
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 రియాల్టీ షో ఎంటర్‌టైన్‌మెంట్‌ను మరో స్థాయికి తీసుకెళ్తూ, ఊహించని మలుపులతో ఆరో వారం మొదలైంది. ఐదో వారం డబుల్ ఎలిమినేషన్ కారణంగా ఫ్లోరా సైని, దమ్ము శ్రీజ ఎలిమినేట్ అయ్యారు. అటు ఏకంగా ఆరుగురు కొత్త సభ్యులు వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్‌గా హౌస్‌లోకి అడుగుపెట్టారు. వీళ్ల రాక పాత కంటెస్టెంట్స్‌లో కలవరం సృష్టించింది. ఈ కొత్త వైల్డ్ కార్డ్ టీమ్‌లో మాధురి, రమ్య మోక్ష (పికెల్స్ పాప), ఆయేషా, నిఖిల్ నాయర్, గౌరవ్ గుప్తా, , శ్రీనివాస సాయి ఉన్నారు. వస్తూ వస్తూనే, ఈ ఆరుగురు కొత్తవారికి బిగ్‌బాస్ ఇచ్చిన పవర్‌తో హౌస్‌లో గేమ్ ఒక్కసారిగా మారిపోయింది. ఈ వారం నామినేషన్ ప్రక్రియలో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్‌కు మినహాయింపు ఇచ్చి, వారికి పాత సభ్యులను నామినేట్ చేసే అద్భుతమైన అవకాశాన్ని కల్పించడం సంచలనంగా మారింది.
'ఫైర్ బాల్' టాస్క్.. వాదోపవాదాలతో రచ్చ!
కొత్తగా ఆరుగురు వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్‌అడుగుపెట్టడంతో హౌస్ లో సంఖ్య 16కి చేరింది. ఈ వారం ఉత్కంఠను రేపుతూ.. నామినేషన్ ప్రక్రియ కోసం బిగ్‌బాస్ 'ఫైర్ బాల్' అనే ఒక ప్రత్యేక టాస్క్‌ను ప్రవేశపెట్టాడు. హౌస్‌లో ఏర్పాటు చేసిన ఒక పైపు నుంచి 'ఫైర్ బాల్' పడుతుంది. బజర్ మోగే సమయానికి ఆ బాల్ ఎవరి చేతిలో ఉంటే, వారు ఇప్పటికే హౌస్‌లో ఉన్న పాత కంటెస్టెంట్స్‌లో ఒకరికి ఆ బాల్‌ను ఇవ్వాలి. బాల్ అందుకున్న కంటెస్టెంట్, ఆ తర్వాత పాత సభ్యుల్లో మరొకరిని నామినేట్ చేయాల్సి ఉంటుంది. ఈ పవర్ కోసం వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ మధ్య గట్టి పోటీ నెలకొంది. ప్రత్యేకించి 'పికెల్స్ పాప' రమ్య మోక్ష చాలా దూకుడుగా పోరాడటం ప్రోమోలో హైలైట్ అయింది. అలానే నిఖిల్ నాయర్ కూడా బాల్ అందుకోవడంలో విజయం సాధించాడు.
నామినేషన్స్ హీట్..
వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ తమ పవర్‌ను ఉపయోగించి పాత సభ్యులను టార్గెట్ చేయడం కనిపించింది. కంటెస్టెంట్ తనూజ.. సుమన్ శెట్టిని నామినేట్ చేయగా, రాము వైల్డ్ కార్డ్ ఎంట్రీ పవన్‌ను నామినేట్ చేశాడు. ఈ ప్రక్రియలో భయంకరమైన వాదోపవాదాలు జరగడంతో, హౌస్‌లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
ఈ వారం డేంజర్ జోన్‌లో ఎవరు?
వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ ఇచ్చిన పవర్ పంచ్‌లతో, ఈ ఆరో వారం నామినేషన్లలో పాత సభ్యులు నిలిచారు. వారిలో భరణి, పవన్, దివ్య, రాము, సుమన్ శెట్టి, తనూజ ఉన్నారు. గత వారం సుమన్ శెట్టి దాదాపుగా ఎలిమినేషన్ అంచు వరకు వచ్చి, చివరి నిమిషంలో సేవ్ అయ్యాడు. ఈసారి కూడా సుమన్ మళ్లీ డేంజర్ జోన్‌లో ఉన్నాడు. ఈ నామినేషన్ల తర్వాతనైనా అతను తన గేమ్‌ను మార్చుకుని, ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఆడతాడా? లేదా ఎలిమినేట్ అవుతాడా అనేది ఉత్కంఠగా మారింది. మరోవైపు, హౌస్‌లో నిశ్శబ్దంగా తన పని తాను చేసుకుంటూ పోతున్న దివ్యపై ఈసారి ఊహించని విధంగా వేటు పడినా ఆశ్చర్యపోనవసరం లేదనే చర్చ నడుస్తోంది. ఏది ఏమైనా, వైల్డ్ కార్డ్ ఎంట్రీలతో కొత్త ఉత్సాహం వచ్చిన హౌస్‌లో, ఈ వారం ఎవరు ఇంటికి పయనమవుతారో చూడాలి.