SIR.. ఓటర్ల జాబితా ప్రక్షాళన.. ఓటు హక్కుకు పరీక్ష.. తొలగింపులకు గురయ్యేవారు ఎవరు?

SIR.. ఓటర్ల జాబితా ప్రక్షాళన.. ఓటు హక్కుకు పరీక్ష.. తొలగింపులకు గురయ్యేవారు ఎవరు?

ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికలు ఎంత ముఖ్యమో, ఎన్నికల జాబితా అంతకంటే ముఖ్యమైనది. ఓటర్ల జాబితా విశ్వసనీయతే ఎన్నికల నిష్పాక్షికతకు పునాది. అందుకే ఎన్నికల సంఘం కాలానుగుణంగా ఓటర్ల జాబితా సవరణ చేపడుతుంటుంది. అయితే తెలంగాణలో చేపట్టిన ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌‌‌‌‌‌‌‌ఐఆర్‌‌‌‌‌‌‌‌) ప్రక్రియ సాధారణ సవరణ కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.  ఎన్నికల సంఘం దృష్టిలో ఇది ఓటర్ల జాబితా ప్రక్షాళన కార్యక్రమం కాగా, రాజకీయ పార్టీల దృష్టిలో ఇది ఎన్నికల సమీకరణాలను ప్రభావితం చేసే ప్రక్రియగా కనిపిస్తోంది. సాధారణ ఓటరు దృష్టిలో మాత్రం ఇది తన ఓటు హక్కు కొనసాగుతుందా లేదా అనే ఆందోళనగా మారింది.

ద్వంద్వ నమోదులు తగ్గుతాయి. మరణించిన వారి పేర్లు తొలగిపోతాయి. శాశ్వతంగా వేరే ప్రాంతాలకు వెళ్లిన వారి నమోదులు సరిచేయబడతాయి. కొత్త ఓటర్లకు స్థానం లభిస్తుంది. రాజకీయ పార్టీలు కూడా నిజమైన ఓటర్ల ఆధారంగా వ్యూహాలు రూపొందించుకునే అవకాశం ఉంటుంది. ఎన్నికల సంఘంపై ప్రజల విశ్వాసం పెరుగుతుంది. ఓటర్ల జాబితాపై పదే పదే వ్యక్తమయ్యే అనుమానాలు తగ్గుతాయి. అయితే, ఈ ప్రయోజనాలన్నింటికంటే పెద్ద ప్రశ్న ఏమిటంటే, ఈ ప్రక్రియలో అర్హులైన ఓటర్లు కూడా బయటపడే ప్రమాదం ఎంత?

తొలగింపులకు గురయ్యేవారు ఎవరు ?
గత అనుభవాలను పరిశీలిస్తే తొలగింపులలో ఎక్కువ భాగం నాలుగు వర్గాల నుంచే జరుగుతున్నట్లు కనిపిస్తోంది. మరణించినవారు, శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయినవారు, రెండు లేదా అంతకంటే ఎక్కువ చోట్ల నమోదైనవారు, ఎన్నో ఏళ్లుగా అందుబాటులో లేని నమోదులు ప్రధానంగా తొలగింపులకు గురవుతుంటాయి. అయితే ఇక్కడే మరో సమస్య మొదలవుతోంది. 

విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నవారు, హైదరాబాద్ వంటి నగరాల్లో అద్దె ఇళ్లలో నివసించే ఉద్యోగులు, విద్యార్థులు, ఇతర రాష్ట్రాల్లో పనిచేస్తున్న కార్మికులు, ఇంటింటి సర్వే సమయంలో అందుబాటులో లేని కుటుంబాలు కూడా “గైర్హాజరు” వర్గంలోకి వెళ్లే ప్రమాదం ఉంది. అందుకే ఈ ప్రక్రియలో అత్యంత సున్నితమైన అంశం “తప్పు తొలగింపులు”.

ఎంతమేరకు తొలగింపులు జరగవచ్చు ?
ఇతర రాష్ట్రాల అనుభవాలు చూస్తే మూడు నుంచి ఎనిమిది శాతం వరకు పేర్లు జాబితా నుంచి తొలగించబడిన సందర్భాలు ఉన్నాయి. తెలంగాణలో మూడు కోట్లకు పైగా ఓటర్లు ఉన్న నేపథ్యంలో ఐదు శాతం పేర్లు పరిశీలనకు వచ్చినా అది దాదాపు 15 లక్షల వరకు ఉండే అవకాశం ఉంది. 

అయితే వీరిలో గణనీయమైన సంఖ్యలో ప్రజలు క్లెయిమ్‌‌‌‌‌‌‌‌లు, అభ్యంతరాల ద్వారా తిరిగి నమోదు అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి తొలగింపుల సంఖ్యకన్నా వాటి నాణ్యత ముఖ్యం. లక్ష పేర్లు తొలగించడమే విజయమైతే ప్రజాస్వామ్యం బలపడదు. ఒక్క అర్హుడైన ఓటరు కూడా అన్యాయంగా జాబితా నుంచి తొలగిపోకుండా చూడడమే నిజమైన విజయం.

తెలంగాణలోని ఆంధ్రప్రదేశ్ మూలాల ప్రజలు ఏ రాష్ట్రాన్ని ఎంచుకుంటున్నారు?
విభజన తర్వాత దశాబ్ద కాలంలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ ప్రాంతాల్లో స్థిరపడిన ఆంధ్రప్రదేశ్ మూలాల కుటుంబాలలో అధిక శాతం తమ నివాస ప్రాంతమైన తెలంగాణలోనే ఓటు హక్కును కొనసాగిస్తున్నట్లు ఎన్నికల ధోరణులు సూచిస్తున్నాయి.

