- అర్ధరాత్రిపూట బుల్డోజర్లతో పేదల ఇండ్లపై పడతరా?: కవిత
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా అనేలా అర్ధరాత్రిపూట బుల్డోజర్లతో కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ఇండ్లు కూల్చేసిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఫైర్ అయ్యారు. అది చాలదన్నట్టు ఆ భూమి మీద హక్కులే లేవంటూ బాధితులను అవమానిస్తూ మాట్లాడారని మండిపడ్డారు. ప్రైవేట్ప్రాపర్టీలోకి వచ్చి పేదల ఇండ్లను కూల్చేందుకు ప్రభుత్వానికి ఎంత ధైర్యమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెలుగుమట్ల బాధితులకు మద్దతుగా కవిత, విశారదన్ మహారాజ్ ప్రారంభించిన నిరాహారదీక్షను బుధవారం ప్రెస్‌క్లబ్‌లో జస్టిస్ ఈశ్వరయ్య నిమ్మరసం ఇచ్చి విరమింపజేశారు. ఈ సందర్భంగా కవిత మీడియాతో మాట్లాడారు.
మీడియా, అధికారులు తమ పక్షానే ఉన్నారన్న ధీమాతో ప్రభుత్వం పేదల ఇండ్లను కూల్చేసిందని, అందుకే తాము దీక్ష చేయాల్సి వచ్చిందని పేర్కొన్నారు. వెలుగుమట్ల ఘటనకు రాహుల్ గాంధీ బాధ్యత వహించాలని, కాంగ్రెస్ ప్రభుత్వంపై చర్యలు తీసుకుని ప్రజలను క్షమాపణ అడగాలని డిమాండ్ ఆమె చేశారు. ప్రభుత్వంపై చర్యలు తీసుకోకపోతే రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని పట్టుకోవటం వృథా అన్నారు. వెలుగుమట్ల ఆడబిడ్డల చైతన్యం వల్లే తక్షణ న్యాయం జరిగిందని, ఎస్సీ, ఎస్టీ, బీసీ జేఏసీ, ధర్మసమాజ్ పార్టీలు అసామాన్య పోరాటం చేశాయని, వాళ్లందరి పోరాటం వల్లే ఘటనపై రెవల్యూషన్ వచ్చిందని కవిత చెప్పారు.
ప్రభుత్వం ఇచ్చిన టోకెన్లపై తమకు ఇంకా అనుమానాలున్నాయని పేర్కొన్నారు. లే అవుట్ చేసి ఫిజికల్ ప్రాపర్టీని ప్రతి కుటుంబానికి చూపించి ఇల్లు ఇచ్చేంత వరకు పోరాటం చేస్తామన్నారు. బాధితులకు సంపూర్ణ న్యాయం జరిగిందా లేదా అన్నది తేల్చేందుకు తాము ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ వేసుకుంటామని, జస్టిస్ ఈశ్వరయ్య సమక్షంలో మళ్లీ బాధితులతో మాట్లాడి ప్రగతిశీల శక్తులతో కలిసి సమస్య పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తామన్నారు.
