లిక్కర్ షాపుల లక్కు పరీక్షించుకోండి

లిక్కర్ షాపుల లక్కు పరీక్షించుకోండి
  • రండి బాబూ.. రండి లిక్కర్​ షాపులు పెట్టండి
  • అమ్ముకున్నోళ్లకు అమ్ముకున్నంత
  • వైన్స్​ దక్కించుకోండి.. మస్తు లాభాలు పొందండి
  • సోషల్​ మీడియాలో ఆబ్కారోళ్ల ప్రచారం
  • నడిపిస్తున్నోళ్లకు, గతంలో అప్లై చేసినోళ్లకు ఫోన్లు, మెసేజ్​లు
  • అప్లికేషన్​ ఫీజులతోనే 1,200 కోట్ల దాకా రాబట్టే ప్లాన్ 

నల్గొండ, వెలుగు: ‘రండి బాబూ రండి. ఆలసించిన ఆశాభంగం. కొత్త లిక్కర్​ పాలసీతో లాభాలే లాభాలు. గతంలో డిపాజిట్​పై 7 రెట్ల స్టాక్ వరకే 20 శాతం మార్జిన్​ ఉంటే ఇప్పుడు 10 రెట్లకు పెంచినం. బ్యాంకు గ్యారెంటీని 50 శాతం నుంచి 25 శాతానికి తగ్గించినం. రూ. 2 లక్షలతో అప్లై చేసుకొని ఈ నెల 18న నిర్వహించే వేలం పాటల్లో పాల్గొనండి. లక్కు మీదైతే లిక్కర్​ షాపు మీకే. ఆ తర్వాత ఇగ లాభాలే లాభాలు’.. రెండు, మూడు రోజులుగా ఆబ్కారీ శాఖ ఇట్ల ప్రచారం చేస్తోంది. వాణిజ్య ప్రకటనలను తలదన్నేలా సోషల్​మీడియాలో హోరెత్తిస్తోంది. అప్లికేషన్​ ఫీజుల రూపంలో రూ. 1,200 కోట్లు రాబట్టేందుకు చేయాల్సిందల్లా చేస్తోంది.

కొత్త పాలసీ లాభాలు చెప్తూ..

రాష్ట్రంలో 2,620 షాపులకు ఈ నెల 9న ఎక్సైజ్ శాఖ నోటిఫికేషన్​ ఇచ్చింది. ఈ నెల 18 వరకు అప్లికేషన్లు తీసుకొని 20న డ్రా తీయనున్నారు. ఒక్కో అప్లికేషన్​కు రూ.2 లక్షల ఫీజు నిర్ణయించారు. ఇది నాన్ ​రిఫండబుల్ ​కావడంతో అప్లికేషన్ల రూపంలోనే రూ.1,200 కోట్లు రాబట్టాలని ఆఫీసర్లు రంగంలోకి దిగారు. రెండేళ్ల కింద అప్లికేషన్లతోనే వరంగల్‌‌ జిల్లాలో రూ.157 కోట్లు, ఖమ్మంలో రూ.145 కోట్లు, నల్గొండ జిల్లాలో రూ. 141 కోట్ల ఇన్​కం వచ్చింది. దీంతో ఈసారి అన్ని జిల్లాల్లో భారీగా అప్లికేషన్లు రాబట్టేందుకు ప్లాన్​చేస్తున్నారు. కొత్త లిక్కర్​ పాలసీ వల్ల ఎలాంటి లాభాలున్నాయో చెబుతూ పబ్లిసిటీ చేస్తున్నారు. సోషల్​ మీడియాలో సర్క్యులేట్​ చేస్తున్నారు. ‘రండి బాబూ రండి’ రీతిలో మెసేజ్​ను వాట్సాప్ గ్రూపుల్లో జోరుగా తిప్పుతున్నా రు. 

అప్లికేషన్​ ఒక్క పేజీనే

కొత్త పాలసీతో ఎంతో లాభముందని.. ఈసారి ఎన్నో రకాల రాయితీలు, ఆఫర్లు ఇస్తున్నామని వాట్సప్​మెసేజ్​ల ద్వారా ఎక్సైజ్​శాఖ ప్రచారం చేస్తోంది. ‘ఒక్కసారి డ్రాలో గెలిస్తే రెండేండ్లు షాపు మీ సొంతం అవుతుంది. లిక్కర్‌తోపాటు ఇతర యాక్సెసిరీస్ అమ్ముకునే వెసులుబాటు కల్పిస్తున్నాం. అప్లై చేయడం ఈజీ చేశాం. ఒక్క పేజీతో సరిపెట్టాం. మీకు పాలసీ గురించి అర్థం కాకున్నా, ఆప్లికేషన్ నింపడం రాకున్నా  మేమే పూర్తి చేస్తాం’ అంటున్నారు. ఇందుకోసం అన్ని ఎక్సైజ్​స్టేషన్ల వద్ద  హెల్ప్  డెస్క్​లు ఏర్పాటు చేశారు. వైన్స్‌‌ నిర్వహిస్తున్న యజమానులకు అధికారులు, స్టాఫ్‌‌ ఫోన్లు నేరుగా చేసి మాట్లాడుతున్నారు. ఈసారి సర్కారు ఎన్ని అప్లికేషన్లనైనా వేసే వెసులుబాట్లు కల్పించిందని, ఎక్కువ అప్లికేషన్లు వేసి సద్వినియోగం చేసుకోవాలని చెబుతున్నారు. పోయినసారి వేసిన 45 వేల అప్లికేషన్లలోని ఫోన్‌‌ నంబర్లకు బల్క్‌‌ మెసేజ్‌‌లు చేస్తున్నారు.

