IND vs WI 2nd Test: జైశ్వాల్‌కు కాలికి బంతి విసిరిన విండీస్ పేసర్.. జేడెన్ సీల్స్‌కు ఐసీసీ జరిమానా

IND vs WI 2nd Test: జైశ్వాల్‌కు కాలికి బంతి విసిరిన విండీస్ పేసర్.. జేడెన్ సీల్స్‌కు ఐసీసీ జరిమానా

ఢిల్లీ వేదికగా ఇండియాతో జరుగుతున్న రెండో టెస్టులో వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్ జేడెన్ సీల్స్ హద్దుమీరి ప్రవర్తించాడు. తొలి రోజు ఆటలో భాగంగా టీమిండియా ఓపెనర్ యశస్వి జైశ్వాల్ పై ఉద్దేశ్యపూర్వకంగానే బంతి విసిరినందుకు విండీస్ పేసర్ కు ఐసీసీ జరిమానా విధించింది. ఇండియా టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఇన్నింగ్స్ 29 ఓవర్లో ఈ సంఘటన చోటు చేసుకుంది. తొలి రోజు ఆట ముగిసిన తర్వాత సీల్స్ పై విచారణ జరిగింది. ఈ విండీస్ పేసర్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు దోషిగా తేలినట్టు   అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) మందలించింది. సీల్స్ మ్యాచ్ ఫీజులో 25 శాతం జరిమానా విధించింది. 

అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో  ఐసీసీ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.9ని సీల్స్ ఉల్లంఘించినట్టు తేలింది. ఈ ఆర్టికల్ ప్రకారం "అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతున్న సమయంలో ఒక ఆటగాడిపై అనుచితంగా క్రికెట్ పరికరాలు లేదా ఏదైనా ఇతర వస్తువులు విసరడానికి వీలు లేదు". ఈ విండీస్ పేసర్ కు కేవలం మ్యాచ్ ఫీజ్ జరిమానాతోనే సరిపెట్టకుండా అతను క్రమశిక్షణ తప్పనందుకు ఒక డీమెరిట్ పాయింట్ ను కూడా ఇచ్చారు. సీల్స్ కు ఇది రెండో డీ మెరిట్ పాయింట్ కావడం గమనార్హం. అంతక ముందు తొలిసారి 2024 డిసెంబర్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో సీల్స్‌కు ఒక డీమెరిట్ పాయింట్ ఇవ్వబడింది.

అసలేం జరిగిందంటే:

ఇండియా, వెస్టిండీస్ జట్ల మధ్య శుక్రవారం (అక్టోబర్ 10) ఢిల్లీ వేదికగా అరుణ్ జైట్లీ స్టేడియంలో రెండో టెస్ట్ ప్రారంభమైంది. టాస్ గెలిచి  మొదట బ్యాటింగ్ చేస్తున్న ఇండియాకు ఓపెనర్లు కేఎల్ రాహుల్, యశస్వి జైశ్వాల్ మంచి ఆరంభాన్ని ఇచ్చారు. రాహుల్ ఔటైన తర్వాత విండీస్ సాయి సుదర్శన్, జైశ్వాల్ ను జోడీని విడగొట్టడానికి కష్టపడింది. ముఖ్యంగా జైశ్వాల్ విండీస్ బౌలర్లను అలవోకగా ఆడేయడంతో ఫాస్ట్ బౌలర్ సీల్స్ అసహనానికి గురయ్యాడు. ఫాల్ త్రో లో అవసరం లేని రనౌట్ కోసం ప్రయత్నించాడు. అయితే సీల్స్ విసిరిన బంతి వికెట్లను కాకుండా జైశ్వాల్ ప్యాడ్లకు తగిలింది. దీంతో ఐసీసీ ఈ ఫాస్ట్ బౌలర్ పై చర్యలు తీసుకుంది.