డేటా ఎంట్రీ జాబ్ పేరుతో మోసం

డేటా ఎంట్రీ జాబ్ పేరుతో మోసం
  • పంజగుట్టలో ఫేక్ కాల్ సెంటర్ 
  • ముగ్గురు నిర్వాహకుల అరెస్ట్
  • 32మంది టెలీకార్లకు నోటీసులు
  • ఒక్క ఏప్రిల్ లోనే బాధితుల నుంచి రూ.50 లక్షలు వసూలు

హైదరాబాద్‌‌, వెలుగు: పంజాగుట్ట అడ్డాగా ఫేక్ కాల్ సెంటర్ రన్ చేస్తూ..  డేటా ఎంట్రీ జాబ్స్​ పేరుతో  మోసాలకు పాల్పడుతున్న ముగ్గురిని  సీసీఎస్‌‌, టాస్క్‌‌ఫోర్స్  పోలీసులు శనివారం అరెస్టు చేశారు.11 మంది మహిళలు సహా మొత్తం 32 మంది టెలీకాలర్లకు నోటీసులు జారీ చేశారు. కాల్​సెంటర్‌‌‌‌ నుంచి14 ల్యాప్‌‌టాప్​లు, 148 సెల్‌‌ఫోన్లు, 4 బైక్​లు, బీఎండబ్ల్యూ కారు, రూ.1.03 లక్షల క్యాష్ స్వాధీనం చేసుకున్నారు. కాల్‌‌ సెంటర్‌‌‌‌ను సీజ్  చేశారు. ఒక్క ఏప్రిల్‌‌ నెలలోనే రూ.50 లక్షలు వసూలు చేసినట్లు ఆధారాలు సేకరించారు. ఈ ఫేక్ కాల్‌‌ సెంటర్ వివరాలను సిటీ సైబర్  క్రైమ్ డీసీపీ స్నేహా మెహ్రా మీడియాకు వెల్లడించారు. సిద్దిపేటకు చెందిన గడగొని చక్రధర్‌‌  ‌‌గౌడ్ (35) బాచుపల్లిలోని కృష్ణసాయి ఆర్కిడ్‌‌లో ఉంటున్నాడు. గతంలో అబిడ్స్‌‌లోని ఎల్‌‌ఐసీ బ్రాంచ్​లో పర్సనల్  లోన్స్ ఏజెంట్‌‌గా పనిచేశాడు. ఆ తర్వాత హిమాయత్‌‌నగర్‌‌‌‌లోని కోటక్ మహీంద్రా బ్యాంకులో 2011 వరకు పనిచేశాడు. ఏడాది కాలం మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌‌గా చేశాడు. ఈ క్రమంలోనే ఉద్యోగాల పేరుతో నిరుద్యోగ యువతను మోసం చేసేందుకు ప్లాన్ వేశాడు. సిద్దిపేటకే చెందిన గణేశ్, శ్రవణ్‌‌తో కలిసి పంజాగుట్టలో కాల్‌‌ సెంటర్‌‌‌‌ ఏర్పాటు చేశాడు. ఏపీ, కేరళ, తమిళనాడు, కర్నాటక రాష్ట్రాలకు చెందిన 11 మంది యువతులు సహా మొత్తం 32 మందిని టెలీకాలర్లుగా నియమించుకున్నాడు. జాబ్  పోర్టల్స్​లో అప్‌‌లోడ్‌‌  చేసిన నిరుద్యోగ యువత  ఫోన్  నంబర్లు  సేకరించారు. తెలంగాణ మినహా ఏపీ, కేరళ, తమిళనాడు, కర్నాటకకు చెందిన యువతను టార్గెట్‌‌ చేశారు. నెలకు రూ.20  వేల నుంచి రూ.25 వేలు సంపాదించే అవకాశం ఇస్తామని, ఇంట్లో కూర్చునే డేటా ఎంట్రీ ఆపరేటర్లుగా పనిచేయవచ్చని నిరుద్యోగ యువతను నమ్మించారు. ఆసక్తి చూపిన ఒక్కో అభ్యర్థి నుంచి సెక్యూరిటీ డిపాజిట్  పేరుతో రూ.2,500 వసూలు  చేశారు. జేపీజీ ఫైల్స్‌‌ను పీడీఎఫ్‌‌లోకి కన్వర్ట్‌‌ చేయాలని, పని పూర్తయిన తర్వాత రూ.25 వేలు ఇస్తామని నమ్మించారు.

45 రోజుల తర్వాత సిమ్‌‌ కార్డులు ధ్వంసం

నిందితులు 45 రోజుల పాటు వరుసగా కాల్స్  చేశారు. వారి టార్గెట్‌‌  పూర్తయిన తర్వాత సిమ్‌‌ కార్డులను ధ్వంసం చేశారు. కొత్త సిమ్‌‌ కార్డులు కొనుగోలు చేసి మళ్లీ కాల్స్ చేయడం ప్రారంభించారు. ఈ క్రమంలోనే తమ మోసం బయట పడకుండా టెలీకాలర్లను కూడా మార్చారు. ఇలా నాలుగు రాష్ట్రాలకు చెందిన వందల మందిని మోసం చేశారు. బాధితుల నుంచి ఒక్క ఏప్రిల్​లోనే సుమారు రూ.50 లక్షలు వసూలు చేశారు. సీసీఎస్ పోలీసులకు అందిన ఫిర్యాదుతో టాస్క్‌‌ఫోర్స్  పోలీసులు కాల్‌‌ సెంటర్‌‌‌‌పై నిఘా పెట్టి శనివారం సోదాలు నిర్వహించారు. నిందితులు చక్రధర్, గణేశ్, శ్రవణ్‌‌ను అరెస్టు చేశారు. టెలీకాలర్లకు నోటీసులు జారీ చేశారు.