నకిలీ డాక్టర్ దంపతుల అరెస్ట్

నకిలీ డాక్టర్ దంపతుల అరెస్ట్

మేడిపల్లి, వెలుగు: ఫేక్​సర్టిఫికెట్లతో డాక్టర్లుగా చెలామణి అవుతున్న భార్యాభర్తలను మేడిపల్లి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండుకు తరలించారు. మేడిపల్లి పీఎస్​లో మల్కాజిగిరి డీసీపీ జానకి దరివత్, ఎస్​వోటీ డీసీపీ ఆర్​. గిరిధర్ వివరాలు వెల్లడించారు. వరంగల్ జిల్లా, నర్సంపేట మండలం, కొండపల్లికి చెందిన డాక్టర్ గిరిధర్ లాల్(35) అలియాస్ శ్రీవాస్తవ్, సురేఖరాణి(35) భార్యాభర్తలు. ఇద్దరూ ఉప్పల్ ఆదర్శనగర్ కాలనీలో ఉంటున్నారు. హోమియోపతిలో డిగ్రీ చేసిన గిరిధర్ అధిక మొత్తంలో డబ్బు సంపాదించేందుకు ఎంబీబీఎస్, ఎండీ(యూఎస్ఏ)తోపాటు వివిధ యూనివర్సిటీలో చదివినట్లు ఫేక్​సర్టిఫికెట్లు సృష్టించాడు. 

బోడుప్పల్ బాలాజీహిల్స్ లో శ్రీ వెంకటేశ్వరసాయి పేరుతో క్లినిక్, రేఖ పేరుతో మెడికల్​ స్టోర్ ​ఏర్పాటు చేశారు. భార్యాభర్తలు ఇద్దరూ డాక్టర్లమంటూ స్థానికులకు ట్రీట్​మెంట్ ​చేస్తున్నారు. వీరు గతంలో బర్కత్​పురా, అంబర్​పేట , నల్లకుంట, మాసబ్​ట్యాంక్, శివంరోడ్​లోని షిర్డీ సాయి ట్రస్టులో మెడికల్ ​కన్సల్టెంట్​గా పనిచేశారు. తర్వాత సిటీ శివారులో క్లినిక్​ పెట్టి డాక్టర్లుగా చెలామణి అవుతున్నారు. మల్కాజిగిరి ఎస్​వోటీ, మేడిపల్లి పోలీసులు మంగళవారం క్లినిక్​పై దాడిచేసి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఫేక్​ ఐడీలు, సర్టిఫికెట్లను స్వాధీనం చేసుకున్నారు.