ఆదాయం పెంచి చూపేందుకు ఫేక్ ఐటీ రిటర్నులు

ఆదాయం పెంచి చూపేందుకు ఫేక్ ఐటీ రిటర్నులు
  • శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో రూ. 2.7 కోట్లు సీజ్ 
  • భార్య, మరదలు వ్యాపారులట.. బిడ్డ హోం ట్యూటరట
  • శారీ సెంటర్స్‌‌, బొటిక్స్‌‌ పేరుతో నకిలీ రికార్డులు
  • ఐటీ రిటర్న్స్ దాఖలు చేసి.. ఆస్తుల కొనుగోలుకు స్కెచ్ 
  • వివరాలు సేకరించి, చర్యలు చేపట్టిన ఏసీబీ 

హైదరాబాద్‌‌, వెలుగు: హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) మాజీ డైరెక్టర్‌‌ శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో దర్యాప్తును ఏసీబీ ముమ్మరం చేసింది. ఆయన పెట్టిన పెట్టుబడులను సీజ్ చేస్తున్నది. ఇందులో భాగంగా శ్రీకృష్ణ కన్‌‌స్ట్రక్షన్స్‌‌ వద్ద రూ.2.70 కోట్లను శుక్రవారం సీజ్ చేసింది. ఈ కేసులో గత నెల 24న ఏసీబీ సోదాలు నిర్వహించింది. సోదాల్లో స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్ల ఆధారంగా అక్రమాస్తులను ఏసీబీ అధికారులు గుర్తించారు. నారాయణగూడలోని శ్రీకృష్ణ గ్రాండ్స్‌‌ అపార్ట్ మెంట్ లో శివబాలకృష్ణ రెండు లగ్జరీ ఫ్లాట్లు కొన్నట్లు ఆధారాలు సేకరించారు. 

ఇందుకు సంబంధించి శ్రీకృష్ణ కన్‌‌స్ట్రక్షన్స్‌‌కు నోటీసులు ఇచ్చి, వివరాలు రాబట్టారు. 2021 నుంచి 2022 వరకు విడతల వారీగా రూ.2.70 కోట్లు చెల్లించినట్లు గుర్తించారు. శ్రీకృష్ణ కన్‌‌స్ట్రక్షన్స్‌‌ వద్ద ఉన్న రూ.2.70 కోట్లు సీజ్‌‌ చేశారు. ఫ్లాట్లు రిజిస్ట్రేషన్ చేసేందుకు బినామీలను వెతికినట్లు అనుమానాలు రావడంతో శివబాలకృష్ణ పెట్టుబడుల వివరాలను సేకరించి సీజ్ చేసేందుకు ఏసీబీ అధికారులు చర్యలు చేపట్టారు. 

శారీస్, డ్రెసెస్ పేరుతో షెల్‌‌ కంపెనీలు 

ఆస్తుల కొనుగోలు కోసం శివబాలకృష్ణ సోదరుడు నవీన్‌‌కుమార్‌‌‌‌ ఫేక్ ఐటీ రిటర్న్స్‌‌ ఫైల్‌‌ చేశాడు. ఇందుకుగాను నవీన్ తన భార్య అరుణ పేరుతో సౌందర్య బొటిక్, సౌందర్య రెడీమేడ్స్ ఎంబ్రాయిడరీ వర్క్స్, శారీస్‌‌, రెడీమేడ్‌‌ డ్రెసెస్‌‌ పేరుతో నకిలీ సంస్థలను ఏర్పాటు చేశాడు. శివబాలకృష్ణ భార్య రఘుదేవి పేరుతో దేవి శారీ సెంటర్ ను నడుపుతున్నట్లు చూపించారు. వీరిని ఆయా షాపులలో ఉద్యోగులుగా చూపారు. వాస్తవానికి ఈ పేర్లతో షాపులు ఏర్పాటు చేయలేదు. జీఎస్‌‌టీ, వ్యాట్‌‌ రిజిస్ట్రేషన్‌‌ చేయలేదు. ఎక్కడా ఆఫీస్‌‌లు లేవు. ఉద్యోగులు లేరు.

 ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన రికార్డ్‌‌లు కూడా లేవు. కానీ ఆదాయాన్ని చూపేందుకు వీరి పేర్లతో వ్యాపారాలు, సంస్థలు ఉన్నట్లు చూపారు. ఈ షెల్ కంపెనీల ద్వారా రఘుదేవి, అరుణ పేర్లతో ఐటీ రిటర్న్స్‌‌ ఫైల్‌‌ చేసేవారు. రఘుదేవిపై ఆదాయాన్ని పెంచి చూపేందుకు ప్లానింగ్ ఆర్గనైజేషన్‌‌లో ఎంప్లాయిమెంట్‌‌ సర్టిఫికెట్‌‌ కూడా ఇప్పించాడు. 

హోం ట్యూషన్స్‌‌తో పేరుతో ఐటీ రిటర్న్స్

శివబాలకృష్ణ కూతురు పద్మావతి పేరుతో కూడా 2017–2018 నుంచి ఐటీ రిటర్న్స్‌‌ దాఖలు చేస్తున్నారు. వాస్తవానికి ఆ సమయంలో పద్మావతి మైనర్‌‌‌‌. హోమ్ ట్యూషన్స్ చెప్పడం ద్వారా ఆదాయం సమకూరుతున్నదని సర్టిఫికెట్స్‌‌ క్రియేట్‌‌ చేశారు. పద్మావతి పేరున కూడా ఆస్తులు కొన్నారు. ఐటీ రిటర్న్స్‌‌ ద్వారా ముగ్గురి పేర్లతో స్థిర, చరాస్తులను కొనుగోలు చేసినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. నాగర్‌‌ కర్నూల్ జిల్లా వంగూరు, సిద్ధిపేట జిల్లా గజ్వేల్‌‌, యాదాద్రి జిల్లా వలిగొండ, జనగాం జిల్లా పాలకుర్తి, జాఫర్‌‌‌‌గడ్‌‌లలో రఘుదేవి, పద్మావతితోపాటు శివబాలకృష్ణ తల్లి భారతి, కొడుకు హరిప్రసాద్‌‌ పేర్లతో వ్యవసాయ భూములు కూడా కొన్నట్లు ఆధారాలు సేకరించారు.