
హైదరాబాద్, వెలుగు: కరోనా కొత్త వేరియంట్, చైనాలో పరిస్థితిపై సోషల్ మీడియాలో మళ్లీ ఫేక్ ప్రచారం ఊపందుకుంది. చైనాలో జనాలు రోడ్ల మీదే పడి చనిపోతున్నట్టు, శవాలు గుట్టలుగా పడి ఉన్నట్టు వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. కొత్తగా వచ్చిన ఎక్స్‌బీబీ వేరియంట్ చాలా డేంజర్ అని, దాని వల్ల సెకండ్ వేవ్‌లో కంటే ఐదు రెట్లు మరణాలు ఎక్కువవుతాయని సోషల్ మీడియాలో ఓ మెసేజ్ సర్క్యులేట్ అవుతోంది. ఇదంతా ఫేక్ ప్రచారం అని డాక్టర్లు, ఆరోగ్యశాఖ చెబుతున్నా తప్పుడు ప్రచారానికి అడ్డుకట్ట పడడం లేదు. నిజమో, అబద్ధమో తెలుసుకోకుండానే ఫేక్ మెసేజ్‌లు, వీడియోలు వాట్సాప్ గ్రూపుల్లో షేర్ అవుతున్నాయి. వీటి వల్ల జనాలు భయాందోళనకు గురవుతున్నారు. దీంతో రెండ్రోజుల నుంచి కరోనా టెస్టుల కోసం వచ్చేవాళ్ల సంఖ్య స్పల్పంగా పెరిగినట్టు డాక్టర్లు చెబుతున్నారు.
ఎక్స్‌బీబీతోనూ మనకు నో డేంజర్
ఇప్పుడు వచ్చే కొత్త వేరియంట్ల వల్ల కూడా మన దేశ జనాలకు పెద్ద ప్రమాదం ఉండకపోవచ్చని డాక్టర్లు భావిస్తున్నారు. డబ్ల్యూహెచ్‌వో ప్రమాదకారిగా పేర్కొన్న ఎక్స్‌బీబీ వేరియంట్ మన రాష్ట్రంలో, దేశంలో ఎప్పట్నుంచో ఉంది. గడిచిన రెండు నెలల్లో 280 శాంపిళ్లను గాంధీ హాస్పిటల్ ల్యాబ్‌లో జీనోమ్ సీక్వెన్సింగ్ చేయించగా, అందులో 60% ఎక్స్‌బీబీ వేరియంట్ కేసులేనని తేలింది. వారిలో ఎవరికీ ఏమీ కాలేదు. దీన్ని బట్టి ఎక్స్‌బీబీ వేరియంట్‌తో ప్రమాదం లేదని స్పష్టమవుతోంది. ప్రస్తుతం ప్రచారంలో ఉన్న మరో వేరియంట్ బీఎఫ్7.. దీన్ని ఈ ఏడాది జులైలో మొదటిసారి స్పెయిన్, బెల్జియం తదితర దేశాల్లో కనుగొన్నారు. ఆయా దేశాల నుంచి వేల మంది మన దేశానికి వచ్చిపోయారు. అయినా, ఇక్కడ ఆ వేరియంట్‌తో ఇబ్బందేం కలగలేదు. ఆగస్టులో డబ్ల్యూహెచ్‌వో విడుదల చేసిన వీక్లీ రిపోర్ట్‌లో ఈ వేరియంట్‌ను ప్రస్తావించారు. ఒమిక్రాన్ సబ్ వేరియంట్ బీఏ5.2.1.7 నుంచే బీఎఫ్ 7 సబ్ వేరియంట్ వచ్చిందని పేర్కొంది. కానీ, ఇది ప్రమాదకరం అని ప్రకటించలేదు.