బ్యాంకు గ్యారెంటీ ఒకటే

గతంలో ఏడాదికి 4 వాయిదాలు, 2 బ్యాంకు గ్యారెంటీలతో లైసెన్స్‌‌ ఫీజు చెల్లించాల్సి వచ్చేది. ఇప్పుడు దాన్ని 6 వాయిదాలకు పెంచుతూ ఒక బ్యాంక్‌‌ గ్యారంటీకి పరిమితం చేశారు. ఆ ఒక్క గ్యారెంటీని కూడా తగ్గించారు. గతంలో లైసెన్స్​ ఫీజుపై 50 శాతం బ్యాంకు గ్యారెంటీ ఇవ్వాల్సి వచ్చేది. అంటే 50 లక్షల లైసెన్స్ ఫీజున్న షాపుకు రూ. 25 లక్షల బ్యాంకు గ్యారెంటీ ఇవ్వాల్సి వచ్చేది. ఇప్పుడు 25 శాతం (రూ.12 .5 లక్షలు) షూరిటీ ఇస్తే చాలు. ఒక క్లస్టర్‌‌లో ఉండే దుకాణం ఆ ప్రాంతంలో ఎక్కడైనా ఏర్పాటు చేసుకోవచ్చు. ఒకసారి దుకాణం ఏర్పాటు చేసిన తరువాత ఆ క్లస్టర్‌‌లోనే మరో చోటుకు మార్చుకోవాలనుకుంటే రూ. 25 వేలు చెల్లిస్తే సరిపోతుంది. గతంలో ఇది లైసెన్స్‌‌ ఫీజులో 2 శాతం ఉండేది. మొన్నటి వరకు ఆప్లికేషన్ టైమ్​లో క్యాస్ట్ సర్టిఫికెట్ తప్పనిసరి ఉండగా ఇప్పుడు ఆ రూల్​నూ మార్చారు. ఈ సారి పాలసీలో గౌడ, ఎస్సీ, ఎస్టీలకు పర్సంటేజీ ప్రకారం కొన్ని షాపులను రిజర్వు చేశారు. వీళ్లు కూడా వెంటనే కాస్ట్ సర్టిఫికెట్ ఇచ్చే పనిలేదని, లాటరీలో షాపు వచ్చాక ఈ నెల 29లోపు డిపార్ట్​మెంట్​కు సమర్పిస్తే చాలన్నారు.

సేల్స్ పెంచాలె.. లాభాలు పంచాలె 

ఎక్కువ మందిని లిక్కర్​ బిజినెస్​వైపు ఆకర్షించడం కోసం కొత్త పాలసీలో చాలా మార్పులు చేశారు. వ్యాపారులు, ప్రభుత్వానికి లాభం వచ్చేలా నిర్ణయాలు తీసుకున్నారు. ఈ విషయాన్నే ఆఫీసర్లు జోరుగా ప్రచారం చేస్తున్నారు. గతంలో రూ.50 లక్షల ఫీజున్న షాపులో అంతకు 7 రెట్లు అంటే రూ. 3 కోట్ల 50 లక్షల వరకు జరిగే అమ్మకాలపై లిక్కర్​వ్యాపారులకు 20 శాతం మార్జిన్ వచ్చేది. ఆ తర్వాత అమ్మకాలపై 6.4 శాతమే ఉండేది. ఈసారి ఆ రూ.50 లక్షల షాపులో 10 రెట్ల స్టాక్​ అంటే  రూ. 5 కోట్ల అమ్మకాల వరకు 20 శాతం మార్జిన్ ఇస్తున్నారు. రూ. 5 కోట్ల టార్గెట్ పూర్తయ్యాక జరిగే సేల్స్ పై వచ్చే మార్జిన్ నూ 6.4 శాతం నుంచి 10 శాతానికి పెంచారు. అంటే అమ్ముకున్నోళ్లకు అమ్ముకున్నంత. అలాగే డ్రాలో దుకాణం దక్కించుకున్న వాళ్లు వాకిన్​ స్టోర్స్‌‌ పెట్టుకోవచ్చు. ఆ స్టోర్‌‌లో లిక్కర్‌‌ రిలేటెడ్‌‌ వస్తువులు అమ్ముకోవచ్చు. ఇందుకు రూ. 5 లక్షలు అదనంగా ఫీజు చెల్లించాలి.

కొత్త లిక్కర్​పాలసీలో సర్కారు ఆఫర్లివే..

  •     ఒక వ్యక్తి ఎన్ని అప్లికేషన్లనైనా వేసుకోవచ్చు.
  •     ఓ క్లస్టర్​లో ఎక్కడైనా దుకాణం పెట్టుకోవచ్చు.
  •     లైసెన్స్​ఫీజుకు బ్యాంకు గ్యారెంటీ ఒక్కటే చాలు.
  •     లైసెన్స్​ఫీజు కట్టే వాయిదాలు 6కు పెంచారు.
  •     5 కోట్ల అమ్మకాల దాకా 20% మార్జిన్​పొందొచ్చు. 
  •     వాకిన్​స్టోర్లు పెట్టుకోవచ్చు. 
  • లిక్కర్​ రిలేటెడ్​ వస్తువులు అమ్ముకోవచ్చు.