
EPFO ఖాతాదారులకు శుభవార్త. ఇకపై మీ పీఎఫ్ అకౌంట్ నుంచి నూటికి నూరు శాతం.. అంటే పీఎఫ్ ఖాతాలో ఉన్న నగదు మొత్తాన్ని విత్ డ్రా చేసుకునే వెసులుబాటును కల్పించాలని ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సోమవారం జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. అంటే.. ఎంప్లాయ్, ఎంప్లాయర్ షేర్ మొత్తాన్ని 100 శాతం విత్ డ్రా చేసుకోవచ్చు. న్యూఢిల్లీలో CBT 238వ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పూర్తిగా జాబ్ మానేసినప్పుడు, పదవీ విరమణ సందర్భంలో మాత్రమే పీఎఫ్ డబ్బులు పూర్తిగా తీసుకునేందుకు గతంలో వీలుండేది.
ఒక పీఎఫ్ ఖాతాదారుడు ఉద్యోగం మానేసిన నెల తర్వాత PF బ్యాలెన్స్‌లో 75 శాతం, 2 నెలల తర్వాత మిగిలిన 25 శాతం పీఎఫ్ డబ్బు విత్ డ్రా చేసుకునేందుకు అనుమతి ఉండేది. పదవీ విరమణ తర్వాత మాత్రం పూర్తి బ్యాలెన్స్‌ను ఎలాంటి ఆంక్షలు లేకుండా విత్ డ్రా చేసుకునే అవకాశం ఉండేది. తాజాగా.. CBT 238వ సమావేశంలో తీసుకున్న నిర్ణయంతో ఉద్యోగి జాబ్లో కొనసాగుతున్న సందర్భంలోనే 100 శాతం పీఎఫ్ డబ్బును విత్ డ్రా చేసుకునే వెసులుబాటు కల్పించడంపై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ నిర్ణయంతో ఏడు కోట్ల మందికి పైగా పీఎఫ్ ఖాతాదారులకు మేలు జరగనుంది.
పీఎఫ్ డబ్బును పాక్షికంగా విత్ డ్రా చేసుకోవాలని ఖాతాదారుడు భావిస్తే 90 శాతం వరకూ విత్ డ్రా చేసుకునే వెసులుబాటును కల్పిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. కొందరికి భూమి కొనుగోలు సమయంలో, ఈఎంఐ పేమెంట్లు చెల్లించే సమయంలో, కొత్త ఇంటిని కట్టుకునే సందర్భంలో పెద్ద మొత్తంలో డబ్బు అవసరం పడొచ్చు. ఈ కారణాలతో పీఎఫ్ సొమ్మును పాక్షికంగా విత్ డ్రా చేసుకోవాలనుకునే వారికి గరిష్టంగా 90 శాతం పీఎఫ్ డబ్బును పొందే విధంగా పీఎఫ్ రూల్స్ లో కేంద్ర ప్రభుత్వం మార్పులు చేసింది.
* పిల్లల చదువుల కోసం విత్ డ్రా చేసేవారికి 10 సార్లు విత్ డ్రా చేసుకునే వెసులుబాటును కేంద్రం తీసుకొచ్చింది.
* వివాహ సంబంధిత శుభకార్యాల నిమిత్తం 5 సార్లు విత్ డ్రా చేసుకోవచ్చు.
ప్రస్తుతం ఈ రెండు సందర్భాల్లో కేవలం పీఎఫ్ డబ్బును 3 సార్లు పాక్షికంగా విత్ డ్రా చేసుకునే అవకాశం మాత్రమే ఉండగా ఈ లిమిట్ను పెంచి ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం ఊరటనిచ్చింది.