గాంధీ ఆస్పత్రి నకిలీ డాక్టర్ లో మరో కోణం

గాంధీ ఆస్పత్రి నకిలీ డాక్టర్ లో మరో కోణం

హైదరాబాద్, వెలుగు గాంధీ ఆస్పత్రిలో ప్రైవేట్‌ డాక్టర్ బాగోతం వెలుగు చూసింది. హాస్పిటల్ లో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడిని ముంబైకి చెందిన సుప్రజిత్ పాండాగా గుర్తించారు. ఫెలోషిప్ డాక్టర్​గా ఐదు నెలలుగా ఆస్పత్రిలో ఉంటున్నట్లు భావిస్తున్నారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూహెచ్​వో) పేరుతో ఐడీ కార్డు కూడా వేసుకొని సుప్రజిత్ తిరుగుతున్నాడు. డాక్టర్స్ క్యాంటీన్ లో సంచరిస్తున్న సుప్రజిత్​పై అనుమానం రావటంతో పీజీ స్టూడెంట్లు, సెక్యూరిటీ ఇన్​చార్జ్ తదితరులు అతడిని ప్రశ్నించారు. ముందు జనరల్ మెడిసిన్ పీజీ స్టూడెంట్ అని చెప్పాడు. జనరల్ మెడిసిన్ పీజీ స్టూడెంట్లు వచ్చి అడగడంతో మాట మార్చాడు. కార్డియాలజీ విభాగంలో పనిచేస్తున్నట్లు తెలిపాడు. దీంతో అతడి గురించి సూపరిండెంట్ డాక్టర్ శ్రవణ్ దృష్టికి తీసుకెళ్లారు. తర్వాత అతనిపై చిలుకలగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని సుప్రజిత్​ను అరెస్ట్ చేశారు.

తన క్లినిక్‌‌కు పేషెంట్లను రప్పించుకునేందుకు..

ఉప్పల్ లో సుప్రజిత్​కు క్లినిక్ ఉన్నట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. తన క్లినిక్ కు పేషెంట్లను రప్పించుకునేందుకు ఇక్కడికి వస్తున్నట్లు తెలుస్తోంది. తాను కార్డియాలజీ స్పెషలిస్టునంటూ పేషెంట్లకు విజిటింగ్ కార్డులు ఇస్తూ తన క్లినిక్ కు తరలిస్తున్నాడని భావిస్తున్నారు. ఎంతకాలంగా ఆస్పత్రికి వస్తున్నాడు? ఇతనికి ఆస్పత్రి సిబ్బంది ఎవరైనా సహకరిస్తున్నారా? ఎవరెవరిని కలుస్తున్నాడన్న దానిపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు.

గురువారమే వచ్చాడు: సూపరింటెండెంట్

ప్రైవేట్‌ డాక్టర్ సుప్రజిత్ ఐదు నెలలుగా ఆస్పత్రిలో తిరుగుతున్నాడని వస్తున్న వార్తలను హాస్పిటల్ సూపరింటెండెంట్ శ్రవణ్ ఖండించారు. ఐదు నెలలపాటు ఓ కొత్త వ్యక్తి ఆస్పత్రిలో డాక్టర్ గా తిరగటం సాధ్యమయ్యే పని కాదని చెప్పారు. సీసీటీవీ ఫుటేజ్ ను కూడా పరిశీలిస్తామని చెప్పారు. అతడు కచ్చితంగా గురువారమే వచ్చాడని భావిస్తున్నామని, క్యాంటీన్ లో కొత్తగా కనబడే సరికి స్టూడెంట్లు పట్టుకున్నారన్నారు.

గాంధీలో భద్రతపై అనుమానాలు

గాంధీ ఆస్పత్రిలో 5 వందల మంది డాక్టర్లు పనిచేస్తున్నారు. ఫేక్ డాక్టర్ల ఉదంతాలు గతంలోనూ జరిగాయి. రెండేళ్ల క్రితం ఓ వార్డులో చికిత్స పొందుతున్న మహిళ బెడ్ వద్దకు నకిలీ డాక్టర్ వచ్చి కేస్ షీట్ ను పరిశీలించింది. మెడ నరాల్లో ఇంజక్షన్ ఇవ్వాలంటూ మత్తు మందు ఇచ్చి బంగారు చైన్ ఎత్తుకెళ్లింది. ఇప్పటికీ ఆ మహిళను పట్టుకోలేదు. ఆ తర్వాత కొన్ని రోజులకే  ఓ యువతి తన ప్రియుడి కోసం డాక్టర్ అవతారం ఎత్తి సెక్యూరిటీకి పట్టుబడింది. మరో మహిళ మెడలో స్టెతస్కోప్ వేసుకొని తిరుగుతుంటే గుర్తించి పోలీసులకు అప్పగించారు. మరోవైపు ఆస్పత్రిలో దొంగతనాలు సాధారణంగా మారాయి. సీసీ కెమెరాలు, సెక్యూరిటీ ఉన్నా ఆగట్లేదు. ఆస్పత్రి ఆవరణలో చాలా మంది మందు తాగుతూ నానా రచ్చ చేస్తున్నారు. దీంతో గాంధీలో పేషెంట్లు, డాక్టర్ల భద్రతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి