
ఈ దీపావళి పండుగ సందర్భంగా సినీ ప్రేక్షకులకు వినోదం పంచడానికి బాక్సాఫీస్ వద్ద సందడి మొదలైంది. థియేటర్లలో నవ్వులు, రొమాన్స్, ముక్కోణపు ప్రేమకథలతో కూడిన చిత్రాలు ఈ వారం క్యూ కట్టాయి. ఈ సారి థియేటర్లలో భారీ బడ్జెట్ సినిమాలు కాకుండా.. వైవిధ్యమైన కథాంశాలతో కూడిన చిన్న చిత్రాలు సందడి చేస్తున్నారు. అక్టోబర్ 16 నుంచి వరుసగా విడుదల కానున్న నాలుగు వైవిధ్యభరిత చిత్రాలు అభిమానులను అలరించేందుకు సిద్ధంగా ఉన్నాయి. దీపావళి ధమాకా అంటూ ప్రేక్షకులకు వినోదాల విందును పంచడానికి రెడీ గా ఉన్నాయి.
నవ్వుల ‘మిత్రమండలి’
హాస్యనటుడిగా, హీరోగా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ప్రియదర్శి పులికొండ ప్రధాన పాత్రలో నటించిన పక్కా కామెడీ ఎంటర్‌టైనర్ ‘మిత్రమండలి’ (Mithra Mandali). విజయేందర్ ఎస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రియదర్శితో పాటు విష్ణు ఓఐ, రాగ్ మయూర్, నిహారిక ఎన్.ఎం. ముఖ్య పాత్రలు పోషించారు. సినిమా పేరుకు తగ్గట్టే, నలుగురు ప్రాణ స్నేహితుల మధ్య ఉండే సరదా సంభాషణలు, అల్లరి, మరియు అనుబంధాల చుట్టూ కథ అల్లుకుంది. ఈ సినిమా గురించి ప్రియదర్శి మాట్లాడుతూ.. ప్రాణ మిత్రులు కలిసి కూర్చుని సరదాగా మాట్లాడుకుంటే ఎలాంటి స్వచ్ఛమైన అనుభూతి కలుగుతుందో, అంతకు మించిన ఆనందాన్ని ఈ సినిమా ప్రేక్షకులకు పంచుతుంది. ఇది కేవలం కామెడీ కాదు, స్నేహబంధంలో ఉండే మధురానుభూతి అని పేర్కొన్నారు. అక్టోబర్ 16న విడుదల కానుంది. దీపావళి హడావిడిని ముందుగానే ఈ చిత్రం నవ్వుల రూపంలో ప్రేక్షకులకు అందించనుంది.
సిద్ధు ముక్కోణపు ప్రేమ: ‘తెలుసు కదా’
‘డీజే టిల్లు’తో యువతలో క్రేజ్ సంపాదించుకున్న సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న రొమాంటిక్ డ్రామా ‘తెలుసు కదా’ (Telusu Kada). ఈ సినిమాకు ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ నీరజ కోన దర్శకురాలిగా పరిచయం అయింది. సిద్ధు సరసన స్టార్ హీరోయిన్లు రాశీఖన్నా, శ్రీనిధి శెట్టి కథానాయికలుగా నటించారు. అక్టోబర్ 17న థియేటర్లలో సందడి చేయనుంది. ఇది ఒక క్లాసిక్ ముక్కోణపు ప్రేమకథగా రూపొందింది. దర్శకురాలు నీరజ కోన మాట్లాడుతూ.. ఇదొక ట్రైయాంగిల్ లవ్ స్టోరీ అయినప్పటికీ, ఇందులో పాత్రల మధ్య భావోద్వేగాలు చాలా లోతుగా ఉంటాయి. ప్రేమ, త్యాగం, బాధ వంటి అంశాలు యువ ప్రేక్షకుల హృదయాలను కచ్చితంగా తాకుతాయని విశ్వాసం వ్యక్తం చేశారు. ఫ్యాషన్ డిజైనర్‌గా ఎంతో అనుభవం ఉన్న నీరజ, ఈ సినిమాను తెరకెక్కించిన విధానంపై సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
తమిళ క్రేజ్ తెలుగులో: ‘డ్యూడ్’
‘లవ్ టుడే’ , ‘రిటర్న్ ఆఫ్ డ్రాగన్’ వంటి చిత్రాలతో తెలుగులోనూ బలమైన అభిమానులను సంపాదించుకున్న కోలీవుడ్ యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్ నటించిన కొత్త చిత్రం ‘డ్యూడ్’ (Dude). ఈ చిత్రంలో ప్రదీప్‌కు జోడీగా మమితా బైజు నటించగా, సీనియర్ నటుడు శరత్‌కుమార్, నేహాశెట్టి కీలక పాత్రలు పోషించారు. కీర్తీశ్వరన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రధానంగా కామెడీ మరియు బలమైన ఎమోషన్స్ చుట్టూ తిరుగుతుంది. ఈ మూవీ అక్టోబర్ 17 విడుదల కానుంది. యూత్‌ను ఆకట్టుకునే అంశాలతో పాటు, ఫ్యామిలీ ఆడియెన్స్‌ను మెప్పించే భావోద్వేగాలు ఈ సినిమాలో పుష్కలంగా ఉన్నాయని తెలుస్తోంది. తెలుగులోనూ ఒకే రోజు విడుదలవుతున్న ఈ డబ్బింగ్ చిత్రం, దీపావళికి తమ క్రేజ్‌ను నిలబెట్టుకోవాలని చూస్తోంది.
కిరణ్ అబ్బవరం రొమాన్స్: ‘కె- ర్యాంప్’
రొమాంటిక్ కామెడీ సినిమాలతో ప్రేక్షకులకు దగ్గరైన యువ హీరో కిరణ్ అబ్బవరం తాజా చిత్రం ‘కె- ర్యాంప్’ (K-Ramp). యుక్తీ తరేజా కథానాయికగా నటించింది. ఈ చిత్రంలో సీనియర్ నటులు నరేశ్, సాయికుమార్ ముఖ్య పాత్రలు పోషించారు. జైన్స్ నాని దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా, కిరణ్ అబ్బవరం మార్కు రొమాంటిక్ కామెడీతో దీపావళి వారాంతాన్ని మరింత రంగులమయం చేయనుందని మూవీ మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ మూవీ అక్టోబర్ 18 ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రేమ, నవ్వులు, కుటుంబ బంధాల మేళవింపుగా ఈ చిత్రం ఉండబోతుందని చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ వరుస విడుదలల్లో ఏ సినిమా ప్రేక్షకులను మెప్పిస్తుందో.. బాక్సాఫీస్ వద్ద విజయాన్ని సాధిస్తుందో చూడాలి.