైనేజ్‌లు పూర్తిగా జలమయమై ఇండ్లలోకి వరద నీరు పోటెత్తింది. మణుగూరు సురక్ష బస్ స్టాండ్ , RTC కార్గో రూంలో వరద నీరు భారీగా చేరడంతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. మణుగూరు సింగరేణి కాలరీస్‌లో బొగ్గు ఉత్పత్తి, మట్టి వెలికితీత పనులు నిలిచిపోయాయి.
వరంగల్ జిల్లాలోని నర్సంపేటలో కూడా భారీ వర్షం కురిసింది. దీంతో నర్సంపేట వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లో ఆరబోసిన మొక్కజొన్న పంట తడిసి ముద్దైంది. మొక్క జొన్న పంట వర్షానికి కొట్టుకుపోయింది. మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తోంది. కేసముద్రం మండలం ఆర్పణపల్లిలో వాగు ఉధృతంగా ప్రవాహిస్తోంది. దీంతో కేసముద్రం--గూడూరు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. బయ్యారం, మహబూబాబాద్, కొత్తగూడ, గంగారం మండలల్లో వర్షానికి మొక్కజొన్న పంట తడిసింది. ప్రభుత్వమే అదుకోవాలంటూ మొక్కజొన్న రైతులు డిమాండ్ చేస్తున్నారు.