నార్సింగి అత్యాచార నిందితుడికి ఉరిశిక్ష

నార్సింగి అత్యాచార నిందితుడికి ఉరిశిక్ష

రంగారెడ్డి కోర్టు సంచలన తీర్పునిచ్చింది. అత్యాచారానికి పాల్పడిన నిందితుడికి ఉరిశిక్ష విధించింది. దినేశ్‌ కుమార్‌ అనే వ్యక్తి మూడేళ్ల క్రితం నార్సింగి ప్రాంతానికి చెందిన ఆరేళ్ల బాలికను రేప్ చేసి.. ఆ తర్వాత హత్య చేశాడు.ఈ క్రమంలో రంగారెడ్డి కోర్టు మంగళవారం నిందితుడు దినేశ్‌ కుమార్‌కు ఉరిశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది.

2017 డిసెంబర్‌ 12న నిందితుడు దినేశ్‌ కుమార్‌.. ఇంటిముందు ఆడుకుంటున్న ఆరేళ్ల చిన్నారిని కిడ్నాప్ చేశాడు. లేబర్ క్యాంప్‌కు తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. ఆ తర్వాత ఈ విషయాన్ని బాలిక ఎవరికైనా చెబుతుందేమోననే భయంతో అక్కడే బండరాయితో మోది హత్య చేశాడు.

అయితే అప్పటికే కూతురు కన్పించకపోవడంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో తల్లిదండ్రులు వెతికారు. కొన్ని గంటల తర్వాత నిర్మాణంలో ఉన్న ఓ భవనం సమీపంలో అనుమానాస్పద స్థితిలో పడి ఉన్న బాలిక మృతదేహాన్ని తల్లిదండ్రులు గుర్తించారు. వెంటనే నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్థానికులు, తల్లిదండ్రులు ఇచ్చిన సమాచారంతో దినేశ్‌ కుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు.

నిందితుడికి ఈ కేసుతో సంబంధం ఉందని నిరూపించే సాక్ష్యాలు సంపాదించి కోర్టుకు సమర్పించారు పోలీసులు. ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు ద్వారా ట్రయల్స్‌ నిర్వహించారు. ఈ కేసుకు సంబంధించి దాదాపు నాలుగేళ్లుగా వాదోపవాదాలు కొనసాగాయి. పోలీసులు సమర్పించిన సాక్ష్యాలను పరిశీలించిన కోర్టు దినేశ్‌ కుమార్‌ను దోషిగా తేల్చి … రూ.1000 జరిమానాతో పాటు ఉరి శిక్ష విధిస్తూ సైబరాబాద్ మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ కోర్టు మంగళవారం తీర్పునిచ్చింది.