డాల్బీ థియేటర్.. ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డులు ప్రదానం చేసే వేదిక. ప్రపంచ సినీ రంగంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డులు ఇచ్చే ఈ డాల్బీ థియేటర్‌ను చెత్త కుప్పగా మార్చారు. తిని పడేసిన పదార్థాలు, తాగేసినా ఖాళీ బాటిల్స్‌తో డాల్బీ థియేటర్ చెత్త కుప్పను తలపించింది. ఈ పని చేసింది సరైన జ్ఞానం లేని చిన్న పిల్లలు కాదు. నిత్యం పర్యావరణం, పరిశుభ్రత గురించి లెక్చర్లు ఇచ్చే సినీ సెలబెట్రీలు. 2026 ఆస్కార్ అవార్డుల ప్రధానోత్స వేడుక మార్చి 15న లాస్ ఏంజెల్స్‌లోని డాల్బీ థియేటర్లో అత్యంత వైభవంగా జరిగింది.
ఈ వేడుకకు సినీ సెలబ్రెటీలు పెద్ద ఎత్తున హాజరై అవార్డులు అందుకుని సందడి చేశారు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. కానీ ఈ అవార్డుల ప్రదానోత్సవ వేడుక తర్వాత డాల్బీ థియేటర్‌కు సంబంధించిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెక్స్ట్ బెస్ట్ పిక్చర్ వ్యవస్థాపకుడైన సినీ విమర్శకుడు మాట్ నెగ్లియా ఈ ఫొటోను ఎక్స్ (ట్విట్టర్)లో షేర్ చేశాడు. ఈ చిత్రంలో డాల్బీ థియేటర్ దుస్థితి ఘోరంగా ఉంది.
►ALSO READ | Viral Video : పాకిస్థాన్ గల్లీల్లో దద్దరిల్లుతున్న 'ధురంధర్ 2' క్రేజ్.. రణవీర్ సింగ్‌పై కుర్రాళ్ల ప్రశంసలు!
థియేటర్ అంతటా ఖాళీ సీసాలు, తిని పడేసిన ఆహార ప్యాకెట్లు, స్నాక్ ప్యాకెట్లు, ఇతర చెత్తతో అపరిశుభ్రంగా ఉంది. ఈ ఫొటోను చూసిన నెటిజన్లు సెలబ్రెటీల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సెలబ్రెటీల తీరు కేవలం మాటలకే పరిమితమని.. నిజ జీవితంలో వాళ్లు చెప్పేది వాళ్లే ఫాలో అవ్వరని విమర్శిస్తున్నారు.
తెల్లారి లేస్తే పర్యావరణం, పరిశుభ్రత గురించి నీతులు వల్లించే సెలబ్రెటీలను ఇదేంటని ప్రశ్నిస్తున్నారు. హోదాతో సంబంధం లేకుండా ఎవరి చెత్తను వారే తీసుకువెళ్లడం బేసిక్ సెన్స్ అని.. డబ్బుతో సరైన ప్రవర్తనను కొనలేమని చురకలంటిస్తున్నారు. మరికొందరు సెలబ్రెటీలకు మద్దతుగా మాట్లాడుతున్నారు. ఇందులో వారి తప్పేమి లేదని.. ఈవెంట్ మేనేజ్మెంట్ నిర్వహణ లోపం వల్లే ఇలా జరిగిందని కామెంట్స్ చేస్తున్నారు.
