మరో 5 జిల్లాలకు తొలి ముద్ద.. అంగన్‌‌‌‌‌‌‌‌వాడీల్లో బ్రేక్‌‌‌‌‌‌‌‌ ఫాస్ట్ స్కీమ్ విస్తరణకు సర్కార్ కసరత్తు 

మరో 5 జిల్లాలకు తొలి ముద్ద.. అంగన్‌‌‌‌‌‌‌‌వాడీల్లో బ్రేక్‌‌‌‌‌‌‌‌ ఫాస్ట్ స్కీమ్ విస్తరణకు సర్కార్ కసరత్తు 
  • అంగన్‌‌‌‌‌‌‌‌వాడీల్లో బ్రేక్‌‌‌‌‌‌‌‌ ఫాస్ట్ స్కీమ్ విస్తరణకు ప్రభుత్వం కసరత్తు 
  • మహబూబాబాద్, వికారాబాద్, ఆసిఫాబాద్, నాగర్‌‌‌‌‌‌‌‌ కర్నూల్, ములుగు జిల్లాల్లో అమలుకు సన్నాహాలు 
  • ఇప్పటికే ఆదిలాబాద్, కొత్తగూడెం పైలెట్ ప్రాజెక్టుల్లో సత్ఫలితాలు 
  • విస్తరణలో జాప్యంపై అధికారులను మందలించిన మంత్రి సీతక్క

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని అంగన్‌‌‌‌‌‌‌‌వాడీ సెంటర్లలో చిన్నారులకు పౌష్టికాహారాన్ని అందించేందుకు ఉద్దేశించిన తొలిముద్ద (బ్రేక్‌‌‌‌‌‌‌‌ఫాస్ట్) స్కీం విస్తరణకు మహిళా, శిశు సంక్షేమ శాఖ కసరత్తు చేస్తున్నది. ఇప్పటికే ఏజెన్సీ ప్రాంతాల్లో నిర్వహించిన పైలెట్ ప్రాజెక్ట్ సత్ఫలితాలు ఇవ్వడంతో.. పోషకాహార లోపం అధికంగా ఉన్న మహబూబాబాద్, వికారాబాద్, కుమ్రం భీమ్ ఆసిఫాబాద్, నాగర్‌‌‌‌‌‌‌‌ కర్నూల్, ములుగు జిల్లాల్లోనూ ఈ పథకాన్ని ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. 

అయితే, ఈ స్కీమ్ విస్తరణలో జరుగుతున్న ఆలస్యంపై మంత్రి సీతక్క అధికారులపై అసహనం వ్యక్తం చేసినట్టు సమాచారం. తొలిముద్ద స్కీమ్ విస్తరణ ఎందుకు లేట్ అవుతున్నది? పైలెట్ ప్రాజెక్టులో మంచి ఫలితాలు వచ్చినా ఇతర జిల్లాల్లో అమలుకు ఎందుకు జాప్యం జరుగుతున్నది? అని అధికారులను మందలించినట్టు తెలుస్తున్నది. సరఫరా వ్యవస్థను పకడ్బందీగా సిద్ధం చేసి పథకాన్ని వేగవంతం చేయాలని అధికారుల ఆదేశించినట్టు సమాచారం.

పైలెట్ ప్రాజెక్టుతో పెరిగిన హాజరు

ఈ పథకాన్ని తొలుత ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేయగా.. ప్రీ-స్కూల్ పిల్లల హాజరు గణనీయంగా పెరిగింది. ఆదిలాబాద్ జిల్లాలో గతంలో 69 శాతంగా ఉన్న పిల్లల హాజరు.. ఈ పథకం అమలు తర్వాత 92 శాతానికి చేరగా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 76.7 శాతం నుంచి 91.55 శాతానికి పెరిగింది. 

ఉదయం 9 గంటలకే కేంద్రాలకు చేరుకుంటున్న చిన్నారులకు వేడివేడి అల్పాహారం లభిస్తుండటంతో ఆకలి బాధ తగ్గి, రోజంతా చురుగ్గాఉంటూ ప్రీ-స్కూల్ విద్య, ఆటపాటల్లో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. పిల్లల్లో తీవ్ర పోషకాహార లోపం (ఎస్ఏఎం), బక్కచిక్కడంలాంటి సమస్యలు తగ్గుముఖం పడుతున్నట్టు గుర్తించారు. గ్రామీణ ప్రాంత తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేట్ బడులకు బదులు అంగన్‌‌‌‌‌‌‌‌వాడీలకే పంపుతున్నట్టు అధికారులు తెలిపారు. 

పోషకాలతో కూడిన ఇన్‌‌‌‌‌‌‌‌స్టాంట్ బ్రేక్‌‌‌‌‌‌‌‌ఫాస్ట్ 

తొలిముద్దలో భాగంగా 3 నుంచి 6 ఏండ్లలోపు ప్రతి చిన్నారికి రోజుకు 25 గ్రాముల చొప్పున ఏడాదికి 300 రోజులపాటు అల్పాహారం అందిస్తారు. కేంద్రాల్లో ప్రస్తుతం ఇస్తున్న వేడి భోజనం, కోడిగుడ్డు, స్నాక్స్‌‌‌‌‌‌‌‌కు అదనంగా ఈ బ్రేక్‌‌‌‌‌‌‌‌ఫాస్ట్ జతవుతున్నది.

నేషనల్ ఇన్‌‌‌‌‌‌‌‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (ఎన్ఐఎన్), యూనిసెఫ్ సాంకేతిక సహకారంతో తెలంగాణ ఫుడ్స్ సంస్థ ఎలాంటి ఆర్టిఫిషియల్ ప్రిజర్వేటివ్స్ లేకుండా తయారు చేసిన ఇన్‌‌‌‌‌‌‌‌స్టాంట్ ఉప్మా, కిచిడీ మిక్స్‌‌‌‌‌‌‌‌లను అంగన్‌‌‌‌‌‌‌‌ వాడీ కేంద్రాలకు నేరుగా సరఫరా చేస్తోంది. రెండో విడతలో గుర్తించిన ఐదు జిల్లాల్లో పంపిణీని పూర్తిస్థాయిలో ప్రారంభించిన అనంతరం, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మొత్తం 33 జిల్లాల పరిధిలోని 35,781 అంగన్‌‌‌‌‌‌‌‌వాడీ కేంద్రాలకూ తొలిముద్దను వర్తింపజేయనున్నట్టు అధికారులు వెల్లడించారు