మునగాల, వెలుగు : డిజిటల్ కరెన్సీ మార్పిడి పేరుతో అధిక డబ్బు సంపాదించాలనే అత్యాశకు పోయి సైబర్ మోసగాళ్ల బారిన పడవద్దని సూర్యాపేట ఎస్పీ కె. నరసింహ ప్రజలను హెచ్చరించారు. బుధవారం మునగాల మండలం ఆకుపాములలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు.
బినాన్స్, క్రిప్టో కరెన్సీ లాంటి డిజిటల్ మనీ వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలని, యువత తెలియక సైబర్ నేరాల్లో చిక్కుకొని జీవితాలను పాడుచేసుకోవద్దని సూచించారు. డ్రగ్స్, గంజాయి మహమ్మారిని తరిమికొట్టేందుకు పోలీసులకు సమాచారం అందిస్తూ భాగస్వాములు కావాలని కోరారు. ప్రతి ఒక్కరూ హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించాలని, ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమం ద్వారా ప్రమాదాల నివారణకు కృషి చేస్తున్నామని తెలిపారు.