గ్రామాలతో భావోద్వేగ సంబంధం ఉన్నప్పటికీ, ఉపాధి, విద్య, వ్యాపారాలు, పిల్లల భవిష్యత్తు తెలంగాణతో ముడిపడి ఉండటంతో అక్కడి రాజకీయ పరిణామాలపై ఆసక్తి పెరిగింది. అయితే కొంతమంది తమ స్వగ్రామాల్లోనూ ఓటు కొనసాగిస్తూ, నగరాల్లోనూ పేర్లు నమోదు చేసుకున్న అవకాశాన్ని పూర్తిగా తోసిపుచ్చలేం. అలాంటి ద్వంద్వ నమోదులే ఈ సవరణలో ప్రధానంగా గుర్తింపుకు వచ్చే అవకాశముంది.

ఇతర రాష్ట్రాల అనుభవం ఏమి చెబుతోంది ?
మహారాష్ట్రలో ముంబై, పుణే వంటి నగరాల్లో భారీ స్థాయిలో ద్వంద్వ నమోదులు గుర్తించారు. బెంగళూరు వంటి మహానగరాల్లో వలస జనాభా అధికంగా ఉండటంతో లక్షలాది పేర్లు సవరణకు గురయ్యాయి. బిహార్‌‌‌‌‌‌‌‌లో ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లిన కార్మికుల నమోదులపై పెద్దఎత్తున పరిశీలన జరిగింది. 

అస్సాంలో పౌరసత్వ అంశంతో ముడిపడి ఓటర్ల జాబితా వివాదాస్పదమైంది. ఢిల్లీలో అద్దె ఇళ్లలో నివసించే ప్రజల నమోదులపై తరచుగా సమస్యలు ఎదురయ్యాయి. ఈ అనుభవాలన్నీ చెప్పే విషయం ఒక్కటే. పట్టణ ప్రాంతాల్లో జనాభా చలనం ఎక్కువగా ఉన్నచోట్ల తొలగింపులు కూడా అధికంగా ఉంటాయి. అందువల్ల తెలంగాణలో హైదరాబాద్ మహానగరం ప్రధానంగా ప్రభావితమయ్యే అవకాశం ఉంది.

అంతిమంగా..
ప్రత్యేక సమగ్ర సవరణను పూర్తిగా వ్యతిరేకించాల్సిన అవసరం లేదు. అలాగే అది తప్పులేనిదని భావించడమూ సమంజసం కాదు. ఎన్నికల జాబితా ప్రక్షాళన ప్రజాస్వామ్య ఆరోగ్యానికి అవసరం. అయితే ప్రజాస్వామ్య ఆరోగ్యానికి ప్రాణవాయువు ఓటరే. అనర్హుడు జాబితాలో ఉండకూడదు. అదే సమయంలో అర్హుడైన ఒక్క పౌరుడైనా అన్యాయంగా బయటకెళ్లకూడదు. ఈ రెండు లక్ష్యాల మధ్య సమతుల్యతను ఎన్నికల సంఘం ఎంత సమర్థంగా పాటించగలుగుతుందో, ఎస్‌‌‌‌‌‌‌‌ఐఆర్‌‌‌‌‌‌‌‌ విజయాపజయాలు దానిపైనే ఆధారపడి ఉంటాయి. నిజానికి ఓటు హక్కు కోల్పోయిన పౌరుడికి ప్రతి రోజు ప్రజాస్వామ్యం దూరమైనట్టే.

ఓటర్లు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ?
బీఎల్‌‌‌‌‌‌‌‌వో ఇచ్చే ఎన్యుమరేషన్ ఫారాన్ని నిర్లక్ష్యం చేయరాదు. ఇంట్లో లేనప్పుడు కుటుంబ సభ్యులు వివరాలు అందించాలి. ఆన్‌‌‌‌‌‌‌‌లైన్ సదుపాయాలను వినియోగించుకోవాలి.

ఫారం సమర్పించినట్లు రశీదు భద్రంగా ఉంచుకోవాలి. జులై 31న ముసాయిదా జాబితా విడుదలైన తర్వాత తమ పేరు ఉందో లేదో పరిశీలించాలి. పేరు లేకపోతే వెంటనే క్లెయిమ్‌‌‌‌‌‌‌‌లు దాఖలు చేయాలి. నోటీసులు వస్తే స్పందించాలి. ఉద్యోగరీత్యా ఇతర రాష్ట్రాల్లో ఉన్నవారు తమ కుటుంబ సభ్యులతో నిరంతరం సంప్రదింపులు కొనసాగించాలి. ఎక్కువ పేర్లు తొలగించడం కాదు. నిజమైన ఓటరును కాపాడుతూ, అనర్హ నమోదులను మాత్రమే తొలగించడం. అదే ఈ ప్రక్రియకు అసలైన పరీక్ష. అది పౌరసత్వానికి ప్రతీక. అందుకే ప్రక్షాళన ఎంత అవసరమో, సమగ్రత అంతకంటే ముఖ్యం.

రమేశ్ పాక జనరల్​ సెక్రటరీ, తెలంగాణ తహసీల్దార్స్ అసోసియేషన్