మనకేం ఇబ్బంది లేదు
ప్రస్తుతం ప్రపంచంలో సర్క్యులేషన్‌లో ఉన్న ఏ వేరియంట్‌తోనూ మన దేశ ప్రజలకు ప్రమాదం లేదు. ఇప్పటికే ఆయా వేరియంట్లన్నీ ఇక్కడ ఉన్నాయి. ఎక్స్‌బీబీ, బీఎఫ్7 వేరియంట్ కేసులు కూడా ఇక్కడ నమోదయ్యాయి. ఇతర దేశాల్లో వాటి ప్రభావం ఎలా ఉన్నా, మనకేం ఇబ్బంది లేదు. ప్రజలు కంగారు పడొద్దు. ఇంకేదైనా కొత్త వేరియంట్ వస్తే తప్ప, ఇప్పుడున్న వాటితో మనకేం సమస్య ఉండదు. కొత్త వేరియంట్ల ఏమైనా వస్తే ప్రభుత్వాలే ప్రజలను అలర్ట్ చేస్తాయి.
- డాక్టర్ కిరణ్ మాదాల, అసోసియేట్ ప్రొఫెసర్, కొవిడ్ రీసెర్చర్
ఏదైనా ఉంటే మేమే చెప్తాం
ఇతర దేశాల్లో ఉన్న పరిస్థితిని మానిటర్ చేస్తున్నాం. ఆయా దేశాల్లో ఉన్న పరిస్థితులు ఏవీ మన దగ్గర వచ్చే అవకాశం లేదు. అక్కడ కేసులకు కారణమవుతున్న వేరియంట్లతో మనకేం ప్రమాదం లేదు. ముందు జాగ్రత్తగా రాష్ట్ర ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటోంది. ప్రజలు ఆందోళన చెందొద్దు. ఒకవేళ ప్రజలకు చెప్పాల్సింది ఏదైనా ఉంటే ప్రభుత్వం తెలియజేస్తుంది. సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు సమాచారాన్ని నమ్మి, అనవసరంగా ఆందోళన చెందొద్దు.
- డాక్టర్ శ్రీనివాస్‌రావు, డైరెక్టర్, పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్
ఆందోళన వద్దు
మన రాష్ట్రంలో ఇప్పుడు 60 శాతం ఎక్స్‌బీబీ వేరియంట్ కేసులే నమోదవుతున్నాయి. ఆ వేరియంట్ సోకిన వాళ్లెవరికీ ఇబ్బంది ఏంలేదు. అనవసరంగా ఆందోళన చెందొద్దు. మాస్కు పెట్టుకొని, జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది.
డాక్టర్ రాజారావు, సూపరింటెండెంట్, గాంధీ హాస్పిటల్
చైనాకు మనకు ఎంతో తేడా
కరోనా థర్డ్ వేవ్‌కు కారణమైన ఒమిక్రాన్ వేరియంట్ ప్రభావం ఇతర దేశాల్లో విపరీతంగా ఉన్నప్పటికీ, మన దేశంలో దాని ఎఫెక్ట్ పెద్దగా కనిపించలేదు. కేసులు నమోదైనప్పటికీ, హాస్పిటలైజేషన్, డెత్స్ పెరగలేదు. కానీ, సోషల్ మీడియాలో జనాలను భయపెట్టేలా నెగెటివ్ ప్రచారం జరిగింది. ఇప్పుడు ప్రచారంలోకి వచ్చిన బీఎఫ్7, ఎక్స్‌బీబీ అనేవి ఒమిక్రాన్ సబ్ వేరియంట్లకు సబ్ వేరియంట్లు. జీరో కొవిడ్ పాలసీ పేరిట ఇన్నాళ్లు చైనా ప్రభుత్వం జనాలను బంధించి పెట్టింది. దీంతో జనాలు వైరస్ బారిన పడలేదు. వాళ్లకు సహజంగా రావాల్సిన ఇమ్యూనిటీ రాలేదు. ఇప్పుడు జీరో కొవిడ్ పాలసీ ఎత్తేయడంతో జనాలు బయట తిరుగుతున్నారు. సహజంగానే కేసులు పెరుగుతున్నాయి. మన దగ్గర మాత్రం పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. ఇక్కడ సెకండ్, థర్డ్ వేవ్ సమయంలో ప్రతి ఇంట్లోనూ కరోనా వ్యాపించింది. ఆ తర్వాత ఐసీఎంఆర్-, ఎన్‌ఐఎన్ సైంటిస్టులు చేసిన సీరో సర్వేలో మన రాష్ట్రంలో 93 శాతం మందిలో యాంటిబాడీస్ ఉన్నట్టు తేలింది.