- ఆరోగ్య శిబిరాలను సందర్శించిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యేలు
- కలెక్టర్ల ముమ్మర తనిఖీలు, అవగాహన కార్యక్రమాలు
మహబూబాబాద్/ మరిపెడ/ దమ్మపేట/ చండ్రుగొండ, వెలుగు : ప్రజారోగ్యంపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెడుతోంది. ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రజాపాలన– ప్రగతి ప్రణాళికలో భాగంగా ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల్లోని ఆయా ప్రాంతాల్లో బుధవారం ప్రత్యేక వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి, ప్రజలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు.
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపాలిటీలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే జాటోతు రామచంద్రునాయక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన డీఎంహెచ్‌వో రవిరాథోడ్తో కలిసి అక్కడకు వచ్చిన పేషెంట్లను స్వయంగా చెక్ చేశారు. హెల్త్ క్యాంపులను ఉపయోగించుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
అనంతరం స్థానిక జామ మసీదులో ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఆయన పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన హెల్త్ క్యాంప్‌ను ఎమ్మెల్యే జారే ఆదినారాయణ సందర్శించారు. ఈ క్యాంప్‌కి డాక్టర్లు గైర్హాజరు కావడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించారు. చండ్రుగొండ మండలం బెండాలపాడు గ్రామంలో కలెక్టర్ అంకిత్ సమక్షంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తాగునీటి స్వచ్ఛత పరీక్షలపై ప్రజలకు అవగాహన కల్పించారు. స్వచ్ఛమైన నీటిని తాగితేనే ఆరోగ్యమని కలెక్టర్ అన్నారు. అనంతరం యూపీఎస్ స్కూల్‌ను ఆకస్మిక తనిఖీ చేసి క్లాస్‌రూమ్‌లు, స్టూడెంట్ల ప్రతిభ, టీచర్ల విద్యాబోధనను పరిశీలించి, పలు సూచనలు చేశారు.
గ్రామంలో నిర్మాణంలో ఉన్న సీసీ రోడ్లు, ఇందిరమ్మ ఇండ్లు, చండ్రుగొండలో అంగన్వాడీ భవనం, బస్టాండ్ ప్రాంగణం, గిరిజ బాలికల ఆశ్రమ స్కూల్‌ను పరిశీలించారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని మున్సిపల్ ఆఫీస్‌ను కలెక్టర్ స్నేహ శబరీశ్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఫైళ్ల క్లియరెన్స్, శానిటేషన్‌పై ఆరా తీశారు. పట్టణ పరిధిలోని ఆయా కాలనీల్లో విద్యుత్, తాగునీటి సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని ఆఫీసర్లను ఆదేశించారు.
