వామ్మో చిరుత..సీతాయిపల్లి అటవీప్రాంతంలో చిరుతపులి సంచారం

వామ్మో చిరుత..సీతాయిపల్లి  అటవీప్రాంతంలో చిరుతపులి సంచారం
  • భయాందోళనకు గురవుతున్న స్థానికులు
  • చిరుతను పట్టుకోవాలని అధికారులకు వేడుకోలు 

లింగంపేట, వెలుగు : లింగంపేట, గాంధారి మండలాల సరిహద్దు గ్రామాలైన కంచ్​మల్ సీతాయిపల్లి  అటవీప్రాంతంలో చిరుతపులి సంచరిస్తుండడంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. రెండు రోజులుగా చిరుత రోడ్డుపై తిరుగుతుండడంతో వాహనదారులు   సెల్​ఫోన్లలో ఫొటోలు తీసి సోషల్​మీడియాలో వైరల్​ చేశారు. మండలంలోని జల్దిపల్లి, భవానీ పేట, రాంపూర్, ముంబాజీపేట, కొండాపూర్, కంచ్​మల్​ గ్రామాలకు చెందిన  ప్రజలు గాంధారి, బాన్సువాడ మండల కేంద్రాలకు బైక్​లపై రాక పోకలు సాగిస్తుంటారు.

 గాంధారి మండలంలోని సీతాయిపల్లి, చెన్నా పూర్  గ్రామస్తులు వివిధ పనుల నిమిత్తం ఎల్లారెడ్డి, లింగంపేట మండల కేంద్రానికి  వెళ్లివస్తుంటారు. ఈ రహదారిపై  నిత్యం వందల సంఖ్యలో  వాహనాలు తిరుగుతుంటాయి. కంచ్​మల్​ శివారులో 3 నెలల కింద చిరుత సంచరించగా మళ్లీ అదే ప్రాంతంలో చిరుత కనిపించడంతో ఆయా గ్రామాల ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. అటవీశాఖ అధికారులు బోను ఏర్పాటు చేసి చిరుతను పట్టుకుని జూపార్కునకు తరలించాలని చుట్టుపక్క గ్రామాల ప్రజలు  కోరుతున్నారు.