వరదలపై ఫేక్ వీడియో వైరల్: హైదరాబాద్ ఎయిర్ పోర్టు పేరుతో మెక్సికో వీడియో

వరదలపై ఫేక్ వీడియో వైరల్: హైదరాబాద్ ఎయిర్ పోర్టు పేరుతో మెక్సికో వీడియో

భారీ వర్షాలతో హైదరాబాద్ సిటీలో కాలనీలకు కాలనీలు వరద నీటిలో మునిపోయాయి. రోడ్లన్నీ వాగుల్లా మారాయి. దాదాపు 100 ఏళ్లలో ఎప్పుడూ లేనంద వరదను గడిచిన రెండ్రోజుల్లో చూసింది భాగ్యనగరం. సిటీలోని కొన్ని ఏరియాల్లో బయట అడుగుపెడితే నీళ్లలో కొట్టుకుపోతామేమో అన్నంత భయంతో వణికిపోయే పరిస్థితి నెలకొంది. చాలా ప్రాంతాల్లో ఇళ్లు మునిపోవడంతో జనాల్ని పడవల్లో పునరావాస కేంద్రాలకు తరలించాల్సి వచ్చింది. వరదలో కార్లు, బైకులు కొట్టుకుపోయాయి. ఎప్పుడూ లేనంతగా వచ్చిన ఈ వరదలకు సంబంధించి అనేక వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అయితే ఈ వీడియోల్లో గతంలో ఎప్పుడో వచ్చిన వరదలకు సంబంధించినవి, ఇతర ప్రాంతాల్లోనివి కూడా కొంత మంది షేర్ చేస్తున్నారు. ఇలా హైదరాబాద్ లోని శంషాబాద్ ఎయిర్ పోర్టుపై గురించి ఒక ఫేక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భారీ వర్షాలతో రన్ వేపై నీళ్లు నిలిచి పోయాయని, దీంతో ఫ్లైట్స్ ఆపేశారని ఓ వీడియో షేర్ అవుతోంది.

Hyderabad RGIA AIRPORT Shamshabad

Azad Janta यांनी वर पोस्ट केले बुधवार, १४ ऑक्टोबर, २०२०

అయితే హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ అంటూ షేర్ అవుతున్న ఈ వీడియో ఇప్పటిది కాదు. 2017ఆగస్టులో మెక్సికో దేశంలో వచ్చిన వరదలకు సంబంధించిన వీడియో అది. రన్ వేపై భారీగా నీళ్లు నిలిచిపోవడంతో విమాన రాకపోకలను నిలిపేస్తున్నట్లు అప్పట్లో అక్కడి అధికారులు ప్రకటించారు. ఆ వీడియోను ఇప్పుడు కొందరు హైదరాబాద్ వరదలకు లింక్ పెట్టి షేర్ చేస్తున్నారు.

ఫేక్ వీడియోపై హైదరాబాద్ ఎయిర్ పోర్టు అధికారుల స్పందన

హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో వాన నీరు నిలవడంతో విమాన సర్వీసులు రద్దు చేసినట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో విమానాశ్రయ అధికారుల దృష్టికి వచ్చింది. దీంతో అది ఫేక్ వీడియో అని, హైదరాబాద్ విమానాశ్రయంలో అంతా నార్మల్ గానే ఉందని క్లారిటీ ఇచ్చారు. ఫేక్ వీడియోలను నమ్మొద్దని, హైదరాబాద్ ఎయిర్ పోర్టులో విమాన సర్వీసులు మామూలుగానే రన్ అవుతున్నాయని హైదరాబాద్ ఎయిర్ పోర్టు అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ ద్వారా వెల్లడించారు. ఏదైనా సమాచారం కోసం ఎయిర్ పోర్టు ఇన్ఫర్మేషన్ డెస్క్ ను సంప్రదించవచ్చని, సోషల్ మీడియా అకౌంట్లలో మెసేజ్ చేసినా రెస్పాండ్ అవుతామని తెలిపారు.