డిగ్రీ కాలేజీల్లో 15 శాతంలోపు అడ్మిషన్లుంటే స్లైడింగ్.. ప్రైవేటు, సర్కారు కాలేజీల్లోనూ ఫేషియల్ అటెండెన్స్ తప్పనిసరి

డిగ్రీ కాలేజీల్లో 15 శాతంలోపు అడ్మిషన్లుంటే స్లైడింగ్.. ప్రైవేటు, సర్కారు కాలేజీల్లోనూ ఫేషియల్ అటెండెన్స్ తప్పనిసరి
  •     పీఎంయూ మీటింగ్​లో అధికారుల నిర్ణయం 

హైదరాబాద్, వెలుగు: సర్కారుతో పాటు ప్రైవేటు కాలేజీల్లోనూ ఫేషియల్ అటెండెన్స్ విధానం తప్పనిసరిగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే సర్కారు కాలేజీల్లో అమలుకు ఆదేశాలివ్వగా, ప్రైవేటు కాలేజీల్లోనూ అమలు చేసేందుకు యూనివర్సిటీ వీసీలు వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలని ఆదేశించింది. గురువారం సెక్రటేరియెట్‌లో ఉన్నత విద్యాశాఖపై ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ (పీఎంయూ) సమావేశం జరిగింది. దీనిలో హయ్యర్ ఎడ్యుకేషన్ చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి, విద్యాశాఖ సెక్రటరీ యోగిత రాణా, కళాశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన తదితరులు పాల్గొనగా.. అడ్మిషన్లు, అటెండెన్స్, కొత్త కోర్సులపై సమీక్షించారు. కాలేజీల్లో విద్యార్థుల హాజరు విషయంలో ఇకపై స్ట్రిక్ట్​గా ఉండాలని నిర్ణయించారు. 

2026--27 విద్యా సంవత్సరానికి సంబంధించి డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) నోటిఫికేషన్‌ను ఇంటర్ ఫలితాల వచ్చిన తెల్లారే ఇవ్వాలని నిర్ణయించారు. దోస్త్ ద్వారా 15 శాతం లేదా అంతకంటే తక్కువగా అడ్మిషన్లు వచ్చిన కాలేజీల విద్యార్థులు మెరుగైన అవకాశాల కోసం వేరే కాలేజీలకు వెళ్లేలా స్లైడింగ్ వెసులుబాటు కల్పించనున్నారు.

షెడ్యూల్ పాటించకపోతే షోకాజ్​

నాన్​ దోస్త్  కాలేజీల అడ్మిషన్ల విషయంలో కఠినంగా వ్యవహరించాలని పీఎంయూ నిర్ణయించింది. ఆయా కాలేజీలు కూడా దోస్త్ షెడ్యూల్​కు అనుగుణంగా డిగ్రీ అడ్మిషన్లు చేపట్టాలని ఆదేశించింది. షెడ్యూల్ పాటించని కాలేజీలకు ఉస్మానియా యూనివర్సిటీ వీసీ లేదా దోస్త్ కన్వీనర్ ద్వారా షోకాజ్ నోటీసులు జారీ చేయనున్నారు. అలాగే, ప్రస్తుతం ఉన్న డిగ్రీ కోర్సుల్లోని బకెట్ సిస్టమ్ పై రివ్యూ చేసేందుకు ఒక కమిటీని వేయాలని తీర్మానించారు. 

ఇతర రాష్ట్రాల్లో ఉన్న విధానాలను స్టడీ చేసి, వచ్చే విద్యా సంవత్సరానికి అవసరమైన మార్పులు చేయాలని ఈ కమిటీకి సూచించారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి సరికొత్త ఇన్నోవేటివ్ యూజీ కోర్సులను ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. సమావేశంలో ఓయూ వీసీ కుమార్ తో పాటు విద్యాశాఖ అధికారులు, పలువురు వీసీలు పాల్గొన్నారు.