నాగేష్ ను సొంతం చేసుకోవాలనే మమతపై పెట్రోల్ దాడి

నాగేష్ ను సొంతం చేసుకోవాలనే  మమతపై పెట్రోల్ దాడి
  • వివాహేతర సంబంధమే కారణం
  • మమత, చిన్నారి హత్య కేసులో నిందితురాలు రిమాండ్

చండూరు (నాంపల్లి) వెలుగు: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన పెట్రోల్ దాడి ఘటనలో జంట హత్యల నిందితురాలు మీసాల సుజాతను సోమవారం పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. నల్గొండ జిల్లా నాంపల్లి సీఐ దూది రాజు మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం.. 

నాంపల్లి మండలం కేతేపల్లి గ్రామంలో  గత నెల 31న కుందేలు నాగేష్ భార్య మమతపై అదే గ్రామానికి చెందిన మీసాల సుజాత పెట్రోల్ పోసి నిప్పంటించింది.  అనంతరం నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయింది. ఈ ఘటనలో మమతతో పాటు ఆరు నెలల కుమారుడు అద్విక్ నందన్ మరణించాడు.  సుజాత నాగేష్ తో వివాహేతర సంబంధం పెట్టుకున్న విషయం మమత తన తల్లిదండ్రులకు చెప్పడంతో పెద్దమనుషుల సమక్షంలో తల్లిదండ్రులు నాగేష్ ను మందలించారు.  దీంతో నాగేష్  సుజాతను దూరం పెట్టి..  ఫోన్ సైతం లిఫ్ట్ చేయకపోవడంతో సుజాత కోపం పెంచుకొని మమతని చంపితే నాగేష్ ని దక్కించుకోవచ్చనే ఉద్దేశంతో పక్కా ప్లాన్ వేసింది.  

గ్రామంలోని ఓ కిరాణం షాపులో పెట్రోల్ కొనుగోలు చేసి.. కారం పొడి, కత్తితో మమత ఇంటి దగ్గరికి వెళ్లింది.  మమత చంటి బిడ్డను సంకలో పెట్టుకుని పాలిస్తుండగా..  వెంటనే పెట్రోలు పోసి నిప్పంటించింది. దీంతో మమతకు పూర్తిగా మంటలు అంటుకోగా..  చంకన బాబును విసిరివేసి దొడ్లోకి పరిగెత్తింది. మమత అక్కడికక్కడే కాలి బూడిద కాగా ఆద్వీక్ నందన్ కు కూడా 80 శాతం గాయాలయ్యాయి. కుమారుడిని హాస్పిటల్ తరలిస్తూ ఉండగా చనిపోయాడు. సుజాత నాగేష్ ను సొంతం చేసుకోవాలని ఈ దుశ్చర్యకు పాల్పడిందని తెలిపారు. ఈ మేరకు ఆమెను జ్యుడిషియల్ రిమాండ్‌ కు తరలిస్తున్నట్టు ఆయన చెప్పారు. సమావేశంలో నాంపల్లి ఎస్సై కే. లింగారెడ్డి పోలీసు సిబ్బంది ఉన్నారు.