Siddhu Jonnalagadda: 'తెలుసు కదా' ట్రైలర్ రిలీజ్: ఆసక్తి రేకెత్తిస్తున్న ఇద్దరమ్మాయిలతో ప్రేమాయణం!

Siddhu Jonnalagadda: 'తెలుసు కదా' ట్రైలర్ రిలీజ్:  ఆసక్తి రేకెత్తిస్తున్న ఇద్దరమ్మాయిలతో ప్రేమాయణం!

'డీజే టిల్లు' మూవీతో యూత్ లో విపరీతమైన క్రేజ్ ను సొంతం చేసుకున్న టాలీవుడ్ నటుడు సిద్ధు జొన్నలగడ్డ.  ఇప్పుడు ఈ యంగ్ హీరో 'తెలుసు కదా' అనే సరికొత్త ప్రేమకథా చిత్రంతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యారు.  సిద్ధు సరసన రాశీ ఖన్నా , శ్రీనిధి శెట్టి హీరోయిన్లుగా నటించారు. లేటెస్ట్ గా ఈ సినిమా ట్రైలర్ ను మూవీ టీం రిలీజ్ చేసింది.  యూత్ ను ఆకట్టుకున్న ఈ ట్రైలర్ ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో దూసుకెళ్తోంది. 

ఇద్దరు అమ్మాయిలతో రిలేషన్.. 

ట్రైలర్ చూస్తే, ఇదొక సాధారణ లవ్ స్టోరీలా కనిపించడం లేదు. ఎమోషన్స్ ఎప్పుడూ మన కంట్రోల్‌లోనే ఉండాలి. ప్రేమించిన వాళ్లకు అస్సలు ఇవ్వకూడదు అనే సిద్ధాంతాన్ని నమ్మే సిద్ధు పాత్ర..  ఇద్దరు అమ్మాయిలతో రిలేషన్‌షిప్‌లోకి వెళ్లడం ఆసక్తి కలిగిస్తోంది. ఈ ముగ్గురి మధ్య సాగే పయనం, వారి భావోద్వేగాల సంఘర్షణే సినిమా కథాంశంగా తెలుస్తోంది. కథా సారాంశాన్ని రివీల్ చేయకుండా, కేవలం ఉత్కంఠను పెంచేలా కట్ చేసిన ట్రైలర్ ప్రేక్షకులలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. మరి 'డీజే టిల్లు' లాంటి ఎంటర్‌టైనర్ తర్వాత సిద్ధు ఈసారి ఎలాంటి వైవిధ్యమైన ప్రేమకథతో అలరించనున్నాడో ఆసక్తి నెలకొంది.

 మూడు సినిమాలతో పోటీ..

ఈ చిత్రానికి ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ కోన నీరజ దర్శకురాలిగా వ్యవహరించారు . పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ సినిమా ఈ శుక్రవారం అక్టోబరు 17న థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలోనే సోమవారం చిత్రబృందం ట్రైలర్‌ను విడుదల చేసింది. 'తెలుసు కదా' తో పాటు, ఇదే వారం మరో మూడు చిన్న సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. అవే 'మిత్రమండలి', 'డ్యూడ్',  'కె ర్యాంప్'. ఈ చిత్రాల ట్రైలర్స్ కూడా ఇప్పటికే విడుదలై ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి. గత నెల టాలీవుడ్‌కు బాగా కలిసి రాగా, ఈ నాలుగు సినిమాలలో ఏది ప్రేక్షకుల మనసు గెలుచుకుని .. బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి మరి.